– బీర్ల ఐలయ్య బాధితుల సంఘాలు ఏర్పడ్డాయంటేనే ఆలేరులో ఆయన అరాచకాలు ఏంటో అర్థమవుతున్నాయి
– పూర్తి స్థాయిలో రైతు భరోసా ఎప్పుడు వేస్తారో చెప్పే దమ్ముందా? .
– రుణమాఫీ, రైతుబంధు ఎగ్గొట్టి రైతుల ఉసురు పోసుకుంటున్న కాంగ్రెస్ సర్కార్.
– ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్
హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడు. పచ్చి అబద్ధాలను మాట్లాడటం కాంగ్రెస్ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గానీ, పౌరసరఫరాల శాఖ మంత్రికి గానీ ధాన్యం కొనుగోళ్లపై కనీస అవగాహన లేదు. కొనుగోళ్లపై ఏనాడైనా ముఖ్యమంత్రి రివ్యూ చేశారా?
45 డిగ్రీల ఎండలో నెలల తరబడి కల్లాల వద్ద పడిగాపులు కాస్తున్న రైతులు, విసిగిపోయి రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వానికి సోయి లేదు. ఇది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పరిస్థితి. కేసీఆర్ పాలనలో రారాజులా బతికిన రైతన్న, కాంగ్రెస్ పాలన రాగానే రోడ్డున పడ్డాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులను ఎరువుల కోసం క్యూ లైన్లలో నిలబెట్టారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రుణమాఫీ ఎగ్గొట్టాలని చూశారు. మాజీ మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో, ప్రజాక్షేత్రంలో పదే పదే నిలదీస్తే తప్ప మీకు రుణమాఫీ చేసే దిక్కు రాలేదు. ఆ ఇచ్చిన రుణమాఫీ కూడా సగం మందికి ఎగ్గొట్టి అపహాస్యం చేశారు.
వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ చెప్పిందంతా పెద్ద బోగస్. ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. గత రెండు సీజన్ల రైతుబంధును పూర్తిగా ఎగ్గొట్టారు. రైతులకు కనీస భద్రతనిచ్చే పంటల బీమా లేదు, రైతు బీమా లేదు. సన్నాలకు యాసంగి బోనస్ ఇస్తామన్న హామీ కూడా బోగస్ అయిపోయింది.
ముఖ్యమంత్రికి రైతులపై చిత్తశుద్ధి లేదు. సిద్దిపేటలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ కు వచ్చినప్పుడు ముఖం చెల్లక ఒక ఎకరానికి రైతు భరోసా ఇస్తామన్నారు. కేసీఆర్ జగిత్యాల సభకు వెళ్తే.. భయపడి ఇంకో రెండు ఎకరాలకు ఇస్తామన్నారు. ఈ విడతల వారీ భరోసా ఏంటి? పూర్తి స్థాయిలో రైతు భరోసా ఎప్పుడు వేస్తారో చెప్పే దమ్ముందా?
రైతుల భూములను కబ్జా చేసి, వాటిని వెంచర్లుగా మార్చి అమ్ముకునే కబ్జాకోరు బీర్ల ఐలయ్యకు.. రైతుల పక్షాన నిలబడే హరీశ్ రావు గారిని, బీఆర్ఎస్ పార్టీని విమర్శించే కనీస నైతిక అర్హత లేదు. నీ అవినీతి, నీ అరాచకాల గురించి ఆలేరు నియోజకవర్గ ప్రజలను అడిగితే కథలు కథలుగా చెబుతారు. ఆలేరులో ఏకంగా బీర్ల ఐలయ్య బాధితుల సంఘాలు ఏర్పడ్డాయంటేనే, నువ్వు ఏ స్థాయి కబ్జాకోరువో రాష్ట్ర ప్రజలకు అర్థమవుతోంది.
ముందు హరీశ్ రావు ని విమర్శించడం మానేసి, కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయండి. తక్షణమే పంట కొనుగోలు చేయాలి, బాకీ పడ్డ గత రెండు సీజన్ల రైతు భరోసా పాటు, ఈ సీజన్ రైతు భరోసాను, సన్నాలకు బోనస్ కూడా వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.