Suryaa.co.in

Telangana

రైతు సదస్సుపై సర్కారు దృష్టి

– బహిరంగసభలా కాదు.. అవగాహనసదస్సులా నిర్వహిద్దాం
– వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి సమీక్ష

హైదరాబాద్: ప్రజా ప్రభుత్వ విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 30న మహబూబ్ నగర్ లో జరుగనున్న రైతు సదస్సు పైన ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ముఖ్యమంత్రితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని రైతులందరూ మహబూబ్నగర్లో ఏర్పాటు చేసే సదస్సులో పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సభను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

మహబూబ్ నగర్ రైతుల సభను బహిరంగ సభలా కాకుండా.. రైతులకు అవగాహన కల్పించే సదస్సుగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వ్యవసాయంలో వచ్చిన అధునాతన సాగు పద్ధతులు, మెళకువలను రైతులకు తెలియజేసేలా వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, పశుసంవర్థక శాఖల అధ్వర్యంలో స్టాళ్లను ఏర్పాట్లు చేయాలని సూచించారు.

యూనివర్సిటీ అభివృద్ధి చేసిన కొత్త వంగడాలు, ఆయిల్ ఫామ్ కంపెనీల నూతన ఆవిష్కరణలు, రైతులకు ఉపయోగపడేందుకు అందుబాటులోకి వచ్చిన వివిధ కంపెనీ వినూత్న ఉత్పాదనలన్నీ ఇక్కడ స్టాళ్లల్లో ఉంచాలని సీఎం సూచించారు. అధునాతన పరికరాలు, ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు, డ్రోన్లు.. అన్నింటినీ అక్కడ ప్రయోగాత్మక ప్రదర్శనకు సిద్ధంగా ఉంచాలని చెప్పారు.

రైతులందరూ 30న జరిగే సభకు అప్పటికప్పుడు వచ్చి వెళ్లే విధంగా కాకుండా, రైతులకు అవగాహన కల్పించేలా మూడు రోజుల పాటు మహబూబ్నగర్ రైతు సదస్సు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. 28వ తేదీ నుంచే ఈ స్టాళ్లను అందుబాటులో ఉంచాలని చెప్పారు.

దీంతో రాష్ట్రంలోని రైతులు దేశంలో వ్యవసాయ సాగు విధానాల్లో వస్తున్న మార్పులపై అవగాహన పెంచుకునేలా ఈ సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం 23 లక్షల మంది రైతులకు ఇప్పటికే రూ.2 లక్షల రుణమాఫీ జరిగిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

కొన్ని చోట్ల ఆధార్ నెంబర్ల తప్పులు, బ్యాంకు ఖాతాల్లో పేర్ల తప్పులు, కుటుంబాల నిర్ధారణ కారణాలతో కొందరికి రుణమాఫీ జరగ లేదని వచ్చిన ఫిర్యాదులపై అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నివేదికను అందించారు.

ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. సీఎంవో స్పెషల్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

LEAVE A RESPONSE