Suryaa.co.in

Andhra Pradesh

చేనేత మగ్గాలు ఆధునీకరిస్తాం

– మంగళగిరి చేనేత పూర్వ వైభవానికి కృషిచేస్తా
-మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తాం
-రెట్టించిన ఉత్సాహంతో అభివృద్ధి చేస్తా
-దక్షిణాదిలోనే అతిపెద్ద గోల్డ్‌ సెజ్‌కు చర్యలు
-ఎన్నికల ప్రచారంలో యువనేత లోకేష్‌

మంగళగిరి: మంగళగిరిలో చేనేత మగ్గాలను అప్‌గ్రేడ్‌ చేసి ప్రస్తుతం వెయ్యిలోపు ఉన్న మగ్గాలను 5 వేలకు పెంచుతామని, మంగళగిరి చేనేతకు పూర్వ వైభవం తెస్తామని యువనేత నారా లోకేష్‌ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి కొండపనేని టౌన్‌ షిప్‌ వాసులతో మంగళవారం సమావేశమయ్యారు. తొలుత మంగళగిరికి చెందిన చేనేత ప్రముఖు డు జంజనం శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులను మర్యాదపూర్వకంగా కలుసు కున్నారు.

టౌన్‌ షిప్‌ వాసులతో లోకేష్‌ మాట్లాడుతూ చీరాల, ధర్మవరంలలో చేనేతలు తమ మగ్గాలను అప్‌ గ్రేడ్‌ చేసుకుని తమ ప్రాభవాన్ని నిలబెట్టుకున్నారు. మంగళగిరిలో మాత్రం గతంలో 20 వేలు ఉన్న మగ్గాలు ఇప్పుడు వెయ్యిలోపు తగ్గిపోయాయి. యువతరం ఈ వృత్తిలోకి రాకపోవడమే గాక పవర్‌ లూమ్స్‌ నుంచి చేనేతకు గట్టిపోటీ ఉంది. చేనేత మగ్గాలు అప్‌గ్రేడ్‌ చేసి మార్కెటింగ్‌ సౌకర్యం మెరుగుపర్చడానికి తాము ప్రయోగాత్మకంగా వీవర్స్‌ శాలను ఏర్పాటుచేశాం. ఈ మోడల్‌ను అమలుచేయడం ద్వారా చేనేతలను ప్రోత్సహించి 5 వేల మగ్గాలకు చేర్చి వారి ఆర్థిక స్థితిగతులను మార్చాలన్నదే నా లక్ష్యమని పేర్కొన్నారు.

పన్నుల భారం తప్ప వసతులు లేవు
ప్రజలపై పన్నుల భారం మోపడానికే మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్‌ ఏర్పాటుచేశారు తప్ప.. మౌలిక వసతుల కల్పనలో పంచాయతీ కంటే ఇక్కడి పరిస్థితులు దారుణంగా ఉన్నాయ ని నారా లోకేష్‌ పేర్కొన్నారు. తాను శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాక యూనిట్‌ బేస్డ్‌ అభివృద్ధికి చర్యలు చేపడతామని వివరించారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, ఆరోగ్యకేంద్రాలు, పార్కులు ఏర్పాటుచేస్తాం. తర్వాత జోనల్‌ వారీగా పెద్దపెద్ద పార్కులు ఏర్పాటుచేస్తాం.

20 ఏళ్లకు సరిపడా దామాషా ప్రకారం భూగర్భ డ్రైనేజీ నిర్మాణంతో పాటు ఈటీటీ ప్లాంట్ల ద్వారా శుద్ధి చేసి చేసి వదులుతాం. కృష్ణానది నుంచి పైపు లైన్‌ ఏర్పాటు చేసి కొళాయిల ద్వారా అపార్ట్‌ మెంట్‌ వాసులతో సహా ప్రతి ఇంటికీ పైపులైన్‌ ద్వారా తాగునీరు అందిస్తాం. మంగళగిరిలో స్వర్ణకార వృత్తిపై అనేకమంది ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. దక్షిణాదిలోనే అతిపెద్ద గోల్డ్‌ సెజ్‌ ఏర్పాటు చేసి మంగళగిరిని గోల్డ్‌ హబ్‌గా రూపొందిస్తాం. డిజైన్‌, ప్రొడక్షన్‌, టెస్టింగ్‌ వంటి సౌకర్యాలతో పాటు ల్యాబ్‌ డైమండ్స్‌ తయారీని ప్రోత్సహిస్తాం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తాం. క్రిటికల్‌ ఇన్‌ ఫ్రా, సోషల్‌ ఇన్‌ ఫ్రాలను అభివృద్ధి చేస్తాం. నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్ల నిర్మాణం చేపట్టి తాడిపత్రి మోడల్‌లో పారిశుద్ధ్యానికి చర్యలు తీసుకుంటాం. రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి మంగళగిరిని ఆదర్శంగా అభివృద్ధి చేస్తానని లోకేష్‌ చెప్పారు.

లోకేష్‌ దృష్టికి టౌన్‌ షిప్‌ వాసుల సమస్యలు
ఈ సందర్భంగా కొండపనేని టౌన్‌ షిప్‌ వాసులు పలు సమస్యలను యువనేత లోకేష్‌ దృష్టికి తెచ్చారు. మంగళగిరిలో చేనేతలకు మార్కెటింగ్‌ సౌకర్యాలతో పాటు రాయితీపై ముడిసరుకు ను అందజేయాలని కోరారు. దళితులకు గత ప్రభుత్వం అమలు చేసిన ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలు, సంక్షేమ కార్యక్రమాలను పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని కోరారు. పేద, మధ్య తరగతి విదేశీ విద్యాభ్యాసానికి బ్యాంకులు 11 శాతం వడ్డీ వసూలు చేస్తున్నాయి. ఇది మోయలేని భారంగా ఉంది.

గతంలో మాదిరిగా విదేశీ విద్య పథకాన్ని అమలుచేయాలి. ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల్లో ఫ్రీ సెట్లు పెంచి పేద విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులోకి తేవాలని, ప్రభుత్వాసుపత్రులను అభివృద్ధి చేయాలని కోరారు. దీనిక లోకేష్‌ స్పందిస్తూ మంగళగిరిలో చేనేతల ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపడతాం. ఎస్సీలకు గత ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరిస్తాం. అంబేద్కర్‌ విదేశీ విద్యను పునరుద్ధరించి పేద, మధ్యతరగతి విద్యార్థులకు బాసటగా నిలుస్తాం. ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల్లో మెరిట్‌ కోటా పెంపుదలకు చర్యలు తీసుకుంటామని వివరించారు. మంగళగిరి ప్రజలు తనను ఆశీర్విదించి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే రాబోయే ప్రజా ప్రభుత్వంతో పోరాడి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానని లోకేష్‌ పేర్కొన్నారు.

LEAVE A RESPONSE