వైసీపీపై ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు తీసుకోవాలి

• 5 ఏళ్లుగా ప్రజాసేవకులని చెప్పిన వాలంటీర్లు ఎన్నికలకు రెండు నెలల ముందు వైసీపీ నాయకులు ఎలా అయ్యారో, జగన్ రెడ్డి 5 ఏళ్లలో వారికి రూ.9,663కోట్ల ప్రజలసొమ్ముఎలా దోచిపెట్టాడో ఎన్నికల సంఘం ప్రశ్నించాలి
• జగన్ రెడ్డి తన పార్టీ భావినాయకులకు దోచిపెట్టిన సొమ్ముని పైసలతో సహా అతని నుంచే రాబట్టాలి
• 5 ఏళ్లుగా వాలంటీర్ల సేవలు పొందిన వైసీపీ గుర్తింపు రద్దుచేసి, ఎన్నికల్లో పోటీచేయకుండా చర్యలు తీసుకోవాలి
• వాలంటీర్లు ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి జగన్ రెడ్డిపై, వైసీపీనేతలపై తిరగబడాలి
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు

వాలంటీర్ల సభలో నిన్న జగన్ రెడ్డి తన నిజస్వరూపం బయటపెట్టుకున్నాడని, ఇప్పటివరకు వాలంటీర్లను ప్రజలకు సేవచేయడానికి నియమించామని చెప్పిన ముఖ్యమంత్రి, వైసీపీ నేతలు, ఇప్పుడు 50 రోజుల్లో ఎన్నికలు వస్తున్నందు న వాలంటీర్ల సైన్యం తనకోసం వైసీపీకోసం పనిచేయాలని చెప్పడమేంటని, జగన్ రెడ్డి మాటలు నమ్మి, వాలంటీర్లు నిజంగా ఆయన చెప్పినట్టు చేస్తే, భవిష్యత్ లో వచ్చేప్రభుత్వం ఆ వ్యవస్థను ఎందుకు కొనసాగిస్తుందని, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు,మాజీ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

జగన్ రెడ్డి వాలంటీర్లను బలిచేయడానికి సిద్ధమయ్యాడు. సాక్షి దినపత్రికలో ప్రచురించిన ‘మీరే వైసీపీ భావి లీడర్లు’ కథనమే అందుకు నిదర్శనం “ జగన్ రెడ్డి ఎన్నికల్లో లబ్ధిపొందడానికి వాలంటీర్లను బలిచేయబోతున్నాడనే వాస్తవాన్ని వారంతా అర్థం చేసుకోవాలి. జగన్ రెడ్డి దుర్మార్గపు ఆలోచనలకు వాలంటీర్లు బలి అయ్యేలా నేడు సాక్షి పత్రిక కథనాలు ప్రచురించింది. ‘మీరే భావి లీడర్లు’ అనే పేరుతో వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో నిన్న జగన్ రెడ్డి చేసిన ప్రసంగానికి కొన్ని వక్రీకరణలు జోడించి సాక్షిపత్రికలో ప్రధానవార్తగా ప్రచురించారు. నిన్నటివరకు ప్రజలకు సేవలందించడానికి వాలంటీర్లను నియమించామని చెప్పిన జగన్ రెడ్డి…వైసీపీనేతలు.. సాక్షి మీడియా నేడు ఆ వాలంటీర్లే తమ ఆశాదీపాలు.. తమపార్టీ నాయకులని చెప్పడాన్ని ఎలా అర్థంచేసుకోవాలి?

వైసీపీ భావినాయకులైన వాలంటీర్లకు 5 ఏళ్లుగా రూ.9,663 కోట్ల ప్రజల సొమ్ముని జగన్ రెడ్డి ఏ చట్ట ప్రకారం దోచిపెట్టాడు?
వాలంటీర్లు వైసీపీ భావి లీడర్లు అయితే, వారే జగన్ రెడ్డి సైన్యం అయితే, గత 5 ఏళ్లలో 2,55,464 మంది వాలంటీర్లకు రూ.5వేలచొప్పున నెలకు రూ.127కోట్ల లెక్కన రూ.9,663 కోట్ల ప్రజలసొమ్ముని ఎలా దోచిపెట్టారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. వాలంటీర్లకు 5ఏళ్లలో చెల్లించిన సొమ్ము రూ.7,663 కోట్లు అయితే, వారికి ట్రైనింగ్ ఇవ్వడానికి రూ.1000కోట్లు, సాక్షి దినపత్రికలో వారికి సంబంధిం చిన ప్రకటనలకోసం మరో రూ.1000కోట్లు మొత్తంగా రూ.9,663కోట్లు ఎందుకు దుర్వినియోగం చేశాడో జగన్ రెడ్డి చెప్పాలి? వాలంటీర్లకు ప్రజలసొమ్ము దోచి పెట్టడంపై, వారిని తనపార్టీ నాయకులని చెప్పి, వారిద్వారా జగన్ రెడ్డి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి చేస్తున్న ప్రయత్నాలపై తాము ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం.

5 ఏళ్లుగా వాలంటీర్లకోసం ఖర్చుపెట్టిన ప్రతి సొమ్ముని జగన్ రెడ్డి లేదా వైసీపీ నుంచి రాబట్టాలని ఎన్నికల కమిషన్ ను కోరతాం. వైసీపీ భావిలీడర్లకు ప్రభుత్వం నుంచి జీతాలు ఎలా ఇచ్చారో, ప్రజల సొమ్ముని ఏ చట్టం ప్రకారం.. ఏ రాజ్యాంగం ప్రకారం ఇచ్చాడో జగన్ రెడ్డి సమాధానం చెప్పాల్సిందే. వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లకు చెల్లించిన రూ.9,663కోట్లను జగన్ రెడ్డి నుంచే రాబట్టాలని ఎన్నికల కమిషన్ ను కోరుతున్నాం. వాలంటీర్ వ్యవస్థను ప్రజలకోసం తీసుకొచ్చినట్టు ఇన్నాళ్లు అబద్ధాలు చెప్పి, నేడు వాలంటీర్లు మొత్తం వైసీపీ వారే అంటున్న అధికారపార్టీ గుర్తింపును రద్దుచేసి, ఎన్నికల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తున్నాం.

జగన్ రెడ్డి వ్యాఖ్యలతో వాలంటీర్లకు భవిష్యత్ లేకుండా పోయింది
జగన్ రెడ్డి వ్యాఖ్యలపై వాలంటీర్లు కూడా ఆలోచించుకోవాలి. వాలంటీర్లే వైసీపీ భావి నాయకులని, వారే తన సైన్యమని జగన్ రెడ్డి అంటే, భవిష్యత్ లో వచ్చే ప్రభుత్వాలు వాలంటీర్లను కొనసాగిస్తాయా.. జగన్ రెడ్డి తన స్వార్థం కోసం చేసిన వ్యాఖ్యలు తమకు ఎంత చేటుచేయనున్నాయో వాలంటీర్లు ఆలోచించాలి. నిజంగా వాలంటీర్లు ప్రజలకు సేవలు అందించేవారే అయితే, జగన్ రెడ్డి వ్యాఖ్యల్ని ఖండించి, వైసీపీప్రభుత్వంపై తిరగబడాలి. జగన్ రెడ్డి వాలంటీర్లతో గొడ్డుచాకిరీ చేయించుకొని, వాళ్లతో తన పార్టీ వారి అడుగులకు మడుగులు వత్తించి, తీరా ఇప్పుడు ఎన్నికల ముంగిట వారిపొట్టకొట్టాడు.

టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ టీడీపీ-జనసేన ప్రభుత్వం రాగానే వాలంటీర్లను రెగ్యులరైజ్ చేసి, వారికి వేతనాలు పెంచుతామని ఇప్పటికే హామీ ఇచ్చారు. ఆయన చెప్పింది జరగకూడదన్న దురుద్దేశంతో నేడు జగన్ రెడ్డి వాలంటీర్లను పూర్తిగా రోడ్డున పడేసేలా వారే తనసైన్యం.. వారే తనను, తన పార్టీని ఎన్నికల్లో గెలిపించాలని చెప్పడం ద్వారా వారి భవిష్యత్ ను నాశనం చేశాడు.

జగన్ రెడ్డి చెప్పింది విన్నాక భవిష్యత్ లో ఏ పార్టీ అయినా, వైసీపీకాకుండా ఇతర పార్టీల నాయకులు ఎవరైనా వాలంటీర్లకు ఉద్యోగాలు ఇస్తారా? ఇప్పటికైనా వాలంటీర్లు వాస్తవాలు గ్రహించి జగన్ రెడ్డిని, వైసీపీ నేతల్ని తిరస్కరించి వారు చెప్పేవి మేం చేయమని, మేం ప్రజలకు మాత్రమే సేవకులమని తిరగబడాలి.

వాలంటీర్లను ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ లోతుగా ఆలోచించాలి
వాలంటీర్లకు ప్రజలసొమ్ము దోచిపెట్టడం ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమే. జగన్ రెడ్డి నిన్న వాలంటీర్ల సభలో చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ పెద్దలు, అధికారులు తక్ష ణమే స్పందించాలి. ఎన్నికల కమిషన్ కూడా జగన్ రెడ్డి వ్యాఖ్యలపై లోతుగా ఆలోచించి, వెంటనే చర్యలకు ఉపక్రమించాలి. వాలంటీర్లను ఉద్దేశించి జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తే, వారికి జరిగే నష్టానికి ముఖ్యమంత్రి బాధ్యత తీసుకుంటాడా?

తాను వాలంటీర్లను ఉద్దేశించి అన్న మాటలకు కట్టుబడి వారికి, వారికుటుంబాలకు అండగా ఉంటానని చెప్పగలడా? జగన్మోహన్ రెడ్డి తన ముసుగు తొలగించి నిన్న అసలు స్వరూపం బయటపెట్టాడు.” అని బొండా ఉమా తెలిపారు.

Leave a Reply