కళ్యాణదుర్గం: ఈ-స్టాంప్ కుంభకోణంలో మరో సంచలన ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ స్కామ్‌లో ఇప్పుడు మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి కుమారుడు మారుతి చౌదరి పేరు ఈ కుంభకోణంతో సంబంధం ఉందని పోలీసులు గుర్తించారు.
మారుతి చౌదరి ఈ స్కామ్‌లో నిందితులతో ఫోన్‌లో మాట్లాడినట్లు నిర్ధారణ అయింది. నిందితులైన ఎర్రప్ప, మోహన్ బాబులతో మారుతి చౌదరి ఫోన్ సంభాషణలు జరిగినట్లు బయటపడింది. పోలీసులు విచారణలో నిందితులు ఈ విషయాన్ని ఒప్పుకున్నారు.
మారుతి చౌదరి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబును ఈ స్కామ్‌లో ఇరికించే కుట్ర పన్నినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎస్‌ఆర్‌సీ ఇన్‌ఫ్రా పేరు ఉపయోగించి ఆయన కుట్రలు పన్నినట్లు తెలుస్తోంది. ఖాళీ స్టాంప్ పేపర్లు కూడా మారుతి చౌదరి తీసుకున్నట్లు సమాచారం. స్టాంప్ స్కామ్ వెలుగులోకి రాకముందే, ఆయన తెర వెనుక ఉండి సురేంద్రబాబు పై తప్పుడు ప్రచారాలు నడిపినట్లు తెలుస్తోంది.
ఇదంతా అంచనా వేసిన సురేంద్రబాబు కొద్దిరోజుల కిందటే అనుమానం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మారుతి చౌదరి తన సొంత పార్టీ ఎమ్మెల్యేపైనే కుట్ర పన్నినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. ఈ విషయాన్ని టీడీపీ అధిష్ఠానానికి ఎమ్మెల్యే సురేంద్రబాబు ఫిర్యాదు చేయనున్నారు.