Suryaa.co.in

Telangana

సీఎం గారూ.. ఆర్‌ఆర్‌ఆర్ భూసేకరణ ఖర్చులో 50 శాతం నిధులు జమ చేయండి

– తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ

ఆర్‌ఆర్‌ఆర్ భూసేరణ వ్యయంలో 50 శాతం నిధులను భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థకు జమ చేయాలని కేంద్రమంత్రి గంగాపురం కి షన్‌రెడ్డి, సీఎం రేవత్‌రెడ్డిని కోరారు. ఆ మేరకు ఆయన ఒక లేఖ రాశారు. లేఖ యథాతధంగా..

గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి,

విషయం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు భారతమాల ఫేజ్-I క్రింద కేంద్ర ప్రభుత్వం నిర్మించనున్న రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణ వ్యయంలో 50% నిధులను భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థకు జమ చేయటం గురించి.

రూ. 26,000 కోట్లకు పైగా అంచనా వ్యయంతో తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా నిలిచేలా హైదరాబాద్ నగరం చుట్టూ 350 కి. మీ. ల పొడవున నిర్మించనున్న రీజనల్ రింగ్ రోడ్డుకు అయ్యే నిర్మాణ వ్యయాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం భరించనుండగా, భూసేకరణకు అయ్యే వ్యయంలో 50% కేంద్ర ప్రభుత్వం, మిగిలిన 50% రాష్ట్ర ప్రభుత్వం భరించేలా ఇరు ప్రభుత్వాల మధ్యన ఒప్పందం జరిగింది.

ప్రస్తుతం రీజనల్ రింగ్ రోడ్డులోని ఉత్తర భాగం నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా చెల్లించవలసిన 50% నిధులు ₹2,585 కోట్ల (అంచనా ప్రకారం) ను సత్వరమే జాతీయ రహదారుల ప్రాధికార సంస్థకు జమ చేసి నిర్మాణ పనుల ప్రారంభానికి సహకరించాలని కోరుతూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ప్రాంతీయ కార్యాలయం నుండి, కేంద్ర కార్యాలయం నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అనేకమార్లు లేఖలు వ్రాయడం జరిగింది. అయినప్పటికీ, ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆశించిన స్పందన రాలేదు.

రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా జమ చేయవలసిన నిధులను సకాలంలో జమ చేయనట్లయితే భూసేకరణ పనులు మరింత ఆలస్యమవుతాయి. భూసేకరణ ప్రక్రియ ఆలస్యమయితే, ఆ ప్రభావం రహదారి నిర్మాణం మీద పడుతుంది. ఈ ప్రాజెక్టు ఆలస్యమవటం వలన హైదరాబాద్ నగరం చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి నగరంలోనికి వచ్చే వాహనాల మూలంగా ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోవడమే కాకుండా, హైదరాబాద్ చుట్టుప్రక్కల ఉన్న జిల్లాల/ప్రాంతాల అభివృద్ధి కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

ఇదే విషయాన్ని తెలియజేస్తూ గతంలో ముఖ్యమంత్రి గారికి 03 ఫిబ్రవరి, 2023 న నేను లేఖను వ్రాశాను. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుండి సానుకూల స్పందన లేదు.

కావున, పై విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, ఈ ప్రాజెక్టు విషయంలో మీరు వ్యక్తిగతంగా ప్రత్యేకమైన చొరవ చూపించి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు భూసేకరణలో తన వాటాగా జమ చేయవలసిన 50% నిధులను త్వరగా విడుదల చేసి, ప్రాజెక్టు ఆలస్యం కాకుండా చూడగలరని కోరుతున్నాను.

ధన్యవాదాలు
భవదీయ
(జి. కిషన్ రెడ్డి)

LEAVE A RESPONSE