స్టేట్ బ్యాంక్ తోక ముడిచింది!

గత ఆరేళ్లుగా, మూడో కంటికి తెలియకుండా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకు బాండ్ల రూపంలో వేలాది కోట్లు సమర్పించుకుంటున్న వారి వివరాలు, అవి అందిపుచ్చుకున్న పార్టీల జాతకాలను వెల్లడి చేయాల్సిందేనని, ఈ తతంగానికి నోడల్ బ్యాంక్ గా వ్యవహరిస్తున్న స్టేట్ బ్యాంక్ ను సుప్రీం కోర్టు, గత నెల 15 న ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నెల ఆరో తేదీ లోగా ఆ పని చేయవలసి ఉన్న స్టేట్ బ్యాంక్ ఆసాములు….; సుప్రీం తీర్పు వచ్చిన 26 రోజుల పాటు దానిని పట్టించుకోలేదు.

గడువుకు ఒకరోజు ముందు మాత్రం, మొన్న 5 వ తేదీన – తమకు ఓ మూడు నెలలు సమయం ఇస్తే, వివరాలు అన్నీ ఎన్నికల సంఘానికి ఇస్తామంటూ, తాపీగా ఓ పిటిషన్ కోర్టు లో ” పడేశారు”. ఆ పిటిషన్ చూసిన సుప్రీం ధర్మాసనం, స్టేట్ బ్యాంక్ పై అగ్గి ఫైరై పోయింది. వేషాలు కట్టి పెట్టి,మంగళ వారం సాయంత్రం అయిదింటి లోగా ఎన్నికల సంఘానికి ఇవ్వకపోతే, కోర్టు ధిక్కరణ చర్యలు ఉంటాయని సుప్రీం కళ్లెర్ర జేసింది.

అంతే! దెబ్బకు దెయ్యం పరార్ అన్నట్టుగా, ఎలోక్టరల్ బాండ్స్ కు సంబంధించిన మొత్తం వివరాలను స్టేట్ బ్యాంక్ మంగళవారమే కేంద్ర ఎన్నికల సంఘానికి అందచేసింది. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం ధ్రువీకరించింది.

ఈ మొత్తం వ్యవహారం లో బోలెడంత నీతి ఉన్నది. హైకోర్టులు గానీ, సుప్రీం కోర్టు గానీ ధృఢం గా నిలబడితే, వ్యవస్థలు తోకాడించడం కుదరదు. పాలక పెద్దలకు వత్తాసు పలకడం కుదరదు. తమ చేతికి మట్టి అంటకుండా పాలక పెద్దలు అమాయకత్వం నటించడం కుదరదు.
వాటిని నిర్వీర్యం చేయడం కూడా అంత సులభం కాదు. ఈ ఎలక్టరల్ బాండ్స్ కేసులో సుప్రీం కోర్టు వ్యవహార శైలే ఇందుకు నిదర్శనం.

ఈ విధానాన్ని రద్దు చేయడమే గాక, ఇప్పటి దాకా జరిగిన లావాదేవీలను వెల్లడించమని, ఫిబ్రవరి 15 న సుప్రీం కోర్టు స్టేట్ బ్యాంక్ ను ఆదేశించింది.

ఈ ఆదేశాన్ని స్టేట్ బ్యాంక్ ఒక్క రోజులోనే పాటించి ఉండవలసింది. కానీ, 26 రోజుల పాటు, కాలిమీద కాలు… నోట్లో వేలు వేసుకుని కూర్చుంది. పైనున్న “పెద్దలు” చూసుకుంటారులే అనే ధీమా కావచ్చు .

తీరా గడువు ముంచుకు వచ్చాక, ఇంకో మూడు నెలలు గడువు కోరింది. అంటే, అప్పటికి సార్వత్రిక ఎన్నికలు అయిపోపోతాయి గనుక, ఎన్నికల పై ఆయా పార్టీల రంకు రాజకీయాల ప్రభావం చూపడం కుదరదనేది… బ్యాంక్ కు ఇచ్చిన “న్యాయ సలహా ” అయి ఉంటుంది.

సుప్రీం కోర్టు కు స్టేట్ బ్యాంక్ గేమ్ ప్లాన్ అర్ధం అయింది. 24 గంటల్లో వెల్లడి చేయాల్సిందే అని తేల్చి చెప్పడం తో, బ్యాంక్ కిక్కురుమనకుండా సుప్రీం ఆదేశాలను పాటించింది. మరి, వివరాలు ఇవ్వడానికి ఒక్కరోజు కూడా పట్టని దానికి, స్టేట్ బ్యాంక్ మూడు నెలల గడువు ఎందుకు అడిగింది? అదే మరి – రాజకీయం.

స్టేట్ బ్యాంక్ ఉదంతం, మన దేశం లోని వ్యవస్థలు…. పాలకుల అడుగులకు మడుగులు ఎలా ఎత్తుతున్నాయో చెప్పడానికో ఉదాహరణ.
వ్యవస్థలు, తమ పని తాము చెయ్యాలి అంటే సుప్రీం కోర్టు, రాష్ట్రాల హై కోర్టు లే దిక్కు అన్నట్టుగా దేశం లో పరిస్థితులు తయారయ్యాయి.
అందుకే, ఏపీ లోను ; తెలంగాణ లోనూ కదిల్తే హైకోర్టు కు, మెదిల్తే హై కోర్టు కు బాధితులు పరిగెత్తుతున్నారు.

గ్రామ పంచాయతీలకు కేంద్రం విడుదల చేసిన గ్రాంట్ల ను ఏపీ హై కోర్టు జోక్యం చేసుకుంటే గానీ, అవి విడుదల కాలేదు. అలాగే, కాంట్రాక్టర్ల పాత బిల్లులు కూడా. ఏ కేసు లో అయినా కౌంటర్ దాఖలుకు…. ప్రభుత్వ ప్లీడర్లు రెండు వారాలు, మూడు వారాలు గడువు కోరడాన్ని చూస్తుంటాము.

24 గంటల్లో దాఖలు చేయాల్సిందే అని కోర్టులు ఆదేశిస్తే….! కోర్టులు అంత ధృఢం గా ఉంటే తప్ప, పని జరగదని స్టేట్ బ్యాంక్ – ఎలక్టరల్ బాండ్స్ వ్యవహారం నిరూపించింది. న్యాయమూర్తులు ప్లీడర్ లను ఆడించాలి గానీ, ప్లీడర్లు న్యాయమూర్తులను కాదు.

భోగాది వేంకట రాయుడు

Leave a Reply