Home » లోక్‌సభ ‘స్పీకర్’కు ‘ఫ్యాను’ గాలి

లోక్‌సభ ‘స్పీకర్’కు ‘ఫ్యాను’ గాలి

– లోక్‌సభ స్పీకర్ ఎన్నికలో ఎన్డీఏ వైపు వైసీపీ
– బిర్లాకు మద్దతునివ్వాలని జగన్ నిర్ణయం
– ఆ మేరకు వైసీపీపీపీ నేత సుబ్బారెడ్డి ప్రకటన
– బీజేపీ కోరిందా? వైసీపీనే ఇచ్చిందా?
– కేసుల భయంతోనే బీజేపీకి జగన్ జైకొట్టారా?
– మరి బీజేపీ జగన్ మద్దతు తీసుకుంటుందా? లేదా?
– వైసీపీ మద్దతునివ్వడంపై టీడీపీ వైఖరేమిటి?
– బీజేపీ వైఖరిని గమనిస్తున్న టీడీపీ ఎంపీలు
– బీజేపీ ఇంకా డబుల్‌గేమ్ ఆడుతోందా?
– వైసీపీ మద్దతు లేకుండానే స్పీకర్ గెలిచే చాన్స్
– అయినా వైసీపీ మద్దతు తీసుకుంటే ఏపీ సంగతేమిటి?
– బీజేపీకి వైసీపీ మద్దతుపై మండిపడుతున్న తమ్ముళ్లు
( మార్తి సుబ్రహ్మణ్యం)

అనుకున్నదే జరుగుతోంది. అవసరార్ధం ముసుగుతొలగించాల్సిన పరిస్థితి. తనకు మద్దతునిచ్చిన మైనారిటీలను నిలువునా మోసం చేయక తప్పని అనివార్యం. ఘోర పరాజయం మూటకట్టుకుని.. మళ్లీ ప్రతి శుక్రవారం కోర్టు ముందు, చేతులుకట్టుకుని నిలబడే పరిస్థితిని తప్పించుకునే ఎత్తుగడ. మళ్లీ కాళ్లబేరానికి భలే సమయం. తన విధ్వంసపాలనపై.. రాష్ట్రంలో వెల్లువెత్తే కేసులను తప్పించుకునే ముందస్తు రాజకీయ ఎత్తుగడ. దానికి లోక్‌సభ స్పీకర్ ఎన్నిక వేదిక. అందుకే బేషరతుగా ఎన్డీయేకు మద్దతు. ఎలాగైతేనేం ఢిల్లీకి దగ్గర కావాలి. ఇదీ జగన్ తాజా అడుగు.

అటు బీజేపీ కూడా జగన్ ఇచ్చే మద్దతు అవసరం లేకపోయినా.. రా రమ్మని ఆనందంగా ఆహ్వానిస్తున్నట్లుంది. అంటే.. మళ్లీ ఏపీలో బీజేపీ డబుల్‌గేమ్ మొదలుపెట్టిందన్నమాట. మరి అప్పుడు ఎన్డీయేలో ఉన్న టీడీపీ ఏం చేయాలి? ఏం చేస్తుంది? టీడీపీ బలం చూసి భయపడి.. బీజేపీ తనకు జగన్ ఇచ్చే మద్దతు వద్దంటుందా? లేక ముందు.. ‘గండం గడచి పిండం బయటపడట’మే ప్రధానం అనుకుంటుందా? ఇదీ ఇప్పుడు లోక్‌సభ స్పీకర్ ఎన్నిక వైచిత్రి.

వైసీపీపై బీజేపీ వైఖరికి సరైన సమయం-వేదిక లభించింది. లోక్‌సభ స్పీకర్‌గా ఓంప్రకాష్ బిర్లాను ఎంపిక చేసిన ఎన్డీయేకు లోక్‌సభలో తగినంత మెజారిటీ ఉంది. ఆ ప్రకారం పెద్దగా కష్టపడకుండానే స్పీకర్ ఎన్నికలో విజయం సాధించవచ్చు. పైగా లోక్‌సభలో అత్యధిక స్థానాలున్న ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్ కూడా ఇండి కూటమి లోక్‌సభ అభ్యర్ధి కె.సురేష్‌కు, మద్దతునిచ్చే అవకాశాలు కనిపించడం లేదు.ఎంపిక సమయంలో తమను సంప్రదించలేదని మమతా దీదీ అప్పుడే అసంతృప్తిరాగం అందుకున్నారు. ఇక బీజేపీతో మొహమాటంతోనో.. కేసుల భయం ఉన్న కారణాలతోనో మరికొన్ని ప్రాంతీయ పార్టీలు అసలు ఓటింగ్‌కు దూరమయ్యే అవకాశాలూ లేకపోలేదు. ఏ లెక్కప్రకారం చూసినా , ఎన్డీఏ అభ్యర్ధి విజయం నల్లేరుపై నడకేనన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ.

అయినా సరే.. నలుగురు ఎంపీలున్న వైసీపీ, ఎన్నికలో ఎన్డీయే అభ్యర్ధికి మద్దతునివ్వాలని నిర్ణయించడం, రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అయితే ఆ మేరకు బీజేపీ వ్యూహబృందమే జగన్‌ను మద్దతు కోరిందా? లేక కేసుల రక్షణ, ఏపీలో తన రాజకీయ భవిష్యత్తు కోసం మద్దతు ఇస్తున్నారా? అన్నది చూడాలి. కారణం ఏదైనా వైసీపీ మద్దతు ప్రకటిస్తే దాన్ని బీజేపీ స్వీకరిస్తుందా? లేదా? 4 స్థానాలున్న వైసీపీ కావాలా? 16 స్థానాలున్న టీడీపీ అవసరమా? అన్నదే ఇప్పుడు బీజేపీ ముందున్న ప్రశ్న. రేపటి మిత్రధర్మం-మిత్రబేధానికి ఇదో అగ్నిపరీక్ష.
సాధారణంగా అయితే.. ఎన్డీయే భాగస్వామితో పాటు, కేంద్రమంత్రివర్గంలో ఉన్న టీడీపీ అనుమతి తీసుకోవడం బీజేపీ మిత్రధర్మం. ఆ మేరకు తన కు జగన్ పంపిన ఆఫర్‌ను టీడీపీ నాయకత్వానికి సమాచారం ఇచ్చి, ఆ పార్టీ అభిప్రాయం తీసుకోవలసి ఉంది. కానీ బీజేపీ నాయకత్వం ఆ పనిచేసినట్లు లేదన్నది పార్టీ వర్గాల సమాచారం.

నిజానికి స్పీకర్ పదవి తనకు కావాలని టీడీపీ పట్టుపడితే, ఇవ్వక తప్పని పరిస్థితి. కానీ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, బీజేపీని ఇబ్బందిపెట్టడం ఇష్టం లేక ఆ పదవిపై దృష్టి సారించలేదు. ఇది ఒకరకంగా బాబు బీజేపీకి పెద్ద మేలు చేసినట్లే. ఎందుకంటే అటు ‘ఇండి’కూటమి.. స్పీకర్ పదవికి టీడీపీ పోటీ పెడితే, మద్దతునిస్తామని ప్రతిపాదించడాన్ని విస్మరించకూడదు.

రేపటి ఎన్నికలో ఒకవేళ బీజేపీ నాయకత్వం.. అవసరార్ధం వైసీపీ మద్దతు తీసుకుంటే, ఏపీలో తదనంతర రాజకీయ పరిణామాలు సవ్యంగా ఉండవన్నది, మెడమీద తల ఉన్న ఎవరికైనా అర్ధమవుతుంది. ఒకవైపు ఎన్డీయే భాగస్వామిగా అటు కేంద్రంలో టీడీపీని తీసుకున్న బీజేపీ.. అదే మిత్రధర్మంతో బీజేపీకి మంత్రివర్గంలో టీడీపీ చోటిచ్చింది. ఈ పరిస్థితిలో బీజేపీ నాయకత్వం వైసీపీ మద్దతు తీసుకుంటే.. ఇకపై రాష్ట్రంలో మిత్రబేధం అనివార్యమవుతుంది.

ఒకవేళ వైసీపీ మద్దతు తీసుకుంటే.. బీజేపీ మళ్లీ ఏపీలో డబుల్‌గేమ్ మొదలుపెట్టిందని అనుమానించక తప్పదు. అంటే టీడీపీ కావాలి. వైసీపీ కావాలనే ద్వంద్వ వైఖరి అన్నమాట. ఇప్పుడు ఎన్డీయే టీడీపీలో చేరిన తర్వాత కూడా బీజేపీ-వైసీపీ అదే వ్యూహం అమలుచేస్తే మాత్రం, రాష్ట్రంలో చిక్కులు తప్పవని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. రాజ్యసభలో కూడా వైసీపీ బలం బీజేపీకి అవసరం. టీడీపీ రాజ్యసభలో ఇంకా ఖాతా తెరవలేదు. కాబట్టి వైసీపీ మద్దతు బీజేపీకి అనివార్యం.

ఇప్పటివరకూ లోక్‌సభ-రాజ్యసభలో కేంద్రం ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకూ వైసీపీ మద్దతునిచ్చింది. రాష్ట్రపతి-ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ మద్దతునిచ్చింది. టీడీపీ కూడా మద్దతునిచ్చినప్పటికీ.. అది అప్పుడు, ఎన్డీయే భాగస్వామి కాదన్నది విస్మరించకూడదు. అలాగని వైసీపీ కూడా ఎన్డీయే లో లేదు.

అసలు ఎన్డీయే అభ్యర్ధికి మద్దతునిస్తున్నట్లు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వైవి సుబ్బారెడ్డి ప్రకటించిన వెంటనే, మిత్రధర్మం ప్రకారం బీజేపీ స్పందించాల్సి ఉంది. తమకు వైసీపీ మద్దతు అవసరం లేదని, ఎన్డీయే భాగస్వామి టీడీపీ మాత్రమే తమకు మిత్రపక్షమని, నిర్మొహమాటంగా పత్రికా ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. అలాంటి ప్రకటన చేస్తే టీడీపీలో కూడా అనుమానాలకు ఆస్కారం ఉండదు.

కానీ ఇంతవరకూ బీజేపీ నాయకత్వం అలాంటి ప్రకటన చేయలేదంటే.. వైసీపీని రారమ్మని ఆహ్వానిస్తున్లట్లే లెక్క. ఇది టీడీపీ శ్రేణులను సహజంగా అసంతృప్తి-ఆగ్రహానికి గురిచేసే పరిణామమే. నిజానికి సుబ్బారెడ్డి ప్రకటన వెంటనే టీడీపీ సీనియర్లు బీజేపీ డబుల్‌గేమ్‌పై మండిపడుతున్నారు. బీజేపీని నమ్మవద్దని, అసలు ఆ పార్టీతో పొత్తే వద్దని ఎన్నికల ముందు స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

తాజా పరిణామాలను టీడీపీ నాయకత్వం, ఎంపీలు నిశితంగా పరిశీలించక తప్పని పరిస్థితి. ఒకవేళ బీజేపీ నాయకత్వం వైసీపీ మద్దతు స్వీకరిస్తే ఎలా స్పందించాలి? తన రాజకీయ ప్రత్యర్ధి మద్దతు బీజేపీ తీసుకుంటే, టీడీపీ శ్రేణుల మనోభావాలు ఎలా ఉంటాయి? బీజేపీని భవిష్యత్తులో నమ్మవచ్చా లేదా అన్న సందేహానికి, లోక్‌సభ స్పీకర్ ఎన్నిక పరీక్షగా పెట్టుకుంటుందా? లేక ‘ఎన్డీయే అవసరార్ధం కోసం తీసుకున్న నిర్ణయమ‘ని పెద్దమనసుతో, ‘కార్యకర్తల మనోభావాలు త్యాగం’ చేస్తుందా? చూడాలి.

Leave a Reply