Home » ప్రజల కోసం.. ప్రజల మధ్య.. ప్రజాగళమై

ప్రజల కోసం.. ప్రజల మధ్య.. ప్రజాగళమై

• గత మూడేళ్లుగా నిరంతరం ప్రజల మధ్య చంద్రబాబు
• అలుపెరుగని యాత్రలు, సభలతో ప్రజలను ఆశ్చర్యపరచిన తెదేపా అధినేత
• గత 46 రోజుల్లో 89 ప్రజాగళం భారీ సభలు
• గత నాలుగు నెలల్లో 114 నియోజకవర్గాల్లో విస్తృత పర్యటనలు
• రా కదలి రా, ఇదేం ఖర్మ రాష్ట్రానికి, బాదుడే బాదుడు లతో చైతన్యయాత్రలు
• ఉమ్మడి కూటమి నేతల సభలతో ప్రజల్లో జోష్ పెంచిన చంద్రబాబు
• శుక్రవారం 5 ప్రజాగళం సభలు
• నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం

వయసుతో నిమిత్తం లేకుండా, అనువుకాని వాతావరణాన్ని పట్టించుకోకుండా గత మూడేళ్లకు పైగా తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గత మూడేళ్లకు పైగా నిరంతరం ప్రజల కోసం, ప్రజల మధ్యే గడిపి తానే ప్రజాగళమై రాష్ట్ర ప్రజలను ఆశ్చర్యచకితులను చేశారు. 2020లో ప్రబలిన కరోనా 2021లో తగ్గు ముఖం పట్టినప్పటినుంచి చంద్రబాబు ఇంట్లో కంటే వీధుల్లోనే ఎక్కువ కాలం గడిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం విధ్వంసమౌతున్న తీరు, ప్రజల ఇక్కట్లను గమనించి చలించిపోయిన చంద్రబాబు నిత్యం ప్రజల్లోనే ఉండి వారికి బాసటగా నిలవాలని తీర్మానించుకొని, ప్రజలను చైతన్యం చేస్తూ, వారిలో ధైర్యాన్ని నింపుతూ గడిపారు.

ప్రజాగళం
ఎన్నికల ప్రకటన మార్చి 16న వెలువడగా అదే నెల 27 నుంచి ప్రజాగళం పేరుతో రాష్ట్ర వ్యాప్త పర్యటనకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. గత 46 రోజుల్లో 89 శాసనసభ నియోజకవర్గాల్లో జరిగిన భారీ సభల్లో ప్రసంగించారు. రోజుకి కనీసంగా రెండు సభలతో ప్రారంభించి శుక్రవారంనాడు 5 సభల్లో పాల్గొని రికార్డు సృష్టించారు. ఈ సభలన్నింటికి రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రజల నుండి భారీ స్పందన వచ్చింది.

2014-19 కాలంలో నాటి రాష్ట్ర పరిస్థితి, గత ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో నేటి రాష్ట్ర పరిస్థితిని సవివరంగా వివరించి.. రాష్ట్ర విధ్వంసానికి కారణాలు, పునర్నిర్మాణ మార్గాలు, త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రజలు వివేకంతో తమ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. సభికులకు పలు ప్రశ్నలు వేసి, సమాధానాలు రాబట్టుతూ, పదునైన వ్యాఖ్యలు, చలోక్తులతో ప్రజలను ఆకట్టుకున్నారు.

ప్రజాగళం సభల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లతో ఉమ్మడి సభలు, రోడ్ షోలు నిర్వహించి ఎన్నికల్లో కూటమి విజయ ఆవశ్యకతను వివరించి ఆ దిశగా ప్రజలను ప్రభావితం చేయగలిగారు. ప్రజాగళం సభలు విజయవంతమైన తీరు రాష్ట్రంలో కూటమి విజయం తథ్యమనే భావనను ప్రజల్లో కల్పించింది.

రా.. కదలి రా… అని ప్రజలకు పిలుపు
ఈ సంవత్సరం జనవరి 5 నుంచి రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో జరిగిన రోడ్ షోలు, భారీ సభల్లో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విధ్వంసక కబంద హస్తాల నుంచి రాష్ట్ర విముక్తి కొరకు ప్రజలంతా ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నెలకొన్న దుస్థితికి కారణాలను వివరిస్తూ ప్రజలు తమ భవిష్యత్తును తమ చేతుల్లోకే తీసుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఈ ఏడాది మొదటి 5 నెలల్లో రా.. కదలి రా.., ప్రజాగళం సభలు కలిపి నాలుగు నెలల్లో చంద్రబాబు 114 నియోజకవర్గాల్లో పర్యటించారు.

సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై ప్రజల్లోకి…
రాష్ట్ర సమగ్ర వికాసానికి బలమైన వ్యవసాయ రంగం ఆవశ్యకతను తొలి నాళ్ల నుంచి గుర్తించిన చంద్రబాబు గత ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో సాగునీటి ప్రాజెక్టులు విధ్వంసమైన తీరుపై తీవ్ర కలత చెందారు. ఈ విషయంలో ప్రజల్లో చైతన్యం కలిగించటానికి 2023 ఆగస్టులో ఏకధాటిగా పది రోజులపాటు రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో తన హయాంలో సాగునీటి ప్రాజెక్టుల అమలు తీరు, జగన్ రెడ్డి పాలనలో జరిగిన నిర్లక్ష్యాన్ని ఆధారాలతో సహా ప్రజెంటేషన్ల ద్వారా ప్రజలకు వివరించి సాగునీటి ప్రాజెక్టుల నిర్లక్ష్యంతో రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో ప్రజలకు వివరించారు. పలు ప్రాజెక్టుల నిర్మాణ దశలను స్వయంగా పరిశీలించారు.

సాగునీటి ప్రాజెక్టులపై ప్రజల్లో చంద్రబాబు కలిగించిన చైతన్యం, ప్రజా స్పందనలను చూసి కలవరపడిన జగన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబును గత సెప్టెంబర్ 9న అరెస్టు చేసి 52 రోజులపాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో అక్రమంగా నిర్భందించింది. దీంతో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పతనం ప్రారంభమైందని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. జైలు నుంచి విడుదల అయిన చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకోవటానికి 14 గంటలు పట్టిన వైనం, దారి పొడవునా ప్రజల స్పందన రాష్ట్ర రాజకీయాల్లో సునామీని సృష్టించింది. విడుదల అయిన వెంటనే చంద్రబాబు మళ్లీ రోడ్డు బాటన నిరంతరం ప్రజలతో మమేకమ్యారు.

ఇదేమి ఖర్మ రాష్ట్రానికి
ఈ నినాదంతో 2023లో 29 శాసనసభ నియోజకవర్గాల్లో ప్రజా చైతన్య యాత్రలు చేసి జగన్ రెడ్డి పాలనలో ప్రజాస్వామ్యంతోపాటు పలు రంగాలు, వ్యవస్థలు పతనమైన తీరును వివరించి.. బాధల్లో ఉన్న ప్రజలతో తన ఆవేదనను, ఆగ్రహాన్ని వెల్లడించారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి అన్న పేరు ప్రజల్లోకి బాగా చొచ్చుకుపోయింది. రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితుల్లో ఈ పేరు అద్దంపట్టిందని ప్రజలు, పరిశీలకులు భావించారు. ఈ పేరు, పర్యటనల విజయం ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని ఆందోళనకు గురిచేసింది.

బాదుడే బాదుడు
జగన్ రెడ్డి పాలనలో అడ్డూ, అదుపు లేకుండా పెరిగిపోతున్న నిత్యవసర వస్తువుల ధరలు, పన్నులతో సగటు మనిషి జీవితం భారమైపోవటాన్ని చూసి కలత చెందిన చంద్రబాబు.. ఈ విషయంలో ముఖ్యమంత్రి నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా ఆయన ‘బాదుడే బాదుడు’ పేరుతో 2022లో 19 శాసనసభ నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజలతో మమేకమై వారితో గడిపారు.

అడుగడుగునా అడ్డంకులు.. అధిగమించిన చంద్రబాబు
చంద్రబాబు పర్యటనలను అడ్డుకొని ఆయనను ప్రజల మధ్యకు పోకుండా చేయటానికి జగన్ రెడ్డి ప్రభుత్వం పలు విధాల ప్రయత్నించింది. పలుచోట్ల అనుమతుల నిరాకరణ, కుట్ర పూరిత నిబంధనల విధింపు, పోలీసుల సహాయ నిరాకరణ, ప్రజల బారీ స్పందన నేపథ్యంలో తగు భద్రతా ఏర్పాట్లు, నియంత్రణలో లోపం, సభలను విఫలం చేయడానికి ఆయా ప్రాంత తెదేపా నాయకుల ముందస్తు అరెస్టులు వంటి పలు కుట్రలను చంద్రబాబు అధిగమించి గత మూడేళ్లుగా ప్రజల మధ్యనే ఉన్నారు.

ఇంత సుదీర్ఘ కాలంపాటు వేలాది కిలో మీటర్లు పయనించి, వందలాది సభల్లో పాల్గొని నిత్యం ప్రజలతో మమేకమైన ముఖ్యమంత్రి మరొకరు లేరని రాజకీయ పరిశీలకులు, ప్రజల అభిప్రాయం.

Leave a Reply