Suryaa.co.in

Andhra Pradesh

దర్శి వైసీపీ టికెట్ శిద్దాకే ?

– ఫలించిన చెవిరెడ్డి ఒత్తిడి?
– బాలినేని మద్దతు కూడా శిద్దాకే
– బూచేపల్లికి జగన్ ఝలక్
– తాజాగా జగన్‌ను కలిసిన శిద్దా
( అన్వేషి)

ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ వైసీపీ అంతర్గత రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటిదాకా వైసీపీకి టికెట్ బూచేపల్లి సుబ్బారెడ్డి తనయుడు శివప్రసాదరెడ్డికే ఖాయమన్న ప్రచారం జరిగింది. అయితే మాజీ మంత్రి, అక్కడ నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన శిద్దా రాఘరరావు అనూహ్యంగా తెరపైకొచ్చినట్లు సమాచారం.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం…ఒంగోలు వైసీపీ అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఒత్తిడి మేరకు దర్శి అసెంబ్లీ వైసీపీ టికెట్ మాజీ మంత్రి శిద్దా రాఘవరావుకే ఖరారయినట్లు తెలుస్తోంది. ఆ మేరకు చెవిరెడ్డి పార్టీ అధినేత-సీఎం జగన్‌పై తీసుకువచ్చిన ఒత్తిడి ఫలించినట్లు చెబుతున్నారు. దర్శిలో శిద్దా అయితే విజయం సాధిస్తారని, ఆయనకు అన్ని వర్గాల మద్దతు ఉందని చెవిరెడ్డి సీఎంకు స్పష్టం చేసినట్లు సమాచారం. వివాదరహితుడైన శిద్దాకు సీటిస్తే ఆయనకు అన్ని వర్గాలు ఓటేస్తాయని సీఎంకు వివరించారట.

ఒకవేళ బూచేపల్లికి సీటు ఇచ్చినా శిద్దా అనుచరులు ఆయనకు పనిచేయరని, ఆ ప్రభావం తన ఎంపీ సీటుపై పడుతుందని చెవిరెడ్డి వివరించారు. దర్శిలోని మండల స్థాయి నేతలు సైతం శిద్దా వైపే మొగ్గు చూపిస్తున్నందున, ఆయనకు టికెట్ ఇవ్వడమే సబబని చెవిరెడ్డి వాదించినట్లు సమాచారం.

ప్రధానంగా దర్శి సీటు ఫలితం తన ఎంపీ సీటుపై ప్రభావం పడకుండా చూడాలని చెవిరెడ్డి అభ్యర్ధించారు. పైగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా, గతంలో దర్శి సీటు శిద్దాకే ఇవ్వాలని జగన్‌ను కోరిన విషయం తెలిసిందే. దానితో చెవిరెడ్డి ఒత్తిడికి తలొగ్గిన జగన్.. చివరకు శిద్దా వైపే మొగ్గు చూపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి శిద్దా దర్శి అభ్యర్ధి అయితే చెవిరెడ్డికి ఎలాంటి ఆర్ధికభారం ఉండదు. సహజంగా ఎంపీ అభ్యర్ధులు ఎమ్మెల్యే అభ్యర్ధులకు ఆర్ధిక సహాయం చేస్తుంటారు. దర్శిలో శిద్దా అభ్యర్ధి అయితే ఎంపీ అభ్యర్ధి చెవిరెడ్డికి అలాంటి సమస్య ఉండదు.

కాగా శిద్దా రాఘవరావు తిరిగి టీడీపీలో చేరి దర్శి నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం, గత కొద్దిరోజుల నుంచి జోరుగా వినిపించింది. అయితే తాజాగా ప్రకాశం జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం జగన్‌తో శిద్దా భేటీ అయ్యారు. ఆ సందర్భంలోనే ఆయనకు దర్శి సీటుపై జగన్ నుంచి హామీ లభించిందని చెబుతున్నారు.

LEAVE A RESPONSE