Suryaa.co.in

National Telangana

గుజరాత్ లో ఏడాదిలో 50వేల ఉద్యోగాలు ఇచ్చారా?

– ప్రధానికి రేవంత్ రెడ్డి సవాల్
– గుజరాత్ గులాంలు గా ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్
– మహా వికాస్ అఘాడీ కూటమిని గెలిపించాలి
– మహారాష్ట్ర రాజురా, డిగ్రాస్ నియోజకవర్గంలో బహిరంగసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

రాజురా : మీరంతా మా సోదరులు. ఎందుకంటే మనమంతా ఒకప్పుడు హైదరాబాద్ సంస్థానానికి చెందిన వాళ్లమే. రాష్ట్రాలు వేరైనా మనమంతా ఒకే కుటుంబం.మనమంతా కలికట్టుగా ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో సుభాష్ బావూను గెలిపించండి. ఛత్రపతి శివాజీ గురించి మనం పుస్తకాల్లో చదువుకున్నాం. రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్, బడుగుల ఆశాజ్యోతి పూలే ఈ గడ్డపై పుట్టినవారే.

దేశంలో ఉన్న ఆరు మహానగరాలు. ఢిల్లీ, బెంగళూర్, చెన్నై, కలకత్తా, హైదరాబాద్ లో బీజేపీకి స్థానం లేదు. ముంబైలో కూడా బీజేపీకి స్థానం ఉండబోదు. ముంబై నగరం మహావికాస్ అగాడీతో ఉంటుంది. ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ గుజరాత్ గులాంలు గా మారారు ఇలాంటి వెన్నుపోటు దారులకు బుద్ధి చెప్పాలి. ముంబైని దోచుకోవడానికే గుజరాత్ నుంచి ప్రధాని, అదానీ వస్తున్నారు.

రైతులు బాగుంటునే రాష్ట్రం బాగుంటుంది. అందుకే మేం 25 రోజుల్లోనే 18వేల కోట్లు ఖర్చు చేసి రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసాం. తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని నిరూపించాం. అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే 50 వేల ఉద్యోగ నియామకాలు పూర్తి చేశాం. ఈ వేదికగా ప్రధానికి నేను సవాల్ విసురుతున్నా. గుజరాత్ లో ఏడాదిలో 50వేల ఉద్యోగాలు ఇచ్చారా?

తెలంగాణలో ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. ఇప్పటి వరకు 1కోటి 10లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకున్నారు. రూ.500 లకే వంటగ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డలను ఆదుకున్నాం. ప్రతీ పేద కుటుంబానికి 200 యూనిట్ల విద్యుత్ అందించాం. ఇప్పటి వరకు 25 లక్షల కుటుంబాలు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించాం.

తెలంగాణలో ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. మహారాష్ట్రలోనూ మహావికాస్ అఘాడీ కూటమి అధికారంలోకి రాగానే 5 గ్యారంటీలను అమలు చేస్తుంది. ఎన్నికలు వస్తుంటాయ్.. పోతుంటాయ్. ఇప్పుడు మహారాష్ట్రలో జరిగేవి ఎన్నికలు కావు.ఇది ఒక పోరాటం. ఈ పోరాటంలో కూటమిని గెలిపించేందుకు ప్రతీ కార్యకర్త ఒక వీరుడుగా మారాలి. మహా వికాస్ అఘాడీ కూటమిని గెలిపించాలి.

LEAVE A RESPONSE