– అసెంబ్లీలో బీజేపీ బలపడేదెప్పుడు?
– ఎమ్మెల్యే సీట్లపై ఎందుకు దృష్టి పెట్టరు?
– నాడు దిగ్గజాలతో అసెంబ్లీ కళకళ
– ఇప్పుడు వార్డు మెంబరుగా ఓడినవారికీ అందలం
– ఇన్ని దశాబ్దాల్లో పదిసీట్లూ గెలవలేని దయనీయం
– ఢిల్లీకి ఏపీ-తెలంగాణపై అవగాహన లేకపోవడమే అసలు సమస్య
– రాజకీయ అవగాహన లేని సంఘటనామంత్రులు
– పార్టీకి దిశానిర్దేశం చేయలేని వైఫల్యం
– స్థానిక రాజకీయాలపై పట్టు పెంచుకోని ప్రచారక్‌లు
– హిందూ కోణం తప్ప రాజకీయ కోణం ఏదీ?
– అసమర్ధులను అందలమెక్కిస్తున్న వైనం
– ‘సంతృప్తి’పరిచే వారికే స్థానమన్న విమర్శలు
– సంఘంలో పెరుగుతున్న ‘బలహీనతలు’
– సీట్ల ఎంపిక, కూర్పులో బయటపడ్డ డొల్లతనం
– తెలుగురాష్ట్రాలలో కమల ‘విలాపం’
( మార్తి సుబ్రహ్మణ్యం)
బీజేపీ జాతీయ స్థాయిలో అతి పెద్ద పార్టీ. అత్యధిక స్థాయిలో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలున్న పార్టీ. సభ్యత్వాల్లోనే కాదు. నిధుల సేకరణలోనూ నెంబర్‌వన్. కానీ ఏపీలో మాత్రం ఆ పార్టీ పరిస్థితి ఇప్పటికీ దయనీయం. డిఎంకె, అన్నాడిఎంకె, టీడీపీ, ఏజీపీ, టీఆర్ఎస్.. ఇప్పటి ఆప్ వరకూ అన్ని ప్రాంతీయ పార్టీలూ, తక్కువ కాలంలోనే అధికారంలోకి వచ్చాయి.
కానీ జాతీయ పార్టీ అయిన బీజేపీ మాత్రం.. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో గానీ.. ఇప్పుడు ఏపీ- తెలంగాణలో గానీ పట్టుమని పదిహేను మంది ఎమ్మెల్యేలు నేరుగా గెలిచే పరిస్థితి లేదు. కారణం ఏమిటి? ఢిల్లీకి ఏపీ-తెలంగాణ పరిస్థితులపై అవగాహన లేకపోవడమా? లేక ఆయా రాష్ట్రాలకు వచ్చిన ఇన్చార్జుల అవగాహనా లోపమా? ఇవన్నీకాకుండా సంఘటనామంత్రుల అసమర్ధ వైఖరా? ప్రచారక్‌ల దృష్టికోణం లోపమా? ఇదీ తెలుగురాష్ట్రాల్లో బీజేపీ శ్రేణుల ఆవేదన.
ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీకి కార్యకర్తల సంఖ్యాబలం తక్కువే అయినప్పటికీ, పార్టీ ఉన్నంతలో బలంగానే ఉండేది. బీజేపీ కార్యకర్తలు పదిమంది జెండాలు పట్టుకుని వస్తే అధికారులు హడలిపోయేవారు. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత అంత పోరాడేవారు లేరు. అన్నీ మీడియా పోరాటాలే. అదివేరే విషయం!
వి.రామారావు, చలపతిరావు, జూపూడి యజ్ఞానారాయణ, వెంకయ్యనాయుడు, విద్యాసాగర్‌రావు, బండారు దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి, కృష్ణంరాజు, కిషన్‌రెడ్డి, కంభంపాటి హరిబాబు వంటి హేమాహేమీలు చట్టసభలకు, కేంద్రమంత్రివర్గాల్లో ప్రాతినిధ్యం వహించారు. వీరిలో వి.రామారావు, దత్తాత్రేయ, కంభంపాటి హరిబాబు గవర్నర్ పదవులు కూడా నిర్వహించారు. అందరికంటే వెంకయ్యనాయుడు హవా జాతీయ స్థాయికి ఎదిగి, ఉప రాష్ట్రపతి వరకూ వెళ్లారు.
కానీ రెండు రాష్ట్రాల్లో బీజేపీ రాజకీయంగా ఎదిగింది లేదు. ఇంతమంది హేమాహేమీలు ఉండి.. కేంద్రంలో ఇన్ని సార్లు అధికారంలో ఉన్నప్పటికీ, రెండు రాష్ట్రాల్లో ప్రతిపక్ష హోదా దక్కించుకున్న దాఖలాలు లేవు. పార్టీలో వ్యక్తులు ఎదుగుతున్నారు. కానీ పార్టీ ఎదుగుదల మాత్రం ఎందుకు ఆగిపోయింది? కారణం ఢిల్లీ నాయకత్వ నిర్ణయలోపమా? సంఘటనా మంత్రుల అసమర్ధతా? ఉత్తరాది నుంచి దిగుమతి అయ్యే ఇన్చార్జిలకు స్థానిక రాజకీయాలపై అవగాహనా లోపమా? ఇదీ ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లో బీజేపీలో జరుగుతున్న చర్చ.
ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ పతాకస్థాయికి వెళ్లింది. ఒకదశలో 30-40 స్థానాలు గెలిచి, ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించే దశకు వెళ్లింది. అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్, ఆ స్థాయిలో కేసీఆర్ సర్కారుపై సమరశంఖం పూరించారు.కానీ ఆ దశలో ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను అరెస్టు చేయకుండా కేంద్రం తాత్సారం చేసింది. ఆ దశలో నాయకత్వం సంజయ్‌ను హటాత్తుగా తప్పించేసింది. లౌక్యుడైన కిషన్‌రెడ్డిని మళ్లీ తప్పించింది. ఆయన నాయకత్వంలో పార్టీకి ఎప్పుడూ సంతృప్తికర స్థానాలు వచ్చింది లేదు.
దానితో బీఆర్ఎస్-బీజేపీ ఒకటేనన్న భావన జనంలోకి వెళ్లింది. సంజయ్ చేసిన పోరాటం బీజేపీకి కాకుండా కాంగ్రెస్‌కు లాభం చేకూర్చింది. ఇది జరిగిన ఆరేడునెలల తర్వాత కవితను ఈడీ అరెస్టు చేసింది. అదేదో అప్పుడే చేసి ఉంటే, బీజేపీ ఈరోజు తెలంగాణలో ప్రభుత్వాన్ని శాసించే పరిస్థితి ఉండేదన్నది సీనియర్ల భావన. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోనందుకు, బీజేపీ తగిన మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఉత్తరాది నుంచి తరుణ్‌చుగ్ అండ్ కోకు, తెలంగాణలో ఉన్న సామాజిక పరిస్థితులపై అవగాహన లేకపోవడమే దానికి కారణమన్నది సీనియర్ల ఉవాచ.
కాగా తెలంగాణ భౌగోళిక పరిస్థితులు తెలిసిన ఏపీవారికి తెలంగాణ ఇన్చార్జిగా.. ఏపీ భౌగోళిక పరిస్థితులు తెలిసిన తెలగాంగాణ నేతలను ఏపీ ఇన్చార్జిగా నియమిస్తే, అద్భుత ఫలితాలు వస్తాయన్న ఆలోచన కూడా తమ పార్టీకి లేదని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. ‘‘రెండు రాష్ట్రాలు వేరయి, ఒకే భాష మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రయోగం చేస్తే తప్పేమిటి? ఉత్తరాది వారికి తెలుగు రాష్ట్ర ప్రజల పల్సు ఎలా తెలుస్తుంది? మళ్లీ మేమే బ్రీఫ్ చేయాలి కదా’’? అని ఓ రాష్ట్ర నేత ప్రశ్నించారు.
ఇక ఏపీలో పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. వెంకయ్యనాయుడు వల్లనే ఏపీలో పార్టీ చతికిలపడిందని, ఆయన హయాంలో ఎవరినీ ఎదగనీయకుండా చేశారన్న విమర్శ పార్టీలో చాలాకాలం నుంచీ ఉంది. ఆ మాట పూర్తిగా అబద్ధం కానప్పటికీ.. వెంకయ్య ప్రత్యక్ష రాజకీయాల నుంచి నిష్క్రమించి చాలాఏళ్లయింది. ఆయన వల్లే పార్టీ ఎదగలేదని విమర్శించిన వాళ్లెవరూ, పార్టీని బలపరిచేందుకు ప్రయత్నించిన పాపాన పోలేదు.
వార్డు ఎన్నికల్లో కూడా గెలవలేని వాళ్లు.. ఏకంగా రాష్ట్ర అధ్యక్షులు, పట్టుమని పదిఓట్లు తెచ్చుకోలేని వారు రాష్ట్ర కమిటీలో పెద్ద పదవులు వెలగబెడుతున్న వైచిత్రికి, ఆరెస్సెస్ నాయకులే కారణమన్నది ఒక విమర్శ. సొంత వీధిలో పలుకుబడి లేనివాళ్లంతా ఇప్పటికీ రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులుగా చెలామణి అవుతున్న దుస్థితికి, నిస్సందేహంగా సంఘ నేతల పెత్తనమేనన్నది సీనియర్ల ఉవాచ. ఇప్పుడు బీజేపీలో.. టీడీపీ అనుకూల-టీడీపీ వ్యతిరేక వర్గాలున్నాయే తప్ప, అసలు బీజేపీ నేతలను పట్టించుకునే దిక్కులేని పరిస్థితి.
బీజేపీకి దిశానిర్దేశం చేసే కొంతమంది ఆరెస్సెస్ నేతల స్వార్ధం, రకరకాల బలహీనతలు, దృష్టికోణ లోపం వల్ల పార్టీ తిరోగమనం దిశగా పయనిస్తోందన్న ఆవేదన వ్యక్తమవుతోంది. సంఘ్ నేతలను ‘సంతృప్తి’పరిస్తే చాలు. అనుకున్న పని అవుతుందన్న భావన స్థిరపడిపోయింది. శ్రీకాకుళం జిల్లాలో బీజేపీకి నామమాత్ర బలం కూడా లేదు. ఎచ్చెర్ల నియోజకవర్గం బీసీలది. కానీ అక్కడ పట్టుమని పది కమ్మ కుటుంబాలు లేకపోయినా కమ్మ నేతకు అసెంబ్లీ సీటివ్వడం విస్మయపరిచింది. ఇలాంటి దిక్కుమాలిన నిర్ణయాల వల్లే బీజేపీ చతికిలపడుతోందంటున్నారు.
అసలు పార్టీలో చేరని మాధవీలతకు హైదరాబాద్ ఎంపీ సీటిచ్చినట్లే… నాలుగురోజులక్రితం పార్టీలో చేరిన వరప్రసాద్‌కు తిరుపతి ఎంపీ సీటివ్వడం మరో వింత. అక్కడ మాజీ ఐఏఎస్ దాసరి శ్రీనివాసులు కొన్నేళ్ల నుంచి, సమరసతా ఫౌండేషన్ పేరుతో విస్తృతంగా పనిచేస్తున్నారు. ఆయనను కాదని, మతం మారిన క్రైస్తవుడన్న ఆరోపణలున్న వరప్రసాద్‌కు ఇవ్వడంపై, పార్టీ నేతలే విస్తుపోతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి గురుమూర్తి దళిత క్రైస్తవుడని విమర్శించిన బీజేపీ.. ఇప్పుడు అదే మతం మారిన వరప్రసాద్‌కు ఎలా సీటిచ్చిందో, తమకూ అర్ధం కావటం లేదని బీజేపీ సీనియర్లు నోరెళ్లబెడుతున్నారు.
జాతీయ స్థాయిలో తెలుగువారి మన్ననలు పొందిన నర్సాపురం సిట్టింగ్ ఎంపి రఘురామకృష్ణంరాజును కాకుండా, ఎవరికీ తెలియని శ్రీనివాసవర్మ అనే నేత పేరు తెరపైకి తెచ్చి ఆయనకు ఆ సీటివ్వడం బట్టి.. రాష్ట్రంలో సంఘ్ నేతల మెదడు-తెలివి ఏ స్ధాయిలో పనిచేస్తుందో అర్ధమవుతుంది. నిజానికి రచ్చబండ ద్వారా కోట్లాదిమంది తెలుగువారిలో ఇమేజ్ సంపాదించుకున్న రఘురామరాజు కంటే, బీజేపీ సీటిచ్చిన శ్రీనివాసవర్మ ఒకటో వంతు కూడా, ఏ అంశంలోనూ సరితూగరన్నది మనం మనుషులం అన్నంత నిజం.
ఇక విశాఖలో గత మూడేళ్లుగా పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుకు, విశాఖ సీటు కోరక పోవడం మరో వింత. ఈ విషయంలో ఎవరు ఎవరికోసం చక్రం తిప్పారన్నది ప్రశ్న. పార్టీకి కనీస బలం లేని తిరుపతి సీటు అడిగిన సంఘ-పార్టీ పెద్దలు.. పార్టీ-వ్యక్తుల బలం ఉన్న విశాఖ,నర్సాపురంలో బలమైన అభ్యర్ధులను పెట్టకపోవడం బట్టి, బీజేపీలో రాజకీయకోణం ఉన్న సంఘ్ పెద్దలు ఎవరూ లేరన్నది స్పష్టమైంది.
బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం ముగిసింది. కానీ ఇన్నేళ్లలో అసెంబ్లీలో పార్టీ ప్రధాన ప్రతిపక్ష స్ధాయికి రావాలన్న అసలు సిసలు బీజేపీ కార్యకర్తల కోరిక, ఇంకా కలగానే మిగిలింది. ఏపీలో బలపడాలన్న కోరిక, లక్ష్యం పార్టీకి నిజంగా ఉంటే.. పురందేశ్వరి సహా అగ్రనేతలంతా అసెంబ్లీకే పోటీచేయించాలి తప్ప, ఎంపీలకు ఎందుకన్న చర్చ పార్టీ వ ర్గాల్లో జోరుగా సాగుతోంది.
‘‘ ఎలాగూ పార్టీకి సొంత బలం లేదు. అంతా పేపర్ టైగర్లే. గ్రామాల్లో నేతలను గుర్తు పట్టే పరిస్థితి లేదు. ఎవరికి వారు తమది జాతీయ స్థాయిఅని భ్రమించే పరిస్థితి. ఈ పార్టీలో అంతా మోదీ, అమిత్‌షా, నద్దామే ఎక్కువ. సంఘటనామంత్రులకు ఎక్కడా సొంత అజెండాలు ఉండవు. కానీ ఇక్కడ మాత్రం వచ్చిన సంఘటనా మంత్రులకు సొంత అజెండాలున్నాయి. ఒక వార్డు సభ్యుడిగా గెలవలేని నాయకుడి కి రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఇచ్చిన ఘనత మాది. పాత సంఘటనామంత్రి ఆయన కోసం కృషి చే శారు. సంఘం వాళ్లను సంతృప్తిపరిస్తే చాలు. వాళ్లకు లోకల్‌గా ఫేస్ వాల్యూ అవసరం లేదు. మీటింగుకు నలుగురిని కూడా తీసుకురాలేని పెద్ద నాయకులు, మా పార్టీలో కొన్ని డజన్ల మంది ఉంటారు. మరి వాళ్లకే జిల్లా, రాష్ట్ర, జాతీయ, కోర్ కమిటీలో పదవులిస్తారు. దీనికి కారణం సంఘం వాళ్లకు రాజకీయ అవగాహన, రాజకీయ దృష్టి కోణం లేకపోవడమే’’నని ఓ బీజేపీ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.
కాగా ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్, అర్వింద్, ఈటల వంటి అగ్రనేతలంతా అసెంబ్లీకి పోటీ చేసిన విషయాన్ని పార్టీ సీనియర్లు గుర్తు చేస్తున్నారు. కానీ ఆ పని ఏపీలోఎందుకు చేయటం లేదు? సీనియర్లందరినీ అసెంబ్లీకి పోటీ చేయకుండా ఎవరు అడ్డు పడుతున్నారు? అసెంబ్లీలో పార్టీ వాణి వినిపించేవారి సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే పార్టీ అంత బలపడుతుందన్న ఆలోచన సంఘ్ నేతలకు లేకపోవడం దారుణమంటున్నారు.
‘‘ఇప్పటికైనా మించిపోయింది లేదు. నామినేషన్లకు ఇంకా చాలా సమయం ఉంది. ఎలాగూ 10 సీట్లు చేతిలో ఉన్నాయి. వాటిలో ముక్కు మొహం తెలియని అభ్యర్ధుల స్థానంలో జాతీయ, రాష్ట్ర నేతలను బరిలో దించాలి. పురందీశ్వరిని కూడా అసెంబ్లీకే పోటీ చేయిస్తే ఆ సీరియస్‌నెస్ వేరు. ఈ విషయంపై సంఘ్ నేతలు సీరియస్‌గా ఆలోచించాలని’’ రాయలసీమకు చెందిన ఓ నేత సూచించారు.
సంఘ్ నేతలకు ఉన్న వివిధ రకాల బలహీనతలను, పార్టీ నేతలు సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు, ఇటీవలి కాలంలో పెరుగుతుండటం పార్టీ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రధానంగా ప్రకాశం జిల్లాలో ఇద్దరు మహిళామోర్చా కార్యకర్తలు సిగ్గు విడిచి, తాము ఎవరితో ఉన్నది.. తమను వారి వద్దకు ఎవరు పంపించారన్న నిజాలను నిర్భయంగా, వీడియో ద్వారా పార్టీకి పంపిన వైనం సంచలనం సృష్టించింది. అందులో తమతో ఉన్న నాయకుడి పేరు, తమను ఆయన వద్దకు పంపిన జిల్లా నేత పేరు కూడా స్పష్టంగా ప్రస్తావించారు.
అయినా ఇప్పటిదాకా ఎవరిపైనా చర్యలు తీసుకోలేదంటే, సీనియర్లకు ఎన్ని రక్షణ కవచాలున్నాయో స్పష్టమవుతోంది. అదేవిధంగా మరొక అగ్రనేత గతంలో తణుకు, ఒంగోలు పర్యటనలో జరిపిన అనైతిక ఘటనలు కూడా పార్టీని కుదిపివేశాయి. ఇలాంటి బలహీనతలను అడ్డుపెట్టుకునే కొందరు సీనియర్లు, స్థానికంగా ఎలాంటి గుర్తింపు లేకపోయినా రాష్ట్ర-జాతీయ స్థాయికి ఎదిగారన్న విమర్శలు చాలాకాలం నుంచి వినిపిస్తున్నాయి. అయినా చర్యలు శూన్యమన్న ఆవేదన వ్యక్తమవుతోంది. రాష్ట్ర రాజకీయాలపై పూర్తి స్థాయి అవగాహన ఉన్న సంఘటనా మంత్రితోపాటు, ప్రచారక్‌లను నియమించాలన్నది పార్టీ వ్రేణుల సూచన.