Suryaa.co.in

Telangana

రైతు సంక్షోభం నేటికి ఒక పెద్ద సవాలు

– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

మన దేశంలో వరి ఉత్పత్తి స్వాతంత్ర్య అనంతరం దాదాపు 8 రెట్లు పెరిగి, 14 కోట్ల మెట్రిక్ టన్నులకు చేరుకుందని, వరి ఉత్పత్తికి కావాల్సిన అన్ని వనరులు మరియు సాంకేతికత రైతుకి అందుబాటులోకి వచ్చినా, రైతు సంక్షోభం అనేది నేటికి కూడా ఒక పెద్ద సవాలుగానే మిగిలిపోయిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభిప్రాయ పడ్డారు. ఈ సంక్షోభానికి ఉత్పత్తికి సంబంధించిన అంశాలతో పాటు, స్టోరేజ్, మార్కెట్ కి సంబంధించిన సమస్యలు ప్రధాన కారణాలు అని పేర్కొన్నారు.

దాదాపు 5 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ఎగుమతులలో, భారతదేశ వాటా దాదాపు 45 శాతంగా ఉందని, మన దేశం నుండి వివిధ రకాల వరి ధాన్యం సుమారు 100 దేశాలకు ఎగుమతి అవుతుందని తెలిపారు. ముఖ్యంగా ఆఫ్రికా ఖండంలోని దేశాలు, లాటిన్ అమెరికాలోని కొన్ని దేశాలు మరియు యూరప్, అమెరికా మరియు ఆస్ట్రేలియా లాంటి అభివృద్ధి చెందిన దేశాలు సైతం వరి దిగుమతుల కోసం భారతదేశం వైపు చూస్తున్నాయని, ఈ అవకాశాలను మనం పూర్తి స్థాయిలో వినియోగించుకున్నట్లయితే మన రైతాంగానికి సరైన ధరతో పాటు పెద్ద మొత్తంలో ఉన్న మార్కెట్ నిల్వల సమస్య కూడా పరిష్కరించుకోవచ్చన్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ లాంటి వరి మిగులు రాష్ట్రాలకు వరి ధాన్యాన్ని ఎగుమతి చేసే అవకాశాలు చాలా ఉన్నాయని, ఈ అవకాశాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంలో మనం వెనకబడి ఉన్నామని తెలియజేశారు.

‘‘అంతర్జాతీయ కమోడిటీ సంస్థ వారు ప్రతి సంవత్సరం ఒక్కొక్క దేశంలో ప్రపంచ వరి సదస్సును గత 22 సంవత్సరాల నుండి నిర్వహిస్తూ, వరికి సంబంధించిన ఎగుమతి, దిగుమతిదారులతో పాటు ప్రముఖ వరి శాస్త్రవేత్తలు మరియు వరి పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులను ఒక గొడుగు కిందకి తీసుకువచ్చి వరి అభివృద్ధికి కావాలసిన విధానపరమైన అంశాలను చర్చించి వరి ఎగుమతి, దిగుమతులను ప్రొత్సహించడంతోపాటు అభ్యుదయ రైతులు మరియు వ్యవసాయ శాస్త్రవేత్తలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి వారి ఉత్పత్తిలో సమస్యలను పరిష్కరిస్తుంది.

ఈ సదస్సుకు దాదాపు 150 మంది విదేశి వరిధాన్యం ఎగుమతిదారులు, దిగుమతిదారులతో పాటు అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ (పిలిప్పైన్స్) నుండి ప్రముఖ వరి శాస్త్రవేత్తలు మరియు దేశంలోని ఇతర రాష్ట్రాల నుండి దాదాపు మరో 150 మంది వరి ఎగుమతిదారులు మరియు వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొంటున్నారు.

వీరితో పాటు రాష్ట్రంలోని అభ్యుదయ రైతులు మరియు రైస్ మిల్లర్లు, వరి విత్తన కంపెనీ ప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు. మరియు ఈ సదస్సులో ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీస్ కూడా భాగస్వామ్యం పంచుకుంటుందన్నారు’’

ఈ సదస్సుతో తెలంగాణ రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలు:
– ఈ సదస్సులో మన దేశీయ వరి ఎగుమతిదారులు, ఇతర దేశాల నుండి వచ్చే ధాన్యం దిగుమతిదారులతో నేరుగా సంప్రదింపులు జరిపుకొనే అవకాశం ఉన్నది. తద్వారా మనం ఎగుమతిచేసే వరిధాన్యం అనేది ఇతర దేశాల దిగుమతిదారులకు అనుకూలంగా ఉన్నాయా, లేదా అని తెలసుకునే అవకాశం ఉంటుంది.

– అంతేకాకుండా ఏఏ దేశాలలో ఏ రకం వరి దిగుమతులకు డిమాండ్ ఉన్నది. ఎలాంటి నాణ్యతగల వరి రకాలు మన దేశం నుండి ఎగుమతిఅవుతున్నాయి అనే విషయాలు తెలుసుకునే అవకాశాన్ని ఈ సదస్సు కల్పిస్తుంది.

– దీంతోపాటు ఎలాంటి అధునాతనమైన రైస్ మిల్లర్లు వాడటం ద్వారా ఎగుమతికి కావాల్సిన నాణ్యతను పాటించవచ్చో రైస్ మిల్లర్లకు అవగాహన చేసుకునే అవకాశం ఉన్నది.
– వరిపండించే అభ్యుదయ రైతులు, ఎలాంటి యాజమాన్య పద్దతులు పాటించి ఏ రకం వరి పండించినట్టయితే ఎగుమతికి అనుకూలమైన ధాన్యాన్ని పండించవచ్చొ తెలుసుకునే అవకాశం ఉన్నది.

– అంతేకాకుండా అంతర్జాతీయ వరి సంస్థ నుండి పాల్గొనే శాస్త్రవేత్తల నుండి విత్తనొత్పత్తిలో అందుబాటులో ఉన్న అధునాతన పరిజ్ఞానంను విత్తన పరిశ్రమ ప్రతినిధులు మరియు అభ్యుదయ రైతులు తెలుసుకునే అవకాశాన్ని ఈ సదస్సు కల్పిస్తుంది.

– 20 మంది విదేశి మరియు దేశీయ పరిశ్రమలు వారివారి ఉత్పత్తులను మరియు ఎగుమతులకు అనుగుణమైన వరిరకాలను ప్రదర్శిస్తారు. ఈ సమాచారం ఇటు రైతులకు మరియు దేశీయ వరి ఎగుమతిదారులకు ఎంతో ఉపయోగకరం.

– నాగార్జునసాగర్ పరివాహక ప్రాంతంలో సాగయ్యే HMT, సూర్యాపేట, నల్లగొండ, పెద్దపల్లి జిల్లాలలో పండించే 1010 బాయిల్డ్ రకం, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలలో పండే జై శ్రీరాం రకం, మహారాష్ట్ర నుండి తీసుకువచ్చి ఇక్కడ ప్రాసెసింగ్ చేసే IR64 (స్టీమ్ రైస్) నకు బయటి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. వీటి ఎగుమతుల అవకాశాలను ఈ సదస్సులో కంపెనీల మధ్య జరిగే వాణిజ్య ఒప్పందాల ద్వారా పెంచడానికి అవకాశం ఉన్నదని వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు ఆశాభావం వ్యక్తం చేశారు. రేపు జరగబోయే సదస్సులో సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మరో ముఖ్య అతిధిగా పాల్గొనున్నారు

LEAVE A RESPONSE