– హవ్వ.. సీఎం హామీలే అమలుచేయరా?
– రేషన్ కార్డులపైన ప్రధానమంత్రి ఫోటోను ఉంచాలి
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ
హైదరాబాద్: ‘‘సీఎం గారూ.. తెలంగాణ ఇజ్జత్ పోతోంది సారూ.. మీరు ఇచ్చిన హామీలే అమలుకాకపోతే, బయట రాష్ట్రాల దృష్టిలో తెలంగాణ పరువుపోదా? చేసుకుంటున్న ఉత్తుత్తి ప్రచారం చాలు. మీపాలనకు 420 రోజులాయె. ఇకనయినా మీరిచ్చిన ఆరు హామీలు వెంటనే అమలు చేయండి’’ అని కేంద్రమంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి ఘాటు లేఖ సంధించారు.
సంజయ్ లేఖ పూర్తి పాఠమిది.. రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇండ్లు, రేషన్ కార్డులను అర్హులందరికీ అందించకపోవడం దారుణం. రాష్ట్రంలో 12,991 గ్రామ పంచాయతీలుండగా, మండలానికి ఒక గ్రామం చొప్పున 561 గ్రామాలను మాత్రమే ఎంపిక చేయడమేంది? రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 70 లక్షల మంది రైతులుంటే, నేటి వరకు 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులే జమ చేయకపోవడం బాధాకరం.
10 లక్షల మంది వ్యవసాయ కూలీలుంటే నేటికీ 9 లక్షల 80 వేల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు వేయకపోవడమేంటి? 40 లక్షల కొత్త రేషన్ కార్డులిస్తామని 42 వేల 267 మందిని మాత్రమే గుర్తించడం హాస్యాస్పదం.
రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల కుటుంబాలు అర్హులైనప్పటికీ, నేటికీ ఒక్కరంటే ఒక్కరికి కూడా ఇంటిని నిర్మించకపోవడం సిగ్గు చేటు. ఇండ్ల నిర్మాణం కోసం రాష్ట్ర బడ్జెట్ లో రూ.7 వేల కోట్లకుపైగా కేటాయింపులు చేసినా నేటికీ నయాపైసా ఖర్చు చేయకపోవడం దారుణం. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో ముఖ్యమంత్రులు ప్రజలకు ఒక మాట ఇచ్చారంటే అదే శాసనంగా అమలయ్యేది
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక నాటి సీఎం కేసీఆర్, నేటి సీఎంగా ఉన్న మీరు హామీలను నిలబెట్టుకోలేకపోవడం బాధాకరం. సీఎం హామీలు అమలు కాలేదంటే ముఖ్యమంత్రి పదవికే కళంకం. సీఎం హామీలనే అమలు చేయలేకపోతే, మీ ఆధ్వర్యంలో పనిచేసే అధికారులు ఏ విధంగా జవాబుదారీ తనంతో పనిచేయగలరు? తెలంగాణ సీఎం హామీలు అమలు కాలేదంటే దేశం ద్రుష్టిలో తెలంగాణ సమాజాన్ని పలుచన చేయడమే.
6 గ్యారంటీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారు. ఇకనైనా వెంటనే అర్హులైన వారందరికీ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇండ్లను అందించాలి. కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా రేషన్ బియ్యం అందిస్తోంది. తెలంగాణ ప్రజలందరికీ తెలిసేలా రేషన్ షాపుల వద్ద, రేషన్ కార్డులపైన ప్రధానమంత్రి ఫోటోను ఉంచాలి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా మంజూరయ్యే ఇండ్లకు ఆ పేరును యధాతథంగా కొనసాగించాలి. లేనిపక్షంలో ప్రజా తిరుగుబాటు తప్పదు. జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి