పట్టపగలే భారీ అగ్నిప్రమాదం

– ఉవ్వెత్తున ఎగిసిపడ్డ మంటలు
– పార్కింగ్‌ చేసిన 20 బస్సుల్లో 7 బస్సులు పూర్తిగా దగ్థం
– నష్టం అంచనా రు3.25కోట్లు
– అయిదు ఫైర్‌ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది

ఒంగోలు: పట్టపగలే భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుని 7 బస్సులు పూర్తిగా దగ్థం కాగా ఒక బస్సు పాక్షికంగా మంటలు అంటుకున్నాయి. ఈ ఘటన మంగళవారం ఉదయం 9గంటల సమయంలో ఒంగోలు సిటీ మంగమ్మ కాలేజీ సమీపంలోని ఉడ్‌ కాంప్లెక్స్‌లో చోటుచేసుకుంది. అయిదు అగ్నిమాపక శకటాలు కృషిచేసి మంటలు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటూ రు10కోట్ల విలువైన ఆస్తిని కాపాడారు. అయితే దగ్థం అయిన వాటి ఆస్తి విలువ సుమారు 3.25కోట్లు ఉంటుందని వేమూరి కావేరి ట్రావెల్స్‌ మేనేజర్‌ వేమూరి వెంకటేశ్వరరావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

వేమూరి సుబ్బారావు అనే వ్యక్తి వేమూరి ట్రావెల్స్, వేమూరి కావేరి ట్రావెల్స్, కావేరి కామాక్షి ట్రావెల్స్, వినోద్‌ ట్రావెల్స్‌ పేరుతో బస్సులు తిప్పుతుంటారు. ఇవన్నీ చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విశాఖ, గోవా, షిర్డీలకు నడుపుతుంటారు. అయితే కోవిడ్‌ 19 సందర్భంగా బస్సులు నడపడం కష్టం కావడంతో గత ఏడాది కాలంగా బస్సులను స్థానిక ఉడ్‌ కాంప్లెక్స్‌లోని తమ యొక్క 60 సెంట్ల ఖాళీ స్థలంలో పార్కు చేశారు. ఈ క్రమంలో ఉదయం 9గంటల సమయంలో మంటలు వ్యాపించడం సమీపంలోని వారు గమనించారు. దీంతో ఉలికిపాటుకు గురై వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు.

ఒంగోలులో ఉన్న మూడు ఫైర్‌ ఇంజన్లు అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేసేందుకు యత్నించాయి. అయితే అప్పటికే 7 బస్సులకు మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే టంగుటూరు, అద్దంకి నుంచి కూడా రెండు ఫైర్‌ ఇంజన్లను రప్పించారు. మంటలను ఆర్పివేయడం ఒక భాగం అయితే మరో వైపు మంటలు ఇతర బస్సులకు వ్యాపించకుండా చర్యలు చేపట్టాల్సి వచ్చింది.

ఇదిలా ఉంటే తగలబడుతున్నది బస్సులు కావడంతో డీజిల్‌ ట్యాంక్‌లు పేలడం, బస్సు టైర్లు పేలుతుండడంతో మంటలు అదుపుచేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మొత్తంగా 3 ఓల్వో మల్టీ యాక్సెల్, 2 ఓల్వో స్కానియా, 1 హైటెక్, రెండు అశోక్‌ లేలాండ్‌ బస్సులకు మంటలు అంటుకున్నాయి. వీటిలో ఏడు బస్సులు ముప్పాతిక భాగం పూర్తిగా దగ్థం అయ్యాయని, ఒక బస్సు మాత్రం పాక్షికంగా దగ్థం అయినట్లు గుర్తించారు.

అయితే బస్సులకు మంటలు అంటుకున్నాయని తెలియడంతోనే అటు అగ్నిమాపక శాఖ, ఇటు పోలీసులు స్పందించిన తీరు పెను ప్రమాదాన్ని తప్పించింది. జిల్లా ఫైర్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరావు, సహాయ జిల్లా ఫైర్‌ ఆఫీసర్లు వీరభద్రరావు, కెవీకే ప్రసాద్‌లు స్వయంగా దగ్గరుండి మంటలను అదుపుచేయడంలో
fire-ong కృషిచేశారు. ఇక ఒంగోలు డీఎస్పీ నాగరాజుతోపాటు తాలూకా సీఐ శ్రీనివాసరెడ్డి తదితరులు కూడా స్వయంగా దగ్గరుండి ప్రమాదం వ్యాప్తి చెందకుండా తక్షణ చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ సమస్య ఏర్పడకుండా చేపట్టడంతోపాటు సమీపంలోనే పార్కింగ్‌ చేసి ఉన్న పలు వాహన కంపెనీల వాహనాలను తక్షణమే అక్కడనుంచి తొలగింపజేయడం వంటి ప్రక్రియ చేపట్టారు. ఇంకా నగరంలో గుండా వెళుతున్న పాత హైవేపై వాహనాలు అగకుండా చేయడంతో మంటలను సకాలంలో అదుపుచేయగలిగారు.

దీనిపై వేమూరి కావేరి ట్రావెల్స్‌ మేనేజర్‌ వేమూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కోవిడ్‌ కారణంగా బస్సులను 2020నుంచి పార్కింగ్‌ చేసి ఉంచామన్నారు. మొత్తం 20 బస్సులు ఉన్నాయని, వాటిలో ఏడు బస్సులు పూర్తిగా దగ్థం అయ్యాయన్నారు. తనకు ఉదయం 9.30 గంటల సమయంలో యేనుగంటి శ్రీకాంత్‌ అనే వ్యక్తి ఫోన్‌చేసి బస్సులు తగలబడుతున్న విషయాన్ని చెప్పారని, దీంతో తాను హుటాహుటిన అక్కడకు చేరేసరికే పెద్ద ఎత్తున మంటలు వ్యాపిస్తున్నాయన్నారు. అగ్నిమాపక శాఖ అధికారులు స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని, నష్టం రు3.25కోట్లుగా పేర్కొంటూ తాలూకా పోలీసులకు ఫిర్యాదుచేశారు. అయితే ప్రమాదానికి కారణం తెలియరాలేదని పేర్కొన్నారు.

అయితే ఈ ప్రమాదంపై అటు అగ్నిమాపక శాఖ అధికారులు, పోలీసు అధికారులు విచారణ చేపట్టారు. సమీపంలోనే వంట వండుతుండడంతో ఏమైనా అగ్గిరవ్వలు ఏమైనా బస్సులకు అంటుకున్నాయా లేక ఉడ్‌ కాంప్లెక్స్‌ కావడంతో రంపపు పొట్టు పార్కింగ్‌ చేసిన బస్సుల వద్ద కూడా పడుతుండడంతో , ఎవరైనా సిగిరెట్‌ తాగి నిర్లక్ష్యంగా విసిరి వేయడంతో మంటలు వ్యాపించాయా లేక ఏసీ బస్సులు కావడంతో ఎలుకలు వంటివి వైర్లు కొరకడంతో ఏవైనా మంటలు వ్యాపించాయా అనే పలు అంశాలపై విచారణ చేపట్టారు. అయితే ప్రాధమికంగా అటు అధికారులకు గాని, ఇటు యాజమాన్యానికి గాని ప్రమాదానికి గల కారణం మాత్రం తెలియరాలేదు.