అమరావతి: సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) ను ఇథియోఫియా దేశానికి చెందిన ప్రతినిధుల బృందం గురువారం సందర్శించింది. ఇథియోఫియా దేశ డిజిటల్ అగ్రికల్చర్ అండ్ ఫైన్సాన్స్ ప్రోగ్రామ్ డైరెక్టర్ గిరుమ్ కెటెమా టెక్లెమారియం నేతృత్వంలో 10 మంది ప్రతినిధుల బృందం అమరావతిలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా ఈ బృందం ఆర్టీజీఎస్‌ను సందర్శించింది.
ఈ బృందానికి ఆర్టీజీఎస్ డిప్యూటీ సీఈఓ ఎం. మాధురి స్వాగతం పలికారు. ఆర్టీజీఎస్ పనితీరు గురించి ఆమె ఈ బృందానికి వివరించారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సాంకేతిక వారధిలా ఆర్టీజీఎస్ పనిచేస్తున్న తీరు గురించి తెలిపారు. విజనరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినూత్న ఆలోచనల నుంచి ఆర్టీజీఎస్ వ్యవస్థ రూపుదిద్దుకుందన్నారు. ఇలాంటి సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న మొట్టమొదటి రాష్ట్రంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మాత్రమేనన్నారు.
ప్రభుత్వంలోని అన్ని శాఖల డేటాను అనుసంధానిస్తూ ఒక పెద్ద డేటాలేక్‌ను రూపొందిస్తున్నామని, దీని ద్వారా పాలన మరింత సరళీతరం చేయడానికి వీలవుతుందన్నారు. ప్రజలు పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వారి మొబైల్ ఫోన్లోనే ప్రజలకు అన్ని సేవలు అందించాలన్నదే ప్రభుత్వ ఆశయమన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం మన మిత్ర పేరిట వాట్సాప్ గవర్నెన్స్‌ను ప్రారంభించిందన్నారు.
ప్రస్తుతం 455 రకాల సేవలను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందజేస్తున్నామని, రాబోయే రోజుల్లో ప్రజలకు వెయ్యికి పైగా సేవలను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించాలన్నదే లక్ష్యమని చెప్పారు. ప్రజలకు వాతావారణ మార్పుల గురించి ఎప్పటికప్పుడు రియల్ టైమ్‌లో అందించి వారిని అప్రమత్తం చేయడానికి వీలుగా అవేర్ హబ్ ఏర్పాటు చేశామన్నారు. ఇస్రో సహకారంతో వాతావరణాన్ని ఆర్టీజీఎస్ నిరంతరం పర్యవేక్షిస్తుంటుందని తెలిపారు.
ప్రభుత్వ కార్యక్రమాలు మరింత పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించి ప్రజలకు సత్వరం మెరుగైన సేవలందించడానికి వీలుగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సును పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నామని చెప్పారు. ఇందుకోసం ఆర్టీజీఎస్‌లో ప్రత్యేకించి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ హబ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ఫలాలు ప్రజలకు సక్రమంగా అందించడానికి కావాల్సిన సాంకేతిక సహకారాన్ని ఆయా ప్రభుత్వ శాఖలకు ఆర్టీజీఎస్ అందిస్తోందన్నారు.
ఇథియోఫియా ప్రతినిధి బృంద సభ్యులు పనితీరు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి అద్భుత సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న ఏపీ ప్రభుత్వాన్ని ఈ బృందం కొనియాడింది. ఈ బృందం వెంట రాష్ట్ర వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ బాలసుబ్రమణ్యం, అసిస్టెంట్ డైరెక్టర్ వీయువీ రమణ తదితరులున్నారు.