– అల్లరి మూకల ఆట కట్టిస్తాం
– తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీ, జెండాలు చించడంపై మంత్రి సుభాష్ అసహనం
రామచంద్రపురం: రామచంద్రపురం నియోజవర్గంలో పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా కృషి చేస్తున్నామని.. ఐనా కొంతమంది ఆకతాయిలు పార్టీ ఫ్లెక్సీలు చించటం, పార్టీ పతాకాలు పీకడం వంటి కవ్వింపు చర్యలుకు పాల్పడుతున్నారని, వారిపై చర్యలు తప్పవని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఘాటుగా హెచ్చరించారు.
తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ సంబరాలు జరుపుకుంటున్న ఈ తరుణంలో రామచంద్రపురం ఏడో వార్డులోని శీలంవారి సావరంలో కొంతమంది ఆకతాయిలు తెలుగుదేశం పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు చింపి పారవేయడంపై మంత్రి సుభాస్ తీవ్రంగా స్పందించారు. ఈ సంఘటన వెనక ఎవరున్నా వారిపై చట్టపరంగా, న్యాయపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.
ఎవరి పార్టీపై వారికి అభిమానం ఉండవచ్చు.. కానీ మా పార్టీని చులకన చేసే పనులు చేస్తే ఉపేక్షించేది లేదని తీవ్రంగా హెచ్చరించారు. తమ పార్టీ అధినాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు కక్ష సాధింపు చర్యలు లేకుండా, సమన్వయంతో, అందరూ సమానమే అనే భావంతో ముందుకు సాగిపోతున్నామన్నారు. పార్టీ నాయకుల, కార్యకర్తల, అభిమానుల మనోభావాలు దెబ్బతీసేలా ఎవరైనా ప్రవర్తిస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
పార్టీ జెండాలు, ప్లెక్సీ చింపిన విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసామని, చట్టం తన పని తాను చేస్తుందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కూడా తమ పార్టీ కార్యకర్తలపై ఇదే ప్రాంతంలో దాడి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తమ పార్టీ సిద్ధాంతాలు, చట్టానికి లోబడి తాము నడుచుకుంటున్నామని ఈ సందర్భంగా వెల్లడించారు.
ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలని పోలీసులను ఆదేశించారు. మంత్రి సుభాష్ వెంట తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం , తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.