ఎవరి జీవితంలోనైనా
బాల్యం
కుటుంబ బంధాలు,
ఆప్యాయతల,
కలబోతతో నిండిన
సుందర స్వప్నం…!!
ఉల్లాసంగా …ఉత్సాహంగా
ఇసుకలో కట్టుకున్న
గుజ్జన గూళ్ళు,సంక్రాంతికి అమ్మతో
పోటీ పడుతూ వేసిన ముగ్గులు
వెన్నెల వర్షంలా కురిసే
బాల్యపు అనుభూతులు….!!
గత కాలపు పాత వస్తువులు
చిన్ననాటి జ్ఞాపకాల నిచ్చెనలు
పుస్తక దొంతరల మధ్య పెట్టిన
నెమలి ఈకలు..
అనురాగంతో ముడిపడిన
బాల్యపు అలికిడులు…!!
ఏకబిగిన చదివించిన
చందమామ,
బాలమిత్ర పుస్తకాలు
పఠనా శక్తిని, మనోవికాసాన్ని పెంపొందించిన
బాల్యపు విజ్ఞానవీచికలు…!!
వాన చినుకుల్లో తడుస్తూ….
కాగితపు పడవలతో
చిందులే చిందులే…
కిటుకులు తెలిసిన చినుకులతో
మురిసి మైమరిచిన
బాల్యపు తళుకులు…!!
నీటి తొట్టిలో
కేరింతలు కొట్టిన చల్లదనం…
అక్కా, చెల్లెళ్లతో
గిల్లికజ్జాల కమ్మదనం
ప్రేమ పరిమళాలతో నిండిన
బాల్యపు తీపి గుర్తులు….!!
వెన్నెల రాత్రుల్లో ,వాకిట్లో
మంచం మీద పడుకొని
ఆకాశంలో
చందమామని చూస్తూ
అమ్మమ్మ,
తాతయ్య చెప్పే కథలతో
పరవశించిన
బాల్యపు మధుర స్మృతులు…!!
మూట కట్టిన
జ్ఞాపకాల ముత్యాలు
అమాయకపు
“బాల్యపు సరదాలు”…!!
– నలిగల రాధికారత్న