Suryaa.co.in

Andhra Pradesh

రికార్డు స్థాయిలో మాట తప్పి మడమ తిప్పిన జగన్

-ఇచ్చిన 730 హామీల్లో 621 హామీలు అంటే 85 శాతం పూర్తి చేయలేదు.
-శాండ్, లాండ్, వైన్, మైన్ లను దోపిడి చేసి రూ.8,23,600 కోట్లు దోచుకున్నారు
-5 ఏళ్లల్లో రూ.11,52,000 వేల కోట్లు అప్పు చేశారు
-ఏపీని గంజాయికి రాజధానిగా మార్చేశారు
-ధరలు, పన్నులు, ఛార్జీలు పెంచి ఒక్కో కుటుంబం పై రూ.8లక్షల భారం మోపారు
-రెడ్డి సామాజిక వర్గానికి వైసీపీ 49 మంది అభ్యర్ధులకు సీట్లు ఇవ్వడమేనా సామాజిక న్యాయం
-ఇటువంటి వ్యక్తికి ఓటు వేయాలా? అని ప్రజలు ఒకసారి ప్రశ్నించుకోవాలి
– శాసనమండలి మాజీ సభ్యులు జి. దీపక్ రెడ్డి

నేను ఉన్నాను, విన్నాను అంటూ గతంలో ఎన్నికల ముందు ప్రచారం చేశారు. 5 ఏళ్ల వరకు జగన్ రెడ్డికి వినపడలేదు, కనపడలేదు. మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పి మాట తప్పి, మడమ తిప్పడంలో సరిలేరు జగన్ కు సాటి అనే విధంగా 5 ఏళ్ల పాలన సాగింది. ఎన్నికల ముందు ముద్దులు పెట్టుకుంటూ తిరిగి ఇప్పుడు గుద్దులు గుద్దుతున్నారు. మ్యానిఫెస్టో బైబిల్, ఖురాన్, భగవద్గీత అని చెప్పి ఒక్క హామీని నెరవేర్చలేదు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిబంధనలకు విరుద్ధంగా ఉందని కక్షపూరితంగా ప్రజావేదికను కూల్చి వేసి ప్రజాధనాన్ని వృధా చేశారు. నాలుగు నెలల పాటు ఒక గ్రాము ఇసుకను భయటకు కూడా రానివ్వకుండా 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేశారు. 125 వృత్తిదారులను దెబ్బతీశారు. అదే 4 నెలల పాటు భారతీ సిమెంట్, సాక్షిని ఆపారా?

అమరావతిని ఆపేసి కాంట్రాక్టర్ ను తరిమేశారు, అంతేకాకుండా ఇసుక, గ్రావెల్ ను దొంగతనం చేశారు. పెండింగ్ భవనాలను నిర్మించలేదు. మోదీ అమరావతికి నిధులు ఇస్తామని చెప్పినా ఎందుకు తెచ్చుకోలేదు? పోలవరం ప్రాజెక్టులో కాంట్రాక్టర్ ను మెడపెట్టి భయటకు తరిమేశారు. వరదలు వచ్చినప్పుడు ప్రాజెక్టు కొట్టుకుపోవడానికి బాధ్యులు మీరు కాదా? కేంద్రానికి ప్రాజెక్టు పనులు అప్పగిస్తామని చెప్పి ఎందుకు కేంద్రానికి అప్పగించలేదు? పోలవరం ఆపి రాష్ట్ర భవిష్యత్ కు నష్టం వాటిల్లేలా చేశారు. పోలవరం పూర్తి కాకపోవడంతో రూ.50వేల కోట్లు రాష్ట్రానికి నష్టం వచ్చేలా చేశారు. జలవనరుల రంగాన్ని నిర్వీర్యం చేశారు.

గత ప్రభుత్వ హయాంలో రూ.లక్షా 80వేల కోట్లు ఎంవోయులు చేసుకున్న వారితో మీరు కమీషన్ల కక్కుర్తికి వారు పారిపోయేలా చేశారు. పవర్ పర్చేజస్ (పీపీఏ)లు రద్దు చేశారు. రద్దు చేయవద్దని దేశానికి చెడ్డ పేరు వస్తుందని కేంద్రం చెప్పినా పట్టించుకోలేదు. పాత ధరల ప్రకారం రూ.5 యూనిట్ ధరను రద్దు చేసి నేడు రూ.18 కొంటున్నారు. ఇది తుగ్లక్ పాలన కాదా? ఏపీలో ఫైనాన్షియల్ టెర్రరిజం జరుగుతుందని పారిశ్రామిక వేత్తలు చెప్పడం వాస్తవం కాదా? ప్రతిపక్ష పార్టీ సానుభూతిపరులను ఊళ్లు ఖాళీ చేయించేలా బెదింపులు చేశారు.

మేము అనేక ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. తెలుగుదేశం పార్టీ ఆర్ధిక మూలాలు దెబ్బకొట్టాలని చూశారు. ప్రతి శుక్రవారం ఏ నాయకుడిని ఏ జైలుకు తీసుకువెళతారో తెలియదు. బ్రిటీష్ పాలనను తెచ్చిన జగన్ కు ఓటు వేయాలా? టీడీపీ ప్రవేశపెట్టిన 120 సంక్షేమ పథకాలు రద్దు చేశారు. నిరుద్యోగ భృతి, అన్న క్యాంటీన్లు తీసేశారు. ఈ పథకాలన్ని తీసేస్తానని గతంలో ఎన్నికల ముందు చెప్పి ఉంటే జగన్ గెలిచేవాళ్లా?

కోవిడ్ సమయంలో చంద్రబాబు సూచనలను పక్కనపెట్టి దేశంలోనే అత్యధిక కేసులు ఏపీలోనే వచ్చేలా చేశారు. ప్రజల ప్రాణాలతో చలగాటాలాడారు. మహిళలపై 46 శాతం అరాచకాలు పెరిగాయని కేంద్రం నివేదిక స్పష్టం చేసింది. 2021లో 17,752 కేసులు మహిళలపై రిజిస్టర్ అయ్యాయి. అక్రమ కేసులు బనాయిస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలపై దాడులు, హత్యలు పెరిగిపోయాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా?

శాండ్, లాండ్, వైన్, మైన్ లను దోచేశారు. అయిదేళ్లలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్‌రెడ్డి రూ.8 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. భూకేటాయింపులు, గనుల తవ్వకాలు, సోలార్‌కు అనుమతులు.. ఇలా ప్రతి దాంట్లో ఆశ్రిత పక్షపాతానికి ఒడిగట్టి లక్షల కోట్లు సంపాదించారు. లిక్కర్‌ కమిషన్‌ లో రూ.1,05,000 కోట్లు, 2. 22(ఎ), అసైన్డ్‌ భూముల కుంభకోణం రూ.1,00,000 కోట్లు, ఇండోసోల్‌(జగన్‌ బినామీ) కుంభకోణంలో రూ.75,000 కోట్లు, జి.ఐ.ఎస్‌ విద్యుత్‌ ఒప్పందాల కుంభకోణంలో రూ.50,000 కోట్లు, టీడీఆర్‌ బాండ్ల కుంభకోణంలో రూ.50,000 కోట్లు, విశాఖ భూముల కుంభకోణంలో రూ.40,000 కోట్లు, ఇసుక దోపిడీలో రూ.60,000 కోట్లు ఇలా అన్నింటిలోను దోపిడీ చేసి రూ.8,23,600 కోట్లు దోచుకున్నారు.

కోర్టు కేసుల కోసం వేల కోట్లు వృధా చేశారు. రూ.11,52,000 వేల కోట్లు అప్పు చేశారు. అంటే టీడీపీ కంటే 4 రెట్లు ఎక్కువ అప్పు చేశారు. ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వని పరిస్థితి. ఆరోగ్య శ్రీని నిధులు ఇవ్వరు. కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకపోడంతో కొత్త కాంట్రాక్టర్లు రాని పరిస్థితి. కేంద్ర నివేదిక ప్రకారం ఏపీలో ఆత్మహత్యలు పెరిగిపోయాయి. ఆస్తులు పెంచడంలో ఇతర రాష్ట్రాల కంటే 33 శాతం తక్కువ పెట్టారు. కేంద్రం నుంచి మ్యాచింగ్ గ్రాంట్లను రూ.20వేల కోట్లు తీసుకోలేకపోయారని సీఏజీ రిపోర్టులో ఉంది.

తెలంగాణలో రూ.1.50 లక్షల కోట్లు ఏపీ ఆస్తులు ఉంటే ఎందుకు చర్యలు తీసుకోలేదు? వేలాది కోట్ల విద్యుత్ బకాయిలు ఎందుకు తెచ్చుకోలేదు. ఇన్ని సమస్యలు పెండింగ్ ఉన్నప్పుడు ఎందుకు మన సచివాలయం భవనం కేసీఆర్ కు గిఫ్ట్ గా ఎందుకు ఇచ్చారు? కేంద్ర విద్యాసంస్థలకు కనీసం భూమి కూడా ఇవ్వలేదు. కర్నాటక అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే ఎందుకు ప్రశ్నించలేదు. పంచాయితీ నిధులు దారి మళ్లించి గ్రామాలను నిర్వీర్యం చేశారు.

మద్య నిషేదం అని హామీనిచ్చి మద్యం మాఫియాను పెంచేశారు. నాశారకం మద్యంతో 35 లక్షల మంది ఆరోగ్యం నాశనం చేసి ప్రాణాలతో చలగాడాలాడారు. 30వేల మంది ప్రాణాలు తీసేశారు. భవిష్యత్ లో మద్యాన్ని కొనసాగించేలా అప్పులు తెచ్చుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను కేవలం రూ.100 కోట్ల కుంభకోణంలో జైల్లో పెట్టారు. కాని నేడు ఏపీ పరిస్థితి చూస్తే మద్యం విషయంలో కేజ్రీవాల్ కంటే 100 రెట్లు లక్ష కోట్ల కుంభకోణం చేశారు. ఏపీని గంజాయికి రాజధానిగా మార్చేశారు. నార్కోటిక్స్ బ్యూరో ప్రకారం ఏపీ డ్రగ్స్ లో నెంబర్ 1 స్థానంలో ఉంది.

గతంలో గుజరాత్ నుంచి బెజవాడ అడ్రస్ తో కంటైనర్ వచ్చింది, ఇప్పుడు విశాఖలో దొరికిన డ్రగ్స్ సూత్రదారులు, పాత్రదారులు వైసీపీ నాయకులే. దేశ భవిష్యత్ ను నాశనం చేసే వారికి ఓటు వేయాలా? ఫీజు రీయింబర్స్ మెంట్ సగం మంది విద్యార్ధులకే ఇస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర, మ్యానిఫెస్టోలో హామీలన్ని కలిపి 730లో 621 హామీలు చేయలేదు. అంటే 85 శాతం హామీలను పూర్తి చేయలేదు. కాని 99 శాతం పూర్తి చేశామని పచ్చి అబద్దాలని చెబుతున్నారు.

హామీలన్ని కూడా సాక్షి పేపర్ లో ప్రకటన్నింటిని కలిపి పుస్తకం కూడా విడుదల చేశారు. టిడ్కో ఇళ్లను ఇంత వరకు ఇవ్వలేదు. 30 లక్షల మంది ఇళ్లు నిర్మించలేదు. ఫీజు రీయంబర్స్ మెంట్ దాదాపు సగం మందికి ఇస్తున్నారు. 9 లక్షల మంది విద్యార్ధులకు ఎగనామం పెట్టారు. అంగన్ వాడీలకు తెలంగాణ కంటే రూ.1000 అధనంగా ఇస్తామన్నారు. రైతు భరోసా కు రాష్ట్రం నుంచి రూ.7,500 మాత్రమే ఇస్తున్నారు. ఇవ్వన్ని మాట తప్పడం కాదా?

జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఒక్క రూపాయి నుంచి రూ.10 దోచుకుంటున్నారు. బడ్జెట్ లో టీడీపీ 19.15 శాతం సంక్షేమానికి ఖర్చు పెడితే వైసీపీ కేవలం 15 శాతం అంటే 3.5 శాతం తక్కువగా ఖర్చు పెడుతున్నారు. దాదాపు రూ.50వేల కోట్లు టీడీపీ కంటే తక్కువే ఖర్చు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సబ్ ప్లాన్ నిధులు రూ. 1,14,664 కోట్లు దారి మళ్లించారు. దేశంలోనే అత్యధిక రైతులు ఆత్మహత్యలు జరిగాయి. కరెంట్ బిల్లులు పెంచమని చెప్పి 9 సార్లు పెంచారు. ప్రజలపై రూ.64వేల కోట్ల భారం మోపారు.

ఇవి కాకుండా కరెంట్ కోతలు, కొత్త మీటర్లు అంటూ బెదిరింపులు. పెట్రోల్, డీజీలో ధరల్లో దేశంలోనే ఏపీ టాప్, ధరలు, పన్నులు, ఛార్జీలు పెంచి ఒక్కో కుటుంబం పై రూ.8లక్షల భారం మోపారు. రూ.10 ఇచ్చి రూ.100 దోచుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చేసిన దౌర్జన్యాలకు అధికారంలో ఉండే అర్హత ఉందా? ఎన్నికల్లో జరిగిన అవకతవకలకు ఐఏఎస్ అధికారులను ఎన్నికల కమీషన్ శిక్షించింది. రూ.3వేల కోటుల రంగులు కొట్టి ప్రజాధనం వృధా చేశారు. ఇటువంటి వారికి ఓటు వేయాలా?

అసెంబ్లీని అత్యంత తక్కువ రోజులు నిర్వించిన ప్రభుత్వంగా నిలిచిపోయింది. అసెంబ్లీలో బెదిరింపులకు దిగారు. చట్టసభలు జగన్మోహన్ రెడ్డికి భజన చేయడానికే సరిపోతుంది. ఛీఫ్ సెక్రటరీని ఆర్డీవో పోస్ట్ లో వేసి భయపెట్టారు. డీజీపీ, సీనియర్ అధికారులను తీసేసి వైసీపీ బౌన్సర్లుగా పోలీసులను మార్చుకున్నారు. ప్రజలకు సేవ చేయడానికి అధికారులు సిద్ధం లేరనే చెప్పాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా 530 తీర్పులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చాయి.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క తీర్పు వస్తేనే గతంలో సీఎంలు రాజీనామా చేసిన చరిత్ర ఉంది. అలాంటి ఇన్ని తీర్పులు వచ్చాయంటే జగన్మోహన్ రెడ్డికి సిగ్గుచేటు. దాదాపు 30వేలకు పైగా కంటెంట్ ఆఫ్ కోర్టు ఫైల్ అయ్యాయంటే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేదని తేలిపోయింది. పత్రికా వ్యవస్థను బ్రష్టుపట్టించారు. ఎన్నికలను అవహేళన చేశారు. ఇటువంటి వాళ్లకు ఓటు వేయాలా?

తాజాగా ఇచ్చిన వైసీపీ అభ్యర్ధుల్లో 49 ఎమ్మెల్యేలు రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు. ఇది సామాజిక న్యాయమా? బీసీ రిజర్వేషన్ ను తగ్గించి రూ. 16,800 పోస్టులు బీసీలు కోల్పోయేలా చేశారు. జగన్మోహన్ రెడ్డి దేశంలోనే అందరి ముఖ్యమంత్రుల కంటే ధనవంతుడు. క్రిమినల్ కేసులు కూడా ఆయనే టాప్. ఆయన కంపెనీలో లాభాలు విపరీతంగా పెరిగిపోయాయి. కాని ప్రజలు మాత్రం రోడ్డునపడుతున్నారు.

ఇటువంటి ప్రభుత్వానికి ఓటు వేయాలా?
ప్రజలు ముందు పెడుతున్న విషయాల మీద ఎవరైనా బహిరంగ చర్చకు ఎవరైనా సిద్ధమా అని గుట్కా, మట్కా, బెటింగ్ డాన్లు, గంట, అరగంట వైసీపీ నాయకులకు ఓపెన్ ఛాలెంజ్. నేను చెప్పిన అంశాల మీద కనీసం ఒక్క దాని మీద మాట్లాడే దమ్ము మీకు ఉందా? కాబట్టి ప్రజలు వాస్తవాలను తెలుకోవాలని కోరుతున్నాం.

LEAVE A RESPONSE