Suryaa.co.in

Andhra Pradesh

అస్మదీయులకే పోలవరం కాంట్రాక్ట్‌లు

– కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్టును సర్వనాశనం చేశారు
– డబ్బు ఆశతోనే కేంద్రం నుంచి ప్రాజెక్టును తెచ్చుకున్నారు
– ఇప్పుడు కూడా ప్రాజెక్టు ఎత్తు తగ్గింపునకు ఆమోదం
– ఆయన చేసిన తప్పులను మాపై నెట్టాలని చూస్తున్నారు
– చంద్రబాబు తప్పిదాల వల్లనే ప్రాజెక్టు పనుల్లో జాప్యం
– వైయస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు

గుంటూరు: పోలవరం ప్రాజెక్టును విధ్వంసం చేసింది చంద్రబాబే అని, ఆయన పాపమే పోలవరం ప్రాజెక్టుకు శాపం అని వైయస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. కేవలం కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్టును సర్వనాశనం చేశారని, డబ్బు ఆశతోనే, కేంద్రం నుంచి ప్రాజెక్టు తెచ్చుకున్నారని, ఇప్పుడు కూడా ప్రాజెక్టు ఎత్తు తగ్గింపునకు ఆమోదం తెలిపి, రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నారని, ఆయన చేసిన తప్పులన్నింటినీ తమపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.

కేవలం చంద్రబాబు తప్పిదాల వల్లనే ప్రాజెక్టు పనుల్లో జాప్యం
జరిగిందన్న అంబటి రాంబాబు, వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే పనుల్లో వేగం పుంజుకుందని, ప్రాజెక్టులో కీలక పనులన్నీ తమ ప్రభుత్వ హయాంలో పూర్తి చేశామని గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు.

2018లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి 2019 ఎన్నికలకు వెళ్తామని అప్పటి ఇరిగేషన్‌ మంత్రి దేవినేని ఉమ అసెంబ్లీలో ప్రకటించారు. ఆ పని చేయలేకపోయారు. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చాక, 2027లో పోలవం పూర్తి చేస్తామని చంద్రబాబు చెబుతున్నారు. పోలవరం నిధులను జగన్‌ డైవర్ట్‌ చేశారంటున్న చంద్రబాబు, దాన్ని నిరూపిస్తే నేను ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తా.

పోలవరం ప్రాజెక్టును తామే పూర్తి చేస్తామని విభజన చట్టంలో కేంద్రం స్పష్టం చేసినా, కమిషన్లకు కక్కుర్తి పడిన చంద్రబాబు, ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత తీసుకున్నారు. అది కూడా 2013–14 ధరలతో ప్రాజెక్టు పనులు చేస్తామని 2016లో ఒప్పందం చేసుకున్నారు. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తే ఆ నిధులను కేంద్రం రీయింబర్స్‌ చేసేలా ఆ ఒప్పందం జరిగింది.

అలాంటప్పుడు కేంద్రం నిధులను జగన్‌ డైవర్ట్‌ చేశారని చంద్రబాబు విమర్శించడం అత్యంత హేయం. ప్రాజెక్టు పనులు, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) పరిశీలించాకే కేంద్రం ఆ నిధులు రీయింబర్స్‌ చేస్తుందన్న విషయం సీఎం చంద్రబాబుకు తెలియదా?.

పోలవరం ప్రాజెక్టు పనులను తన అనుయాయుల కంపెనీలకు కట్టబెట్టిన చంద్రబాబు, వారు (ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ) అడిగిందే తడువుగా అగ్రిమెంట్‌ విలువను రూ.4,054 కోట్ల నుంచి రూ.5,386 కోట్లకు పెంచుతూ ఉ్కఇ నిబంధనలకు విరుద్ధంగా రూ.1,332 కోట్ల అనుచిత లబ్ధి చేకూరుస్తూ, 2016 సెప్టెంబరు 29న ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత పనులు క్యాన్సిల్‌ చేసి, నామినేషన్‌ పద్ధతిలో నవయుగ కంపెనీకి పెంచిన రేట్ల ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా దాదాపు రూ.3,000 కోట్ల పని అప్పగించారు. ఈ రెండు కంపెనీలు చంద్రబాబు అస్మదీయులవే కావడం గమనార్హం.

నవయుగ కంపెనీ వారు అధికంగా లాభం ఉండే కాంక్రీట్‌ పనులే పూర్తి చేశారు. కానీ క్రిటికల్‌ కాంపొనెంట్లు అయిన రెండు కాఫర్‌ డ్యామ్‌ పనులు మాత్రం నత్తనడకన చేశారు. కాఫర్‌ డ్యాం మధ్యలో వదిలేసి డయాఫ్రం వాల్‌ పూర్తి చేశారు. ఈ అనాలోచిత నిర్ణయం కారణంగా వరద ప్రవాహానికి డయాఫ్రం వాల్‌ కొట్టుకుని పోయింది. సాంకేతికంగా తప్పు చేసి, జగన్‌ కాంట్రాక్టర్‌ను మార్చడం వల్లే డయాఫ్రమ్‌ వాల్‌ కొట్టుకుపోయిందని ఆరోపిస్తూ, రాజకీయం చేస్తున్నారు.

కాఫర్‌ డ్యాం పూర్తి చేయకుండా డయాఫ్రం వాల్‌ నిర్మాణం చేయడం ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. కానీ, చంద్రబాబు నేతృత్వంలో పోలవరం ప్రాజెక్టు విషయంలో జరిగింది. కమీషన్ల కోసం కక్కుర్తి పడి చంద్రబాబు చేసిన ఈ తప్పు కారణంగా భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది.

జగన్‌ సీఎం అయ్యాక అనేకసార్లు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పోలవరం నిర్మాణానికి కేంద్రమే అడ్వాన్సుగా నిధులు చెల్లించేలా ఒప్పించడంతోపాటు 2016–17 రేట్లకు అనుగుణంగా సవరించిన అంచనాలకు కేంద్రాన్ని ఒప్పించారు. గతంలో 2013–14 ధరలు చెల్లించేలా చంద్రబాబు చేసుకున్న అనాలోచిత ఒప్పందాన్ని ఆయన కేంద్రంతో పోరాడి సవరింప చేశారు.

కేంద్రం పోలవరం కోసం విడుదల చేసిన ఆ నిధులను చంద్రబాబు ప్రభుత్వం వివిధ కార్యకలాపాల కోసం మళ్లించింది. దీనిపై దాదాపు 15సార్లు కేంద్రం సీరియస్‌ అవడంతో జాయింట్‌ అకౌంట్‌లో వేసిన దుస్థితికి పోలవరం ప్రాజెక్టును తీసుకొచ్చాడు చంద్రబాబు. కేంద్ర ప్రభుత్వం పోలవరం అడ్వాన్సు కోసం ఇచ్చిన రూ.12,557 కోట్లు డైవర్ట్‌ చేసిన చంద్రబాబు గత మా ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. నిపుణుల సూచనల మేరకు రెండో డయాఫ్రం వాల్‌ నిర్మాణం చేయాల్సి ఉంటే, ఆ పనులే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తోంది.

నిర్బంధాలు, అక్రమ కేసులను ఎదిరించడంతోనే వైయస్సార్సీపీ పురుడు పోసుకుందనే విషయం గుర్తుంచుకోవాలి. అరెస్టులతో జగన్‌ శక్తిని అడ్డుకోలేరు. వికృత చేష్టలకు పాల్పడుతున్న పోలీసులకు, ఎర్ర బుక్కు రాస్తున్న లోకేష్‌కు రాబోయే రోజులు ఎంత దారుణంగా ఉంటాయో మీ ఊహకే వదిలేస్తున్నా.

మా పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్లి లిక్కర్‌ స్కాం జరిగిందని చెప్పిన లావు శ్రీకృష్ణదేవరాయలు రేపు మళ్లీ మా పార్టీలోకొస్తే టీడీపీ హయాంలో లిక్కర్‌ స్కాం జరిగిందని చెబుతాడేమో! అని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE