Suryaa.co.in

Andhra Pradesh

గంటా సుబ్బారావు అరెస్టు రాష్ట్ర చరిత్రలో ఒక బ్లాక్ డేగా నిలిచిపోతుంది

-“లివింగ్ అబ్డుల్ కలాం” గా పేరుగాంచిన గంటా వ్యక్తిత్వం నేరమయ పాలకులకు ఎలా తెలుస్తుంది?
-నాడు చంద్రబాబు యువత ఉజ్వల భవిత కోసం శ్రమిస్తే…నేడు జగన్ రెడ్డి వారిని గంజాయి బానిసలుగా మారుస్తున్నారు
-జగన్ రెడ్డి సర్కారుకు చెంచాగా మారిన సిఐడికి నిష్పాక్షిక దర్యాప్తు చేసే దమ్ముందా?
-చంద్రబాబునాయుడుపై అవినీతి బురద అంటించే కుట్రలో బాగంగానే స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ నిర్వీర్యానికి శ్రీకారం చుట్టారు
-తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజం
రాష్ట్రంలోని యువతకు మేలుజరగాలని, వారికి మంచి భవిష్యత్ అందించాలనే సదుద్దేశంతో మాజీముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు రాష్ట్రవ్యాప్తంగా స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణకేంద్రాలను నెలకొల్పి లక్షలాదిమంది విద్యార్థులకు మంచి ఉద్యోగావకాశాలు కల్పించారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ సీమెన్స్ సంస్థ సామాజిక బాధ్యతలో భాగంగా యువతకు ఉపాధి శిక్షణ కల్పించడానికి 90శాతం నిధులు వెచ్చించడానికి సిద్ధపడితే ఆ సంస్థ ప్రతినిధులపై కేసులు పెట్టి వేధించడం జగన్ రెడ్డి శాడిస్ట్ మనస్థత్వానికి నిదర్శనమని అన్నారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వం కేవలం 10శాతం వాటా నిధులతో గొప్పప్రాజెక్ట్ ను గ్రౌండ్ చేస్తే దానిని నిర్వీర్యం చేసేందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం కంకణం కట్టుకుందని దుయ్యబట్టారు.కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విలేకరుల సమావేశం వివరాలు ఆయన మాటల్లోనే…!
ఎంతో ఆదర్శవంతమైన స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ పై బురదజల్లడానికి వైసిపి ప్రభుత్వం ప్రయత్నించడం…చట్టాన్ని తుంగలో తొక్కి సీఐడీ విభాగం పాలకులకు చెంచాగా మారడం బాధాకరం. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ పై బురదజల్లే క్రమంలో నిజాయితీపరులైన మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ, గంటా సుబ్బారావులను దోషులుగా చిత్రీకరించడం క్షమార్హం కాదు. గంటా సుబ్బారావు

గారు లివింగ్ అబ్దుల్ కలాంగా పేరు సంపాధించుకున్న మహోన్నత వ్యక్తిత్వం కలవారు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే దేశ యువత భవిత కోసం, వారి అభ్యున్నతికోసం తన సర్వస్వాన్నిత్యాగం చేసిన గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాంగారి మాదిరిగా గంటాసుబ్బారావు కూడా కుటుంబ బాంధవ్యాలకు దూరంగా బ్రహ్మచారిగా ఉండి రాష్ట్ర భవితకోసం తన జీవితాన్ని ధారపోశారు. అలాంటి వ్యక్తి అరెస్ట్ తో మన రాష్ట్రమే కాకుండా యావత్ ప్రపంచం విస్మయం చెందుతోంది.
గంటాసుబ్బారావు 1981లో కాకినాడ జేఎన్ టీయూ నుంచి బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లో పట్టాపొందారు. తరువాత ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ విద్యను అభ్యసించారు. తరువాత తన పీహెచ్ డీని యూనివర్సిటీఆఫ్ మిన్నెసోటా (యూఎస్ ఏలో) పూర్తిచేశారు. ఆ కాలంలో కంప్యూటర్ సైన్స్ లో పి.హెచ్.డి పొందిన ప్రపంచంలో అతి కొద్దిమందిలో గంటా ఒకరు. 1985 నుంచి అనేక రంగాల్లో అధ్యయనం చేసి, పేరు,ప్రఖ్యాతులు పొందారు. యూనివర్శిటీ ఆఫ్ మిన్నెసోటా, యూనివర్శిటీ ఆఫ్ ప్లోరిడా, జే.ఎన్.టి.యు కాకినాడ వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాలలో అధ్యాపకులుగా పనిచేసి వేలమంది విధ్యార్ధులను తీర్చిదిద్దారు. అయన రాసిన అనేక పరిశోధనా పత్రాలు ఇంటర్నేషనల్ జర్నల్స్ లో ప్రచురితమయ్యాయి. అటువంటి మహోన్నతమైన వ్యక్తిపై ఈ ప్రభుత్వం బురదజల్లాలని చూడటం నిజంగా విచారకరం. గొప్ప విద్యావేత్త అయిన గంటా సుబ్బారావు ఈనాటీకి ఒక చిన్నగదిలో నివసిస్తూ ఉంటారు. ఆయనతో పాటు వృద్ధురాలైన ఆయనతల్లి ఉంటారు. తన జీవితంలో ఏనాడూ ఆయన రూపాయి పోగు చేసుకోవాలన్న ఆలోచన చేయలేదు.
విదేశాల్లో ఉన్నప్పుడు కోట్లరూపాయాలు సంపాదించుకునే అవకాశమున్నా ఏనాడూ ఆయన ధనార్జనపై దృష్టి పెట్టలేదు. అలాంటి ఆదర్శవంతమైన గొప్ప భావజాలం కలిగిన గంటా సుబ్బారావు ఆలోచన నుంచే 1999లో రెండోమారు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా జవహర్ నాలెడ్జ్ సెంటర్లు రూపుదిద్దుకున్నాయి. ఈ జేకేసీలలో వివిధ పరిశ్రమలలో అందుబాటులో ఉన్న ఉద్యోగాలకు సరిపడే నైపుణ్య శిక్షణను కాలేజీ విద్యార్ధులకు అందించి వారు సులువుగా ఆయా పరిశ్రమలలో ఉద్యోగాలు సంపాదించే విధంగా ప్రణాళికలు రూపొందించి అమలు పరిచారు. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీ విధ్యార్ధులు మంచి ఉద్యోగాలు పొంది లాభపడ్డారు. జేకేసీలుగా పిలువబడిన ఈ జవహర్ నాలెడ్జ్ సెంటర్ల ఏర్పాటులో సుబ్బారావు అన్నీతానై వ్యవహరించారు. తరువాత జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి కూడా సుబ్బారావు గారి సమర్థతను గుర్తించి రాజకీయాలకు అతీతంగా ఆయన సేవలను కొనసాగించారు. ఏనాడు కాలేజి ముఖం సరిగా చూడనటువంటి నేటి పాలకులకు గంటా సుబ్బారావు గారి గొప్పతనం తెలియడం కష్టం. విదేశాలలో చదువు వెలగబెట్టడానికి వెళ్లి కేవలం నెల రోజులలోనే మూటముల్లి సర్ధుకుని పారిపోయి వచ్చిన ప్రస్తుత ప్రభుత్వాధినేతకు ఆయన నైపుణ్యం, విశిష్టత ఏం తెలుస్తుంది? వాళ్లకు తెలిసిందల్లా రాజకీయ ప్రత్యర్థులపై కక్షసాధించడం, తమ అవినీతిని ప్రశ్నించినవారిపై ఉక్కుపాదం మోపడమే. లివింగ్ అబ్దుల్ కలాం లాంటి గొప్పవ్యక్తిని కటకటాల్లోకి పంపినందుకు ఈ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. సుబ్బారావు గారు అరెస్ట్ అయిన రోజు నిజంగా ఈ రాష్ట్రానికి బ్లాక్ డే .
ఈ గవర్నెన్స్ ప్లాట్ ఫామ్ కు రూపకల్పన చేసి నేడు అధునాతన సాంకేతిక పరిజ్జానంతో సాగుతున్నపరిపాలనకు ఆనాడే సుబ్బారావు బీజం వేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడున్న 40కుపైగా స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాల్లో 2లక్షల పైచిలుకు విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచడమే సుబ్బారావు చేసిన నేరమా? రాష్ట్రాభివృద్ధి యువత భవిత కోసం త్యాగం చేసిన గంటా సుబ్బారావు తప్పు చేశాడని నిందలేస్తారా? సీఐడీ విభాగం ప్రభుత్వ చెంచా విభాగంగా మారి స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణకు ఖర్చుపెట్టకుండా నిధులు దుర్వినియోగమయ్యాయని అభాండాలు వేస్తోంది. సీమెన్స్ సంస్థతో ఒప్పంద సమయంలో నిరుద్యోగ యువత శిక్షణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలకు ఎలాంటి పరికరాలు, ఉపకరణాలు, ఇతరత్రా వస్తువులు సరఫరాచేయాలో ముందే ప్రభుత్వం స్పష్టంగా అగ్రిమెంట్ లో పేర్కొనడం జరిగింది.
నట్లు, బోల్టులతో సహా దాదాపు 205 ఐటమ్స్ టూవీలర్ ఆటోమోటివ్ సెక్షన్ లో, ఫోర్ వీలర్ సెక్షన్ లో దాదాపు 279 ఐటమ్స్ స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లకు సరఫరా చేసే విధంగా ఒప్పందం చేశారు. ఈ విధంగా వివిధ విభాగాల్లో కొన్నివేల ఐటమ్స్ ఈ స్కిల్ డెవపల్ మెంట్ శిక్షణలో ఉండేలా సిమెన్స్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 40 స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాల్లో అగ్రిమెంట్ ప్రకారం అన్ని ఐటమ్స్ ఉన్నాయో లేదో అని సీఐడీ తనిఖీచేసిందా? అవేమీ పరిశీలించకుండా, ఇన్ స్పెక్షన్ రిపోర్ట్ లో రాయకుండా శిక్షణాకేంద్రాల్లో ఏమీలేవని ఎలా చెబుతుంది? 04-12-2015న సీమెన్స్ సంస్థతో స్కిల్ డెవలప్ మెంట్ లో భాగంగా నాటి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో సుబ్బారావుగారు కేవలం సాక్షి సంతకమే పెట్టారు. మిగిలినదంతా ఆనాడు స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ఎండీగా ఉన్న ప్రేమచంద్రారెడ్డి ఆధ్వర్యంలోనే జరిగింది. రూ.3200 కోట్లకు పైబడిన వ్యయంతో రూపొందిని ఈ ప్రాజెక్టుకు సంబంధించి సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సిఐటిడి) వారు ఇచ్చిన వ్యాల్యూయేషన్ రిపోర్ట్ ను కూడా సీఐడీ తప్పపడుతుందా? తాడేపల్లి ప్యాలెస్ లోఉన్నవారు ఆడమన్నట్లు ఆడుతూ సీఐడీవారు గంటాసుబ్బారావు గారిని అరెస్ట్ చేయడం ఈ ప్రభుత్వంలో నిజంగా ఈరోజు బ్లాక్ డేనే. సుబ్బారావు గారి లాంటి వారిని అడ్డంపెట్టుకొని చంద్రబాబునాయుడి కి అవినీతి మరకలు అంటించాలన్న తాపత్రయంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు.
బాబాయ్ ని చంపినవారిని ఎలా కాపాడాలి…హత్య, అవినీతి కేసులను ఎలా తప్పుదోవ పట్టించాలని ఆలోచించే జగన్ కు సుబ్బారావు లాంటి వారి గొప్పతనం ఎలా తెలుస్తుంది? ఈ పనికిమాలిన ప్రభుత్వం కేవలం రాజకీయ కక్షసాధింపుల్లో భాగంగానే గంటాసుబ్బారావు లాంటి వ్యక్తిని జైలుపాలుచేసింది. సుబ్బారావు గారిపై ప్రభుత్వం సాధిస్తున్న కక్షసాధింపు చర్యలతో భవిష్యత్తులో సేవాభావం కలిగిన మేధావులెవరైనా రాష్ట్రం వైపు కన్నెత్తి చూస్తారా? సిమెన్స్ పై దాడిచేసి సుబ్బారావు గారిని జైలుకు పంపిన ప్రభుత్వం స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ కేంద్రాలను కూడా భవిష్యత్తులో మూసి వేసినా ఆశ్చర్యపడనక్కరలేదు. యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించడం చేతగాని ఈ దద్దమ్మ ప్రభుత్వం యువకులను రౌడీలుగా, మాదకద్రవ్యాలకు బానిసలుగామార్చి తమ స్వార్థ రాజకీయాలకు వాడుకుంటోంది. ప్రభుత్వంచేస్తున్న ఇలాంటి దిక్కుమాలిన పనులతో భవిష్యత్ కోసం తపనపడే ప్రతి యువకుడు ఈ పాలకులపై తిరగబడటం ఖాయం. జవహర్ నాలెడ్జ్ సెంటర్ల ద్వారా, స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాల్లో శిక్షణ పొందిన ప్రతి ఒక్కరికీ సుబ్బారావుగారి గొప్పతనం, పనితనం ఏంటో తెలుసు.
ఈ ముఖ్యమంత్రి తలకిందులుగా తపస్సుచేసినా చంద్రబాబునాయుడిగారికి, తెలుగుదేశానికి అవినీతి మరకలు అంటించలేరు. గతంలో కూడా వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబునాయుడి ప్రభుత్వం రూ.6లక్షలకోట్ల అవినీతికి పాల్పడిందని దారుణమైన విష ప్రచారం చేసింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా ఆరురూపాయల అవినీతిని కూడా ఈ ముఖ్యమంత్రి నిరూపించలేకపోయాడు. ఈ ముఖ్యమంత్రి, ఆయన ప్రభుత్వం తలకిందులుగా తపస్సు చేసినా కడిగిన ముత్యంలాంటి చంద్రబాబునాయుడిగారికి అవినీతిమకిల అంటించలేదు. విద్యార్థులభవిష్యత్ కోసం ఈప్రభుత్వం ఆలోచిస్తే మంచిది. అది చేయకుండా గంటాసుబ్బారావు గారి లాంటి వారిని జైళ్లకుపంపి శునకానందం పొందితే అంతిమంగా నష్టపోయేది ఈ రాష్ట్ర యువత మాత్రమేనని స్పష్టం చేస్తున్నాం.
గంటాసుబ్బారావు, మాజీఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ వంటి వ్యక్తులపై కక్షసాధింపులకు పాల్పడి యువతభవితకు మేలు చేసే వ్యవస్థలను నాశనం చేయవద్దని ముఖ్యమంత్రికి హితవు పలుకుతున్నాం. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో రూపాయి అవినీతికి కూడా తావులేదు. ఆప్రాజెక్ట్ లోభాగంగా ఇప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా 40శిక్షణా కేంద్రాలు కొనసాగుతున్నాయి. వాటిని పరిశీలిస్తే లక్షలాది యువతీ,యువకుల భవిష్యత్తుకోసం సుబ్బారావు ఎంతగా శ్రమించారో ఈ గుడ్డి పాలకులకు అర్థమవుతుంది.

LEAVE A RESPONSE