– రాజమహేంద్రవరంలో ప్రత్యేక కొబ్బరి అభివృద్ధి మండలి కార్యాలయం ఏర్పాటుకి వినతి
లోక్ సభలో రాజమండ్రి ఎంపి దగ్గుబాటి పురందేశ్వరి
ఢిల్లీ: కొబ్బరిని ఉత్పత్తి చేసే కీలక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉన్న నేపథ్యంలో, తూర్పు గోదావరి జిల్లాలో ఒక ప్రత్యేక కొబ్బరి అభివృద్ధి మండలి కార్యాలయం ఏర్పాటు చేయడం అత్యంత అవసరమని రాజమండ్రి ఎంపి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. రాజమండ్రిలో ఈ కార్యాలయాన్ని నెలకొల్పితే రైతులకు ప్రత్యక్ష సహాయం అందుబాటులోకి వస్తుంది కనుక వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేసారు.
లోక్ సభలో రూల్ 377 కింద స్పీకర్ ప్రత్యేక అనుమతితో ఆమె కొబ్బరి రైతుల సమస్యలను ప్రస్తావించారు. కొబ్బరి ఉత్పత్తి పెంపునకు తోడ్పడడంతో పాటు, గ్రామీణ ప్రజల జీవనోపాధిని ఈ చర్య బలోపేతం చేస్తుందన్నారు. అదేవిధంగా ఎగుమతులను పెంచి రాష్ట్రంలోని వ్యవసాయ అవకాశాలను విస్తరించడానికి కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని రాజమండ్రిలో కొబ్బరి అభివృద్ధి మండలి కార్యాలయం ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ప్రపంచంలో మూడవ అతిపెద్ద కొబ్బరి ఉత్పత్తిదారు భారత్ కాగా, ఆంధ్రప్రదేశ్ నాలుగవ అతిపెద్ద కొబ్బరి సాగు రాష్ట్రంగా ఉందన్నారు. ఏపీలో 1.23 లక్షల హెక్టార్లలో కొబ్బరి తోటలు విస్తరించి ఉన్నాయన్నారు. ముఖ్యంగా కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తృతంగా కొబ్బరి సాగు జరుగుతోందని తెలిపారు. కేరళలో కొబ్బరి ఉత్పత్తి ఇప్పటికే సంతృప్త స్థాయికి చేరిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్‌లోని సారవంతమైన నేల, అనుకూలమైన వాతావరణ పరిస్థితులు కొబ్బరి సాగు విస్తరణకు అద్భుత అవకాశాలను అందిస్తున్నాయని పురందేశ్వరి సభకు వివరించారు. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ఉద్యోగ అవకాశాలను పెంచుతుందన్నారు.
1981లో స్థాపించబడిన కొబ్బరి అభివృద్ధి మండలి రైతులకు సాంకేతిక పద్ధతులు, తెగుళ్ల నివారణ, నాణ్యమైన మొక్కల పెంపకం, ఎరువుల వినియోగంలో సూచనలు వంటి కీలక మార్గదర్శకాలను అందిస్తోంది. అయితే, కొబ్బరి అభివృద్ధి మండలి ప్రధాన కార్యాలయం కేరళలో ఉండటం, ఆంధ్రప్రదేశ్‌కు సమీప ప్రాంతాల్లో ప్రాంతీయ కార్యాలయాలు లేకపోవడంతో, రైతులు సకాల సహాయం పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
ఇటీవల తెల్ల నల్లిబూజుల వ్యాప్తితో పాటు, బడ్ రాట్, ఆకు కుళ్లు (లీఫ్ రాట్), తొడిమ రక్తస్రావం (స్టెమ్ బ్లీడింగ్), తాటిపాక వంటి వ్యాధులు కొబ్బరిపై దాడి చేయడంతో రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని MP అన్నారు. వీటి నివారణకు అవసరమైన సహాయం, కొబ్బరి చెట్లు ఎక్కే కార్మికులకు బీమా సేవలు, సబ్సిడీలను పొందే అవకాశాలు భౌగోళిక దూరం వల్ల రైతులకు అందుబాటులో లేకుండా పోతున్నాయన్నారు.