Suryaa.co.in

Andhra Pradesh

విధ్వంస పాలన కావాలా… అభివృద్ధి కావాలా?

-అధికారం అంటే మాకు ప్రజాసేవ చేసే అవకాశం
-జగన్ రెడ్డికి అధికారమంటే దోపిడీకి, ప్రజా సంపద లూటీకి లైసెన్స్
-గత ఐదేళ్లలో రాష్ట్రంలో బాగుపడింది జగన్ రెడ్డి ఒక్కడే
-పశ్చిమ గోదావరిలో కూటమి క్లీన్ స్వీప్
-యువతకు ఉద్యోగాలు కావాలా.. గంజాయి, డ్రగ్స్ కావాలా?
-కేంద్రం మద్దతుతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం
-మూడు పార్టీలది ఒకటే అజెండా.. అదే సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ
-పొత్తును గెలిపించడం కోసం నేను, పవన్ త్యాగాలు చేశాం
-ప్రజల కోసం త్యాగం చేసి పోరాడుతున్న పవన్ ఒక రియల్ హీరో
-గోనె సంచులు అడిగిన రైతుల్ని దుర్భాషలాడిన వ్యక్తిని చిత్తుగా ఓడించాలి
-జగన్ రెడ్డి అహంకారాన్ని అణిచేలా మే 13న పోలింగ్ జరగాలి
-పవన్ కల్యాణ్‌తో కలిసి తణుకు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

తణుకు : తణుకు సభ అదుర్స్. జగన్ రెడ్డీ ఇది ప్రారంభం మాత్రమే. భవిష్యత్తులో వైసీపీ కొట్టుకుపోవడం తధ్యం. అగ్నికి వాయువు తోడైనట్లు, ప్రజాగళానికి వారాహి తోడైంది. ప్రజల నుండి పుట్టిన ఈ అగ్ని చెడును దహించబోతోంది. అహంకారాన్ని బూడిద చేయబోతోంది. నేటి తణుకు సభ సాక్షిగా చెబుతున్నా.. సైకిల్ స్పీడుకు తిరుగు లేదు. గ్లాస్ జోరుకు ఎదురు లేదు. కమల వికాసానికి అడ్డే లేదు. రాష్ట్రానికి ఇకపై అన్నీ మంచి రోజులే. భవిష్యత్తు మొత్తం యువతదే. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మూడు పార్టీలు చేతులు కలిపాయి.

మూడు జెండాలు వేరయినా.. అజెండా ఒకటే. సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణే మా అజెండా.
2014లో విభజన కష్టాల నుండి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు కలిశాం. నేడు జగన్ రెడ్డి కబంధ హస్తాల్లో దెబ్బతిన్న రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కలిశాం. 40 ఏళ్ల అనుభవం గల నేను, ప్రజా సేవకై తపన కలిగిన పవన్ కల్యాణ్, దేశాన్ని ప్రపంచంలో నెంబర్ వన్ చేయాలనుకునే నరేంద్ర మోదీ కలిసి వస్తున్నాం. పవన్ కల్యాణ్ సినిమా హీరోగా, కోట్ల ఆదాయం, సుఖమయమైన సినిమా జీవితాన్ని వదులుకుని ప్రజల కోసం వచ్చారు.

ప్రజల తరఫున ప్రశ్నిస్తూ పవన్ కల్యాణ్ నిలబడినందుకు అభినదిస్తున్నా. అనేక రకాలైన దాడులు చేశారు. అవమానించారు. అయినా ఎక్కడా తొనక్కుండా నిలబడ్డారు. నేను ఇబ్బందుల్లో ఉన్నపుడు అండగా నిలవడాన్ని ఎప్పుడూ మరచిపోము. చీకటి పాలనను అంతం చేసే ఈ పోరాటంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని ప్రకటించిన వ్యక్తి పవన్ కల్యాణ్. మన సంకల్పానికి కేంద్ర సహకారం అవసరమని కేంద్రంతో కలిశాం.

పశ్చిమ గోదావరిలో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుంది :
గతంలో ఈ జిల్లాలో 15 సీట్లకు 15 సీట్లు గెలిపించారు. ఇప్పుడు కూడా కలిసి వస్తున్నాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి ప్రజానీకం ఊపు చూస్తుంటే జగన్ రెడ్డికి డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి కనిపించడం లేదు. యువత కన్నెర్ర జేస్తే జగన్ రెడ్డి ఎక్కడికి పారిపోతాడో తెలియదు. 2014లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేశాను. అధికారాన్ని రాష్ట్రం కోసం ఉపయోగించాం. అద్భుతమైన రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ప్రతి ఎకరాకు నీరివ్వడమే లక్ష్యంగా సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిచ్చా. యుద్ధ ప్రాతిపదికన పోలవరం ప్రాజెక్టు పనులు చేపట్టి 72% పనులు పూర్తి చేశాం.

11 కేంద్ర విద్యా సంస్థలు తెచ్చాం. 100కి పైగా సంక్షేమ పథకాలు అమలు చేశాం. సాధికారత కల్పించాను. ప్రతి కుటుంబానికి బాసటగా నిలిచాం. ఐదేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా తిరిగి పెట్టుబడులు తెచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించాను. జాబు రావాలంటే మళ్లీ బాబు రావాల్సిందే. వచ్చే 30 రోజులు యువత పని చేయండి. స్టేట్ ఫస్ట్ నినాదంతో ముందుకు వెళ్లాలి.

వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాభివృద్ధికి ఆక్సిజన్ ఈ కూటమి :
2014-19 మధ్య రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందిందో ఆలోచించండి. 2019 తర్వాత నుండి ఎలా ఉందో ఆలోచించండి. ఎన్నికలకు ముందు ముద్దులు పెట్టి, నెత్తిన చెయ్యి పెట్టి, బుగ్గలు నిమిరాడు. అధికారంలోకి వచ్చిన రోజు నుండి బాదుడు తప్ప ఇంకేమైనా ఉందా? రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు. అప్పులతో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను వెంటిలేటర్ పైకి నెట్టాడు. కొన ఊపిరితో ఉన్న రాష్ట్రానికి ఎన్డీఏ అనే ఆక్సిజన్ అవసరం. శక్తినిచ్చి బతికిస్తుంది. రాజధాని కట్టుకోవాలి. పోలవరం సహా.. సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకోవాలి. రాష్ట్రానికి పరిశ్రమలు తేవాలి. యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఇండస్ట్రియల్ కారిడార్లు అభివృద్ధి చేసుకోవాలి. అప్పుడే శిధిలమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టుకోగలం. ఈ విషయాన్ని యువత గుర్తుంచుకోవాలి.

అభివృద్ధి కావాలో.. అరాచకం కావాలో ప్రతి ఇంట్లో చర్చ జరగాలి:
నాకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదు. రాష్ట్ర కోసం యువత భవిష్యత్తు కోసం కలిసి వచ్చాం. ప్రతి ఇల్లు, ప్రతి పౌరుడూ ఆలోచించాలి. తణుకు గడ్డపై నుండి అడుగుతున్నా.. విధ్వంస పాలన కావాలా అభివృద్ధి కావాలా? సంక్షోభం సృష్టించేవారు కావాలా.. సంక్షేమం అందించేవారు కావాలా? మీ బిడ్డలకు ఉద్యోగాలు కావాలో.. గంజాయి డ్రగ్స్ కావాలా? ఆస్తులకు రక్షణ కావాలా.. లేక భూ మాఫియా కావాలా? రూ.10 ఇచ్చి రూ.100 దోచేసే దొంగలు కావాలా.. సంపద పెంచే కూటమి కావాలా? సచివాలయాన్ని సైతం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చేవారు కావాలా.. సంపద సృష్టించేవారు కావాలా? ఆడబిడ్డలు ఆలోచించుకోవాలి.

ధరల బాదుడు కావాలో.. ప్రజా పాలన కావాలో ఆలోచించాలి. జే బ్రాండ్స్ తో ప్రాణాలు తీసి, ఆస్తులు దోచుకునే వారు కావాలో.. జే బ్రాండ్స్ ని పూర్తిగా నిషేధించే వారు కావాలో ఆలోచించాలి. దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసేవారు కావాలో.. ఇన్నోవా కార్లు ఇచ్చి ఉపాధి కల్పించే వారు కావాలో ఆలోచించుకోండి. ప్రతి ఇంట్లో ఈ అంశాలపై చర్చ జరగాలి. కిరాణా కొట్టులో కూడా డిజిటల్ పేమెంట్స్ ఉన్నాయి. కానీ మద్యం షాపుల్లో మాత్రం లేవు. ఎందుకు? ఆ సొమ్ము ఎటు పోతోంది.

రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మే 13న ఓటు వేయండి. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు అయినా సంతోషంగా ఉన్నాడా? ఇక్కడే ఒక మంత్రి ఉన్నాడు. రైతులకు కనీసం గోనె సంచులు కూడా ఇవ్వలేకపోతున్నాడు. మళ్లీ రైతుని రాజుగా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. రైతులంతా ఆలోచించండి. ధాన్యం కొనుగోళ్లు చేయకుంటే.. టీడీపీ, జనసేన నాయకులు రోడ్డెక్కి పోరాడాల్సి వచ్చింది. ఏటా జాబ్ క్యాలెండర్ అన్న జగన్ రెడ్డి ఎన్ని ఉద్యోగాలిచ్చాడు? మెగా డీఎస్సీ పేరుతో దగా చేశాడు. మేము అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీపై పెడతాం. ప్రతి ఒక్కరికీ ఉద్యోగం, ఉపాధి కల్పనకు ప్రత్యేక శ్రద్ధ పెడతాను.

ఐదేళ్ల పాలనలో బాగుపడింది జగన్ రెడ్డి మాత్రమే:
జగన్ రెడ్డి తన సభల్లో పేదల మనిషినని చెబుతున్నాడు. పేదల ఆస్తులు దొంగిలించిన ఏకైక నాయకుడు జగన్ రెడ్డి. ఐదేళ్ల పాలనలో ఏ ఒక్కరైనా బాగుపడ్డారా? ఎవరి ఆదాయం అయినా పెరిగిందా? కానీ ఖర్చులు పెరిగాయి. అప్పులు పెరిగాయి. ఖర్చులు పెరిగాయి. రాష్ట్రంలో బాగుపడింది జగన్ రెడ్డి ఒక్కడే. అధికారం అంటే ప్రజలకు సేవ చేసే అవకాశం. ప్రజల ఆస్తులకు రక్షణగా నిలిచే బాధ్యత. కానీ, జగన్ రెడ్డికి అధికారమంటే దోపిడీ, ప్రజల సంపద దోచుకోవడమనేలా వ్యవహరిస్తున్నాడు. ఎక్కడా లేని విధంగా ప్రజతిపక్షాల గొంతు నొక్కడానికి జీవో నెం.1 తెచ్చాడు. ఎన్నికల కమిషన్ ఉంది కాబట్టి సభలు పెట్టగలుగుతున్నాం.

కానీ, గత ఐదు సంవత్సరాలుగా ఏం చేశాడో చూశాం. అహంకారి, విధ్వంసకారుడు, రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తుంటే.. తెలుగుదేశం జనసేన రోడ్డెక్కి పోరాటం చేశాం. ఐదేళ్లుగా ప్రతిపక్ష నేతలపై దాడులు, దౌర్జన్యాలు, కేసులు, అరెస్టులతో రాష్ట్రాన్ని రావణకాష్టం చేశాడు. ఇలాంటి రాక్షస పాలనను మే 13న వేసే ఓటుతో బూడిద చేయబోతున్నాం. మన బిడ్డల కోసం ఓటేయండి. కులం, మతం ప్రాంతం కాదు.. రాష్ట్రమే ముఖ్యం. రాష్ట్రం బాగుకోసం ఓటు వేయండి. ప్రజలు ఇచ్చే తీర్పుతో తాడేపల్లి కోట బద్ధలవ్వాలి. జగన్ రెడ్డి అంహకారం కూలేలా ఉండాలి.

ఫేక్ ఫెలోని రాష్ట్రం నుండి తరిమికొడదాం:
జగన్ రెడ్డి ఒక ఫేక్ ఫెలో. సోషల్ మీడియాలో చేస్తున్న ఫేక్ పోస్టులు చూస్తే అర్ధమవుతుంది. టీడీపీ జనసేన నేతల మధ్య గొడవలు పెట్టేలా సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు షేర్ చేస్తున్నారు. మా సంతకాలు సైతం ఫోర్జరీ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు. సోషల్ మీడియాలో వచ్చే వైసీపీ తప్పుడు వార్తల్ని నమ్మొద్దు. ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి ఇంటింటికీ తిరిగాడు. కానీ, గత ఐదేళ్లు పరదాలు కట్టుకుని తిరిగాడు. బారికేడ్లు పెట్టుకున్నాడు. చెట్లు నరికాడు. కానీ, ఇప్పుడు మరోసారి ప్రజల్లోకి వస్తున్నాడు. ఇలాంటి మూర్ఖుడిని నమ్మొద్దు.

సూపర్ సిక్స్ పథకాలతో సామాజిక విప్లవం సృష్టిస్తాం:
కూటమి తరఫున నిర్దిష్టమైన అజెండాతో వస్తున్నాం. మహిళల్ని మహాశక్తిగా గుర్తించాం. ప్రతి మహిళకూ ఆడబిడ్డ నిధిగా ప్రతి నెలా రూ.1500 చొప్పున ఒకటో తేదీన మీ ఖాతాల్లో చేర్చే బాధ్యత తీసుకుంటాను. తల్లికి వందనం పథకంతో ప్రతి బిడ్డ చదువుకు ఏడాదికి రూ.15 వేల చొప్పున ఇస్తాను. గతంలో దీపం పథకంతో ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాను. ఇప్పుడు ఏటా మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తాను. ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తాను. అన్నదాతలకు ఏటా రూ.20 వేలు ఇచ్చి అండగా నిలుస్తాం. యువగళం పేరుతో ప్రతి విద్యార్ధికి నిరుద్యోగ భృతిగా రూ.3000 ఇస్తా. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తా.

ప్రపంచ స్థాయి పరిశ్రమల్ని ఏపీకి తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పిస్తాను. వర్క్ ఫ్రం హోం చేసుకునే వారి కోసం మండల కేంద్రాల్లో వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేస్తా. ప్రతి ఇంటికీ ఉచితంగా తాగునీరు అందిస్తా. ఎలాంటి ఆంక్షలు లేకుండా రూ.4000 పెన్షన్ ప్రతి నెలా ఒకటో తేదీన ఇంటి వద్దనే అందిస్తా. మూడు నెలల పెన్షన్ ఒకే సారి తీసుకునే వెసులుబాటు కల్పిస్తాను. బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ అందిస్తాను. దివ్యాంగులకు రూ.6000 పెన్షన్ అందించి అండగా నిలుస్తా. వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుంది. వారికి రూ.10 వేల గౌరవ వేతనం అందిస్తాను.

జగన్ రెడ్డికి ఏం చేయాలో తెలియక దిక్కుతోచని విధంగా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో వాలంటీర్లు అంతా రాజీనామా చేశారని దుష్ప్రచారం చేస్తున్నారు. వాలంటీర్లు వైసీపీ కోసం పని చేయడం మానుకోండి. మంచి పనులు చేసే వారికి మద్దతిస్తాం. తప్పుడు పని చేయించి వారి జీవితాలు నాశనం చేయాలని జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. యువత రాష్ట్ర అభివృద్ధిక అండగా నిలవండి. ప్రతి వాలంటీర్ కు వారి విద్యార్హతల మేరకు మెరుగైన ఉద్యోగాలు పొందేలా అవకాశాలు కల్పిస్తాను.

బుజ్జికన్న మంత్రి అవినీతి ఖండాలు దాటిపోయింది:
టీడీఆర్ బండ్లలో ఏకంగా రూ.850 కోట్లు దోచుకున్న వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఎప్పుడూ ఎక్కడా చూడని స్థాయి ముదురు మంత్రి కారుమూరు నాగేశ్వరరావు. పేదలకు ఇళ్లు కట్టిస్తామని స్థలాలు కొని, వాటి రేట్లు పెంచి ప్రభుత్వానికి అమ్ముకున్నాడు. ఇల్ల స్థలాలిస్తామని చెబుతూ.. వారి నుండి కమిషన్లు దండుకున్నాడు. చదును పేరుతోనూ మరికొంత దోచుకున్నాడు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉండి బియ్యాన్ని బొక్కేస్తున్నాడు. తణుకులో గతంలో వారాహి యాత్ర జరిగితే జనసేన కార్యకర్తలపై దాడి చేశాడు.

పవన్ కల్యాణ్ కన్నెర్ర జేస్తే ఏమైపోతాడో ఆలోచించుకో. తణుకులో చిన్న బిల్డింగు కట్టాలన్నా, వెంచర్ వేయాలన్నా కారుమూరి ట్యాక్స్ కట్టాల్సిందే. టిడ్కో ఇళ్లు పేదలకు ఇవ్వకుండా పాడు బెడుతున్నాడు. రైతులు పంట కాపాడుకోవడానికి గోనె సంచులడిగితే ఎర్రిపప్పలంటూ రైతుల్ని దుర్భాషలాడాడు. ఎర్రి పప్ప అంటే బుజ్జి కన్న అన్నాడు. ఆ ఎర్రిపప్పకు బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలి.

30 రోజులు కష్టబడండి.. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా:
సభలకు వచ్చే ప్రతి ఒక్కరూ.. జగన్ రెడ్డి అరాచకాలపై నిలదీయండి. తప్పుడు పనులు చేసే వైసీపీని తూర్పారబట్టాలి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఉప్పెనలా ప్రచారం చేయాలి. మన అభ్యర్ధుల్ని గెలిపించుకోవాలి. రాష్ట్రం కోసం పని చేయాలి. అన్ని పార్టీల్లోనూ చాలా మంది నాయకులు త్యాగాలు చేశారు. ప్రజల కోసం, రాష్ట్రం కోసం త్యాగాలు చేసిన వారున్నారు.

కమలం గుర్తుపై ఒక ఓటు, సైకిల్ గుర్తుపై ఒక ఓటు వేయాలని కోరుకుంటున్నాను. మే 13న పోలింగ్ బూత్‌లు దద్దరిల్లేలా ఉండాలి. ఒక రోడ్ షోకి భూ కంపం వచ్చింది. తాడేపల్లి కొంప కంపిస్తోంది. ప్రజలంతా ఏకమై కూటమిని గెలిపించాలి. రాష్ట్ర కోసం 30 రోజులు పని చేయండి. మీ అందరి కోసం ఐదేళ్లు పని చేసే బాద్యత నేను తీసుకుంటాను.

LEAVE A RESPONSE