ఢిల్లీ: బీదర్ – మహేశ్వరం 765 KV పవర్ గ్రిడ్ వల్ల నష్టపోతున్న తమకు న్యాయం చేయాల్సిందిగా కడ్తాల్ మండల కేంద్రానికి చెందిన రైతులు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను విజ్ఞప్తి చేశారు.
బీదర్ – మహేశ్వరం 765 KV పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న హై టెన్షన్ విద్యుత్ వలయాల కారణంగా తమ పంట పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది, దీన్ని నివారించి జరుగుతున్న అన్యాయాన్ని వెంటనే సరిదిద్దాలంటూ మంత్రిని కోరారు.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు సూచన మేరకు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ల ఆధ్వర్యాన బాధిత రైతులు పలువురు ఢిల్లీలోని శ్రమశక్తి భవన్ లో సోమవారం మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.765KV బీదర్ – మహేశ్వరం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ విద్యుత్ లైన్ ఏర్పాటు వల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నదని రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి,పిప్పల వెంకటేష్,కడారి రామకృష్ణ,గూడూరు పెంటారెడ్డి, గూద పర్వతాలు, జెల్ల శివరామకృష్ణ, క్యామ సత్యం తదితరులు మంత్రి ఖట్టర్ కు వివరించారు.
ఈ గ్రిడ్ ఏర్పాటు కారణంగా రైతులకు కష్టం కలగకుండా, నష్టం జరుగకుండా చూడాలని, వారికి న్యాయం చేయాల్సిందిగా ఎంపీ రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ లు కేంద్ర మంత్రి ఖట్టర్ ను కోరారు. రవిచంద్ర, జైపాల్ యాదవ్, రైతులు తన దృష్టికి తెచ్చిన విషయాలను సావధానంగా విన్న మంత్రి సానుకూలంగా స్పందిస్తూ, ఉన్నతాధికారులతో సమీక్షిస్తానని బదులిచ్చారు.ఈ సందర్భంగా వారు మంత్రి ఖట్టర్ ను శాలువాతో సత్కరించారు.