ఎన్నికలు స్వేచ్ఛగా శాంతియుతంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు

• 46,165 పోలింగ్ కేంద్రాలకు గాను కనీసం 50 శాతం కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు
• 85ఏళ్ళు నిండినవారు,వికలాంగులు ఇంటినుండే ఓటుహక్కు వినియోగానికి అవకాశం
• ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు పెద్దఎత్తున చర్యలు
• నిరంతరం నిఘాకై 60 ఇంటిగ్రేటెడ్ సహా మొత్తం 121 చెక్ పోస్టులు ఏర్పాటు
• జనవరి నుండి ఇప్పటి వరకూ రూ.176 కోట్ల విలువైన నగదు,మద్యం స్వాధీనం
• ఎన్నికల బందోబస్తుకు కేంద్ర,రాష్ట్ర బలగాలతోపాటు సమీప రాష్ట్రాల పోలీసులు
– ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె ఎస్.జవహర్ రెడ్డి

అమరావతి,20 మార్చి: రానున్న సాధారణ – అసెంబ్లీ ఎన్నికలను స్వేచ్ఛగా శాంతి యుతంగా,నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి పేర్కొన్నారు.ఎన్నికల సన్నాహాక ఏర్పాట్లపై బుధవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో డిజిపి కె వి.రాజేంద్రనాధ్ రెడ్డి,రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాలతో కలిసి సి ఎస్ సమీక్షించారు.ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ,ఐటీ,స్వీప్,శాంతి భద్రతలు,కమ్యునికేషన్ ప్లాన్,కంప్లైంట్ రిడ్రస్సల్,ఓటరు హెల్ప్ లైన్,పోలింగ్ కేంద్రాల్లో ఉండాల్సిన కనీసం సౌకర్యాలు వంటి అంశాలపై సమీక్షించారు.

ఈ సందర్బంగా సిఎస్ మాట్లాడుతూ రానున్న ఎన్నికలు పూర్తి స్చేచ్ఛాయుతంగా,నిష్పక్ష పాతంగా శాంతి యుతంగా నిర్వహించేందుకు, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన పునరుద్ఘాటించారు.రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 46వేల 165 పోలింగ్ కేంద్రాలుండగా వాటిలో కనీసం 50 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సౌకర్యాన్ని కల్పించడం జరుగు తుందని తెలిపారు.వెబ్ కాస్టింగ్ ఉన్న పోలింగ్ కేంద్రాలను నేరుగా కేంద్ర ఎన్నికల సంఘం, మరియు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం కంట్రోల్ రూమ్లతో అనుసంధానమై పోలింగ్ సరళిని నిరంతరం మానిటర్ చేయడం జరుగుతుదంని సీఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు.

జనవరి నుండి ఇప్పటి వరకూ 176 కోట్ల రూ.లు విలువైన వస్తువులు అనగా 78 కోట్ల రూ.ల నగదు,41 కోట్ల రూ.లు విలువైన ఖరీదైన వస్తువులు,30కోట్ల రూ.ల విలవైన వివిధ డ్రగ్స్ వంటివి స్వాధీనం చేసుకున్నట్టు సిఎస్ జవహర్ రెడ్డి తెలిపారు.ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన గత నాలుగు రోజుల్లోనే వివిధ మోడల్ కోడ్ తనిఖీ బృందాల ద్వారా 3కోట్ల 39లక్షల రూ.ల విలువైన నగదు,మద్యం,ఇతర వస్తువులను స్వాధీన పర్చుకోగా వాటిలో 80 లక్షల రూ.ల నగదు,కోటి 60 లక్షల రూ.ల విలువైన మద్యం,29 లక్షల రూ.ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకోవడం జరిగిందని సిఎస్ తెలిపారు.ఎన్నికల ప్రవర్తనా నియమావళిని మరింత కట్టుదిట్టంగా అమలు చేయడం తోపాటు ఇతర అక్రమాల నియంత్రణకు రాష్ట్ర సరిహద్దులు,ఇతర ప్రాంతాల్లో 60 ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు సహా 121 చెక్ పోస్టులు అందుబాటులోకి తేవడం జరుగుతోందని సిఎస్ తెలిపారు.

రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో ఓటు ఉన్నప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే వాతావరణాన్నికల్పించడం జరుగుతుందని సిఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు.ఎన్నికల బందోబస్తు నిమిత్తం కేంద్ర,రాష్ట్ర పోలీసు బలగాలతోపాటు తమిళనాడు,కేరళ, కర్నాటక పోలీసుల సహాయం తీసుకోవడం జరుగుతుందని సీఎస్ జవహర్ రెడ్డి చెప్పారు. ఈసారి ఎన్నికల్లో 85 ఏళ్ళు నిండిన వృద్ధులు,వివిధ అంగవైకల్యం కలిగిన ఓటర్లకు ఇంటి నుండే వారి ఓటు హక్కును వినియోగించుకునేలా అవకాశం కల్పించడం జరుగుతోందని చెప్పారు.అలాగే ఓటు హక్కు ఆవశ్యకతపై ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించడం జరుగు తోందని సీఎస్.జవహర్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ సమావేశంలో డిజిపి కెవి రాజేంద్ర నాధ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ బందో బస్తుకు లక్షా 50వేల మంది రాష్ట్ర పోలీసులతోపాటు 522 కంపెనీల స్టేట్ ఆర్మడ్ రిజర్వు పోలీసు,465 కంపెనీల సెంట్రల్ ఆర్మడ్ రిజర్వు పోలీసులతో పాటు కేరళ,తమిళనాడు,కర్నాటక రాష్ట్రాల నుండి హోంగార్డు తదితర స్థాయి పోలీసులను నియమించడం జరుగుతుందని తెలిపారు.రానున్న ఎన్నికల్లో శాంతిభధ్రతల పరిరక్షణ,పటిష్ట బందోబస్తుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డి చెప్పారు.

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా ఎన్నికల సన్నద్దతపై పవర్ పాయింట్ ప్రజెంటేష్ చేస్తూ రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో 4కోట్ల 9లక్షల 41వేల 182 మంది ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 46వేల 165 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతోందని చెప్పారు.సెక్యూరిటీ సిబ్బందికి 12వేల 683 వాహనాలు,పోలింగ్ సిబ్బందికి 13వేల 322 వాహనాలు అవసరం ఉంటుందని వివరించారు.

ఎన్నికల నిర్వహణకు 175 మంది అసెంబ్లీ,25 మంది పార్లమెంట్ రిటర్నింగ్ అధికారులు,829 మంది మంది అసెంబ్లీ,209 మంది పార్లమెంట్ ఎఆర్ఓలు,5వేల 67 మంది సెక్టోరల్ అధికారులు,5వేల 67 మంది సెక్టోరల్ పోలీస్ అధికారులు,18వేల 961 మంది మైక్రో అబ్జర్వర్లు,55వేల 269 మంది ప్రిసైడింగ్ అధికారులు,2లక్షల 48వేల 814 మంది పోలింగ్ అధికారులు,46వేల 165 బూత్ స్థాయి అధికారులు,416 మంది జిల్లా స్థాయి నోడలు అధికారులు అవసరం ఉండగా వారంతా సిద్ధంగా ఉన్నారన్నారు.ఇప్పటికే రాష్ట్ర స్థాయి మాస్టర్ ట్రైనర్లకు,జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్లకు,అసెంబ్లీ స్థాయి మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ జరిగిందని సిఇఓ మీనా పేర్కొన్నారు.

కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలోని 46వేల 165 పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపు,తాగునీరు,ఫర్నిచర్,విద్యుత్ దీపాలు,మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలను కల్పించడం జరిగిందని సిఇఓ మీనా పేర్కొన్నారు.ఎన్నికల ప్రవర్తనా నియమా వళిని కట్టుదిట్టంగా అమలు చేసేందుకు అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో మోడల్ కోడ్ బృందాలు చురుగ్గా పని చేస్తున్నాయని తెలిపారు. జనవరి నుండి ఇప్పటి వరకూ 176 కోట్ల రూ.ల విలువైన నగదు,మద్యం,ఇతర వస్తువులను గత నాలుగు రోజుల్లో 3 కోట్ల 39 లక్షల విలువైన నగదు,మద్యం,వంటివి స్వాధీనం చేసుకున్నట్టు సిఇఓ మీనా వివరించారు.

ఇంకా ఈ సమావేశంలో హోం,పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి,విద్యాశాఖల ముఖ్య కార్యదర్శులు హరీశ్ కుమార్ గుప్త,శిశిభూషణ్ కుమార్,ప్రవీణ్ ప్రకాశ్,రాష్ట్ర చీఫ్ కమీషనర్ స్టేట్ టాక్సు గిరిజా శంకర్,విద్యాశాఖ కమీషనర్ సురేశ్ కుమార్,హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి విజయకుమార్,సిడిఎంఏ శ్రీకేశ్ బాలాజీ రావు,అదనపు సిఇఓ హరీంద్ర ప్రసాద్, స్పెషల్ ఎన్ఫోర్సుమెంటు బ్యూరో డైరెక్టర్ రవి ప్రకాశ్ తదితర అధికారులు పాల్గొన్నారు.అలాగే వర్చువల్ గా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రజత్ భార్గవ,విజయానంద్,ఐటి కార్యదర్శి కె.శశిధర్,ఆర్ అండ్ బి కార్యదర్శి ప్రద్యుమ్న,అదనపు డిజి బాగ్చి,తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply