Suryaa.co.in

Andhra Pradesh

ఎస్సీ ఉపకులాలకు సమన్యాయం కోసమే వర్గీకరణ

– మాట నిలబెట్టుకుంటున్నాం…30 ఏళ్ల నిరీక్షణను నిజం చేశాం
– వర్గీకరణపై అపోహలు అవసరం లేదు, ఏ ఒక్కరికీ నష్టం జరగదు
– ప్రస్తుతం 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రం యూనిట్‌గా వర్గీకరణ
– 2026 జనాభా గణన తర్వాత జిల్లా యూనిట్‌గా వర్గీకరణ అమలు
– ఎస్సీల హక్కులు, గౌరవాన్ని కాపాడటానికి మొదటి నుంచి కట్టుబడి పని చేశాం
– అంటరానితనంపై అప్పట్లోనే జస్టిస్ పున్నయ్య కమిషన్ వేశాం
– 42 సిఫారసులు ఆమోదించి, 25 జీవోలు తీసుకొచ్చాం
– శాసనసభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
– ఎస్సీలపై వివక్ష అంశాన్ని ప్రస్తావించి సభలో ఉద్వేగానికి గురైన సీఎం

అమరావతి : ఎస్సీ వర్గీకరణపై ఎన్నికల సమయంలో చెప్పినట్లుగానే ఆ మాటను నిలబెట్టుకున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎస్సీ ఉపకులాల్లో సమన్యాయం కోసం సుప్రీంకోర్టు తీర్పు మేరకు వర్గీకరణ చేశామని తెలిపారు.

1995లో తాను మొదట ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు సుధీర్ఘ కాలం పాటు సాగిన వర్గీకరణ అంశం మళ్లీ తన హయాంలోనే సాకారం చేయడం సంతృప్తిని ఇచ్చిందని అన్నారు. ఎస్సీ వర్గీకరణపై శాసనసభలో గురువారం సీఎం ప్రసంగించారు. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన రాష్ట్రం యూనిట్ గా అమలు చేయాలని నిర్ణయించామని, 2026 జనాభా గణన తర్వాత వర్గీకరణను జిల్లా యూనిట్‌గా అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామని విరించారు.

బడుగు, బలహీన వర్గాలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పైకి తీసుకువచ్చేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. బుడగ జంగాలను కూడా ఎస్సీల్లో చేర్చాలని అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని కేంద్రానికి పంపుతామని సీఎం చంద్రబాబు తెలిపారు.

మాదిగ దండోరా పేరుతో మందకృష్ణ పోరాడారు

స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటినా అసమానతలపై పోరాడాల్సి రావడం బాధాకరం. నేటికీ కొందరు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారు. మాదిగలకు అన్యాయం జరిగిందని, మాదిగ పేరు చెప్పేందుకు కూడా కొందరు వెనకాడుతున్నారనే ఉద్దేశంతో మాదిగ దండోరా అనే ఆర్గనైజేషన్ పెట్టి మందకృష్ణ పెద్ద ఉద్యమం చేశారు. నేను వారి సమస్యలను ప్రత్యక్షంగా చూశాను. వారు డిమాండ్లు సమంజసమని భావించి 10.09.1996లో జస్టిస్ రామచంద్రరావు కమిషన్ వేశాం.

ఈ కమిషన్ రాష్ట్రమంతా తిరిగి అధ్యయనం చేసి 28.05.1997న నివేదిక ఇచ్చింది. సమాజంలో అసమానతలు తొలగి, పేదరికం లేని సమాజం లక్యంగా 1997, జూన్ 6న ఎస్సీ రిజర్వేషన్లను ఏ,బీ,సీ,డీలుగా వర్గీకరిస్తూ ఉత్వర్తులు ఇచ్చాం. నవంబర్ 30, 1999న నాటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ఆమోదంతో వర్గీకరణ అమల్లోకి వచ్చింది. దీంతో మాదిగలు, ఉప కులాలకు 22 వేలకు పైగా ఉద్యోగాలు వచ్చాయి. అయితే వర్గీకరణ అంశం కోర్టుకు వెళ్లడంతో వర్గీకరణ చేసే అధికారం ఒక్క పార్లమెంటుకే ఉందని 2004, నవబంర్ 5న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.

ఈ క్రమంలో నాటి కేంద్ర ప్రభుత్వం వేసిన ఉషా మెహ్రా కమిషన్ వర్గీకరణ అమలైన 2000-2004 మధ్య మంచి ఫలితాలు వచ్చాయని స్పష్టం చేసింది. ఎస్సీ రిజర్వేషన్‌ల వర్గీకరణకు అనుకూలంగా గతేడాది ఆగస్టులో సుప్రీం తీర్పు ఇచ్చింది. జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యులతో కూడి ధర్మాసనం తీర్పును వెలువరించింది.

నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా

30 ఏళ్ల క్రితం ఎస్సీ వర్గీకరణకు నేను కమిటీ వేశాను. నాటి నుంచి వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేంత వరకూ ఈ సుధీర్ఘ ప్రయాణంలో నేను భాగస్వామిని కావడం అరుదైన అవకాశంగా, నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. సామాజిక న్యాయం కోసం నేను చేసిన ఆలోచన సబబు అని అత్యున్నత న్యాయస్థానం తీర్పు ద్వారా స్పష్టమైంది.

ఎన్టీఆర్ సామాజిక న్యాయం కోసం అనునిత్యం తపించారు. దేశంలోనే మొదటిసారిగా ఎస్సీ, ఎస్టీలకు శాశ్వత గృహాలు నిర్మించిన వ్యక్తి ఎన్టీఆర్. దేశంలో మొదటిసారిగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుకునేందుకు సోషల్ వెల్ఫేర్ స్కూలు పెట్టింది కూడా ఎన్టీఆరే. నాడు ముఖ్యమంత్రిగా ఎస్సీల పట్ల వివక్షను నేను స్వయంగా చూశాను. ఆ రోజుల్లో తెలంగాణలో అయితే బాన్చత్ నీ కాళ్లు మొక్కుతా అనేవారు. అంటరానితనాన్ని రూపుమాపేందుకు నాకు చాలా సమయం పట్టింది.

ఆనాడు బోర్లు, బావుల దగ్గర నీరు తీసుకునేందుకు ఎస్సీలను రానిచ్చేవారు కాదు. వారు చెప్పులు లేకుండా ఊర్లో తిరగాలి. టీ స్టాల్ దగ్గర గ్లాస్ లు వేరే పెట్టేవారు. ఇవన్నీ చూశాక నేను జస్టిస్ పున్నయ్య కమిషన్ వేయగా బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చిత్తశుద్ధితో పనిచేశారు. రాష్ట్రంలో కుల వివక్ష ఉండకూడదనే ఉద్దేశంతో 25 మెమోలు, జీవోలు ఇచ్చాను.

మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ వేశాం

ఎస్సీ వర్గీకరణపై 15.11.2024లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రాతో ఏక సభ్య కమిషన్ వేశాం. వారు 13 ఉమ్మడి జిల్లాల్లో తిరిగి ప్రజల అభిప్రాయాలు తీసుకున్నారు. 10.03.2025న సమగ్ర నివేదిక ఇచ్చారు. 59 ఉపకులాలను 3 కేటగిరీలుగా విభజించి రిజర్వేషన్లు కేటాయించారు.

• గ్రూప్ 1 అత్యంత వెనుకబడింది
• గ్రూప్ 2 వెనుకబడింది
• గ్రూప్ 3 సాపేక్షంగా తక్కువ వెనుకబడింది

1. గ్రూప్ 1 అత్యంత వెనుకబడిన కేటగిరి -రెల్లి ఉప కులాలకు -1.0%
2. గ్రూప్ 2 వెనుకబడిన కేటగిరీ -మాదిగ ఉపకులాలకు – 6.5%
3. గ్రూప్ 3 సాపేక్షంగా వెనుకబడిన కేటగిరి -మాల ఉప కులాలకు – 7.5%

రోస్టర్ విధానం ప్రకారం మొదట 100 పోస్టులు వస్తే 8 పోస్టులు మాల సామాజిక వర్గానికి వస్తాయి. మాదిగ సామాజిక వర్గానికి 6 శాతం, రెల్లి సామాజిక వర్గానికి ఒక శాతం వస్తాయి. మూడు కలిపితే 15 శాతమవుతుంది. 200 పోస్టులు వస్తే మాల సామాజికి వర్గానికి 15 , మాదిగ సామాజిక వర్గానికి 13 , రెల్లికి 2 పర్సంటేజ్ వస్తుంది. తద్వారా రోస్టర్‌లో అందరికీ న్యాయం జరుగుతుంది.

కుల వివక్షపై యుద్ధం చేశాం

టీడీపీ ఆవిర్భావం నుంచి కుల వివక్షతపై యుద్ధం చేసింది. గిరిజన భూములు గిరిజనులకే చెందాలని చట్టాన్ని తెచ్చి అమలు చేశాం. 694 జీవో ప్రకారం జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ఎస్సీ, ఎస్టీల సమస్య పరిష్కార కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశాం. అధికారులంతా వారానికోసారి గ్రామానికి వెళ్లేలా ఆదేశాలిచ్చాం. కుల వివక్ష చూపే వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టేందుకు ఆదేశాలు ఇచ్చాం.

దేవాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో అంటరానితనం నిర్మూలనకు చర్యలు తీసుకున్నాం. అంటరానితనంపై పోరాడే వారికి జిల్లాస్థాయిలో 5 మందికి రూ.10 వేల నగదుతో అవార్డులు , రాష్ట్రస్థాయిలో రూ.25 వేల నగదుతో ప్రోత్సాహకాలు అందించాం. ఎస్సీ మహిళలపై అత్యాచారాలు జరిగితే కలెక్టర్, ఎస్పీలు 24 గంటల్లో వెళ్లి చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇచ్చాం. ఎస్సీ అట్రాసిటీస్‌పై ప్రత్యేక కోర్టులు పెట్టాం.

ప్రభుత్వ వ్యయంతో న్యాయవాదులను నియమించాం. సామాజిక సమానత్వంపై క్యాంపులు పెట్టి చైతన్యం తెచ్చాం. రాష్ట్ర స్థాయిలో నోడల్ ఆఫీసర్‌ని నియమించాం. ప్రతి నెలా 30వ తేదీన ప్రతి గ్రామంలో పౌరహక్కుల ఉత్సవాలు జరిపాం.

సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాం

మొదటిసారిగా దళితుణ్ణి లోక్ సభ స్పీకర్ ని చేసిన ఘనత తెలుగుదేశానిదే. ఎస్సీ బిడ్డ బాలయోగి స్పీకర్ గా బ్రహ్మాండంగా రాణించి దేశాన్ని మెప్పించాడు. 1999లో దళిత మహిళ ప్రతిభా భారతిని అసెంబ్లీ స్పీకర్ ని చేసిన ఘనత కూడా తెలుగుదేశానికే దక్కింది. కాకి మాధవరావును చీఫ్ సెక్రటరీ గా నియమించాం. ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ అధ్యక్షునిగా ఉన్నప్పుడే బి.ఆర్. అంబేద్కర్ కి భారతరత్న వచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వంలోనే అంబేద్కర్ ఫోటో పార్లమెంటులో పెట్టారు.

నేను యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా ఉన్నప్పుడు ఎస్పీ వర్గానికి చెందిన కే. ఎల్ .నారాయణన్ రాష్ట్రపతిని చేశాం. నాటి ప్రధాని వాజ్ పేయి సహకారంతో అబ్దుల్ కలామ్ ని రాష్ట్రపతిని చేయడంలోనూ టీడీపీ పాత్ర ఉన్నందుకు గర్వంగా ఉంది. షెడ్యూల్ కులానికి చెందిన రామ్ నాథ్ కోవింద్, గిరిజన మహిళ ముర్ముని ప్రధాని మోదీ రాష్ట్రపతులుగా నిలబెట్టారు. వీటన్నింటిలో నేనూ భాగస్వామిని అయినందుకు సంతోషంగా ఉంది. అందరికీ సామాజిక న్యాయం చేసేందుకు ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంది.

గత ప్రభుత్వం అన్యాయం చేసింది

గత ప్రభుత్వం ఐదేళ్లలో వెనుకబడిన కులాలకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. వారి సంక్షేమం పట్టించుకోలేదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎన్డీఏ ప్రభుత్వం ఎస్సీల కోసం రూ.804 కోట్ల ఔట్‌లేతో రూ.240 కోట్ల ప్రభుత్వ గ్రాంట్ తో ఆదుకుంది. ఎస్సీ, ఎస్టీలకు 2014 -19 మధ్య సబ్ ప్లాన్ నిధులు అందించాం. మాల, మాదిక సామాజిక వర్గాలకు జనాభా దామాషా ప్రకారం ఆర్థిక వనరులు కేటాయించాం.

మేము చేసిన ఎస్సీ వర్గీకరణ వల్ల 22 వేల మందికి లబ్ధి చేకూరింది. గత పాలకులు నేషనల్ ఫైనాన్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ నుంచి ఒక్క రూపాయి తేకపోగా పోతూ పోతూ బకాయిలు పెట్టిపోయారు.

పేదరికం లేని సమాజమే నా లక్ష్యం

20 ఇళ్లు మాత్రమే ఉన్న మారుమూల గ్రామంలో నేను పుట్టాను. మా ఊరికి అప్పట్లో సరైన రోడ్డు కూడా లేదు. రోడ్డు వేయించేందుకు ఇంటికో ఎడ్లబండి కట్టి మట్టి తోలేవాళ్లం. రోజుకు ఒకసారి ఊరికి బస్ వచ్చేది. నేను విద్యార్థి దశ నుంచి పోరాటాల్లో ఉన్నాను. అంచెలంచెలుగా ఎదిగాను. ఢిల్లీలో బిల్ గేట్స్ తో మాట్లాడినప్పుడు…30 ఏళ్ల క్రితం నాటి సంగతులు ఆయన గుర్తు చేస్తే చాలా సంతోషం అనిపించింది. రాష్ట్రంలో పేదరికం ఉండకూడదనే లక్ష్యంతో పనిచేస్తున్న నాకు ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్ సహకరిస్తున్నారు.

ఒకప్పుడు పీ3 తెచ్చి సంపద సృష్టించి పేదలను ఆదుకున్నాం. ప్రజలకు మెరుగైన వసతులు కల్పించాం. ఈ నెల ఉగాది నాడు పీ4 తెస్తున్నాం. సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న 10శాతం మంది పేదరికంలో అట్టడుగు స్థాయిలో ఉన్న 20 శాతం మందికి చేయూతనివ్వడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. తూర్పు కాపులకు కుల సర్టిఫికెట్ ఇచ్చే అంశంపైనా కసరత్తు చేస్తాం. సమాజంలో అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేయడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE