– విద్యా సంస్థలకు ఉచితంగా ఇచ్చే విద్యుత్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది
– విద్యతో పాటు గురువులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
– గత పది సంవత్సరాల్లో ఇబ్బందులు పడ్డ ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు నిర్వహించింది మా ప్రభుత్వమే
– 11 062 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ వేసి పరీక్షలు నిర్వహించాం, మరో 6వేల పోస్టులకు నోటిఫికేషన్ వేస్తాం
– స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని చెప్పడానికి సంతోషిస్తున్నాను
– యూనివర్సిటీల మౌలిక వసతులకై రూ. 300 కోట్లు కేటాయించాం
– ప్రభుత్వ బడుల మౌలిక వసతుల కల్పనకు రూ. 667 కోట్లు వెచ్చించాం
– శానిటేషన్ వర్క్స్ ఏర్పాటుకు 136 కోట్ల రూపాయలు విడుదల
– ప్రగతిశీల తెలంగాణ రాష్ట్రం నిర్మాణం కావడానికి ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని కోరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
– రవీంద్ర భారతిలో జరిగిన గురుపూజోత్సవ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్: ప్రభుత్వ విద్యా సంస్థలకు ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం ఉచితంగా విద్యుత్తును అందించనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 27, 862 ప్రభుత్వ విద్యాలయాలకు లబ్ధి జరుగుతుందని చెప్పారు. విద్యా సంస్థలకు ఉచితంగా అందించే విద్యుత్ సరఫరాకు సంబంధించిన బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తదని వెల్లడించారు.
గురువారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన గురుపూజోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురువులను, ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు. విద్య తో పాటు గురువులకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని తెలిపారు. గత పది సంవత్సరాల పాలనలో ఉపాధ్యాయులు పదోన్నతికి, బదిలీలు లేక ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు.
ఉపాధ్యాయుల ఆకాంక్షలను అర్థం చేసుకున్న ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం 45 వేల మంది ఉపాధ్యాయులకు పారదర్శకంగా బదిలీలు చేయడంతో పాటు 30 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించిందని అన్నారు. గురువులు, ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలు ఏదీ ఉన్న ఈ ప్రభుత్వం పరిష్కరించడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. సమాజం అభివృద్ధి చెందాలన్నా నాగరికత తో ముందుకు వెళ్లాలంటే విద్య అవసరమని ఆ విద్యను అందించే గురువుల ఆలోచనలను ఈ ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని విధానపరమైన నిర్ణయాలు రూపొందిస్తుందని వెల్లడించారు.
ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ నిర్మాణం కావడానికి గురువుల పాత్ర కీలకంగా ఉపయోగపడాలని అభిలాషించారు. విద్యా బుద్ధులతో పాటు మంచి అలవాట్లు, సంస్కారం నేర్పించిన మానవ వనరులు సమాజంలో ఉన్న అనేక రుగ్మతలను ఎదుర్కొని ఈ సమాజానికి ఉపయోగపడతాయని, ఆ దిశగా విద్యాబోధన చేయాలని గురువులకు విజ్ఞప్తి చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2007 సంవత్సరంలో ప్రభుత్వ బడులలో తెలుగు మీడియం తో పాటు ఆంగ్ల మీడియం విద్యా బోధన చేయాలని ఆనాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రోత్సహించి ఉపాధ్యాయులు అమలు చేయడం వల్లే నేడు ప్రపంచంతో పోటీ పడే విధంగా మన విద్యార్థులు రాణిస్తున్నారనీ అన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం ప్రపంచంతో పోటీపడే విధంగా మానవ వనరులను తయారు చేయడానికి తీసుకునే విధానపరమైన నిర్ణయాలను అమలు చేయడానికి ఉపాధ్యాయులు సహకరించాలన్నారు.
అభ్యుదయ భావాలతో గురువులు ఉండటం వల్ల ఆ స్ఫూర్తితో ఈ రాష్ట్రం ప్రగతిశీలంగా అభివృద్ధి చెందుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చాలామంది గురువులు గొప్ప వాళ్లు ఉండటం, ప్రోగ్రెసివ్ ఆలోచనలు కలిగి ఉన్నందుకు గర్విస్తున్నానని చెప్పారు.
విద్యకు పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం విద్యకు బడ్జెట్లో పెద్దపీట వేసిందని చెప్పారు. గత దశాబ్ద కాలంగా ఈ రాష్ట్రంలో డీఎస్సీ నిర్వహించలేదని, దీనివల్ల ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని అధికారంలోకి రాగానే 11, 062 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ వేసి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించామన్నారు. రాబోయే రోజుల్లో మరో 6వేల పైబడి పోస్టులకు నోటిఫికేషన్ వేయడానికి భవిష్యత్తు ప్రణాళికను తయారు చేసుకొని ప్రజా ప్రభుత్వం ముందుకు పోతున్నదని చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలలో వసతుల కల్పనకు అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు వేసి వాటి నిర్వహణను స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు అప్పగించి ఉందన్నారు. ఆదర్శ పాఠశాల కోసం ప్రభుత్వం 667 కోట్ల రూపాయలను వెచ్చించిందని వెల్లడించారు. ప్రభుత్వ బడులలో స్వీపర్లు లేకపోవడం వల్ల గురువులే పాఠశాలలను క్లీన్ చేసుకోవాల్సిన దుస్థితి గత పాలనలో నెలకొందన్నారు.
ఆ పరిస్థితి పోవాలని ఈ ఆర్థిక సంవత్సరం శానిటేషన్ వర్క్స్ ఏర్పాటుకు 136 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగిందని చెప్పారు. ఇప్పటివరకు పరిశ్రమలకు పనికొచ్చే సెలబస్ అందుబాటులో లేకపోవడం వల్ల పరిశ్రమలు అభివృద్ధి కూడా వెనకడుగు పడిందన్నారు. పరిశ్రమలకు కావలసిన మానవ వనరులను అభివృద్ధి చేయాలని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిందని చెప్పడానికి సంతోషిస్తున్నానని తెలిపారు.
రాష్ట్రంలో 63 ఐటిఐ కళాశాలలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ గా ఏర్పాటు చేసి పరిశ్రమలలో పనిచేయడానికి ఉపయోగపడే విధంగ అధునాతనాతన సాంకేతిక విద్యా బోధన అందిస్తున్నట్లు చెప్పారు.గత పది సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలను గత ప్రభుత్వం గాలికి వదిలేసిందనీ విమర్శించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి సమావేశమై యూనివర్సిటీలో మౌలిక వసతుల కల్పన కోసం ఈ ఆర్థిక సంవత్సరం 300 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు.
తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసిన ఉస్మానియా యూనివర్సిటీ మౌలిక వసతులపై 100 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ నిర్మాణం కావడానికి గురువుల పాత్ర కీలకంగా ఉపయోగపడాలని కోరారు.