– ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనమే రహస్య జీవోలు
– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ
జగన్ రెడ్డి తీసుకుంటున్న తుగ్లక్ చర్యలకు ప్రజా వ్యతిరేకత పెరిగిపోవడంతో జీవోలను రహస్యంగా అప్రజాస్వామికంగా ఉంచుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా జీవోలను రహస్యంగా ఉంచడంతో హైకోర్టు ముట్టికాయలు వేసింది. ఏపీ ప్రభుత్వం పారదర్శకతకు పూర్తిగా పాతరేస్తూ జీవోలను వెబ్ సైట్ లో పెట్టకుండా ప్రజలకు సమాచారం అందించకుండా సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు.
ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలన్నీ ఆర్డర్స్ జీవోల రూపంలో https://goir.ap.gov.in/ పోర్టల్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు. ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 4(1)(సి) ప్రకారం ప్రభుత్వం ప్రతి సమాచారాన్నీ ప్రజలకు అందుబాటులో ఉంచాలి. 2005 నుండి సమాచార హక్కుచట్టం అమలులోకి వచ్చింది. 2007 నుండి నాటి ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వులు కూడా ప్రజలకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించి జీవోఐఆర్ అనే ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించారు. ప్రతి జీవో దాచిపెట్టకూడదని కేంద్ర విజిలెన్స్ కమిషన్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకూ మార్గదర్శకాలు కూడా జారీ చేసినా జగన్ రెడ్డికి చీమ కుట్టినట్లుగా కూడా లేదు.
అధికారం చేతిలో ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్లుగా చేసుకుంటాం అడిగే వారే లేరన్నట్లుగా రాజ్యాంగం, ప్రజాస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా పాలన చేస్తున్నారు. తమ తప్పులు, వింత ఆదేశాలు బయటపడుతుండటంతో జీవోలను ప్రజల ముందు ఉంచకూడదని నిర్ణయించుకున్నారు. ఆగస్టు 17, 2021 నుంచి జీవోఐఆర్‌లో జీవోలను అప్‌లోడ్ చేయడం ప్రభుత్వం మానేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 8,500 జీవోలను జారీ చేశారు. వీటిల్లో సర్కారు ఈ-గెజిట్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసినవి 620 జీవోలు మాత్రమే. కాని ప్రజాప్రయోజనాలు, ప్రభుత్వ పాలసీలు, చట్టాలు, రూల్స్ సవరణల జీవోలను ఎప్పటికప్పుడు ఏపీ గెజిట్‌లో పొందుపరుస్తున్నాం అని చెప్పి హైకోర్టు కళ్లకు గంతలు కట్టి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రభుత్వ నిర్ణయాలు ఇక బులుగు కర పత్రికల నుంచే తెలుసుకోవాలా? అవి కూడా పథకంలోని తప్పుడు నిర్ణయాలను రాయవు? నిజాలు చెప్పవు? అంటే ఇక ప్రజలకు నిజం తెలుసుకునే హక్కును కోల్పోయారా? జగన్ రెడ్డికి భజన బృంధాల ద్వారానే సమాచారం భయటకు వస్తుంది. ఏ పథకం ఎలా అమలు అవుతుంది, ఇసుకను ఎలా, ఎంత ధరకు అమ్ముతుంది, మద్యాన్ని ఏ విధంగా అమలు చేస్తుంది, ఏ పనులు ఎవరికి, ఎలా అప్పగించారు. ఇలాంటివి మచ్చుకు మాత్రమే.. ఇంకా ఎన్నో సమస్యలు ప్రజల దృష్టికి రావాల్సింది ఉంది.
ఈ జీవోల విషయంలో 13 ఆగస్టు 2021న తెలుగుదేశం పార్టీ గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. చట్టం ప్రకారం ప్రజలకు తెలియాల్సిన సమాచారాన్ని రహస్యంగా చేసుకుంటున్న జగన్ రెడ్డి తుగ్లక్ చర్యలకు వ్యతిరేకంగా ప్రజల తరుపున తెలుగుదేశం పార్టీ పోరాడుతూనే ఉంది.