Suryaa.co.in

Andhra Pradesh

ముద్రగడతో జీవీఎల్ భేటీ

– కాపు రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం
– పార్లమెంటులో కూడా ప్రస్తావించామన్న జీవీఎల్
– బీజేపీలోకి రమ్మని ముద్రగడకు ఆహ్వానం?
( మార్తి సుబ్రహ్మణ్యం)

కాకినాడ: ఏపీలో బీజేపీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ కాపులపై కన్నేసిందా? గతంలో ఆ సామాజికవర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణ, ప్రస్తుతం సోము వీర్రాజుకు పార్టీ పగ్గాలు అందించిన బీజేపీ.. ఇప్పుడు అదే వర్గానికి చెందిన అగ్రనేత ముద్రగడను పార్టీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు ప్రారంభించిందా? ఆ రకంగా రాష్ట్రంలో కాపునేత ముద్రగడ పద్మనాభంను బీజేపీలో చేర్చే ప్రయత్నాలు మళ్లీ ప్రారంభమయ్యాయా? గతంలో రెండు జరిగిన చర్చలకు కొనసాగింపుగా బీజేపీ ఎంపీ జీవీఎల్ తాజాగా ముద్రగడతో భేటీ అయ్యారా? తాజాగా జరిగిన చర్చలు అలాంటి అనుమానాలే కలిగిస్తున్నాయి.

కాపునాడు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు భేటీ అయ్యారు. కాపు రిజర్వేషన్లకు బీజేపీ మద్దతునివ్వాలని ఈ సందర్భంగా ముద్రగడ, జీవీఎల్‌ను కోరారు. గత మూడు దశాబ్దాల నుంచి తమకు జరుగుతున్న అన్యాయాన్ని ముద్రగడతోపాటు, ఆయన వెంట ఉన్న కాపు జేఏసీ నేతలు జీవీఎల్‌కు వివరించగా, ఆయన వాటిని ఆసక్తితో నోట్ చేసుకున్నట్లు సమాచారం.

ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ, కాపు రిజర్వేషన్లకు బీజేపీ తొలి నుంచీ కట్టుబడి ఉందన్నారు. కాపులకు రిజర్వేషన్లు అమలుచేయాల్సిందేనని తాను ఇటీవలి పార్లమెంటు సమావేశాల్లో డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ‘మిమ్మల్ని ఇప్పటివరకూ పార్టీలు అబద్ధపు ప్రచారంలో ఉంచి, మోసం చేశాయి. రిజర్వేషన్ల అంశం ఆయా రాష్ట్రాలదే తప్ప కేంద్రానికి సంబంధం లేదు. నిజంగా కేంద్రానికి అధికారం ఉంటే మేం మా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రిజర్వేషన్లు అమలు చేసేవాళ్లం కదా? మీకు బ్రిటీషు కాలంలోనే ఇచ్చిన రిజర్వేషన్లను తొలగించడం అన్యాయం. నేను ఈ విషయాన్ని పార్లమెంటులో కూడా ప్రస్తావించా. మా పార్టీ కూడా కాపులకు మిగిలిన వారికంటే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది’ అని జీవీఎల్, ముద్రగడతో వ్యాఖ్యానించినట్లు సమాచారం.

కాగా ముద్రగడతో భేటీపై వ్యాఖ్యానిస్తూ, ‘‘ఇందులో రాజకీయాలకు సంబంధం లేదు. నేను నిన్న అన్నవరం వచ్చా. సీనియర్ నేత హరిరామజోగయ్య గారిని మర్యాదపూర్వకంగా కలిశా. ఇప్పుడు ముద్రగడను కలిశా. ఆయన కొన్ని సందేహాలు వ్యక్తం చేశా. నేను వాటిని వివరించా. బీజేపీ మొదటి నుంచీ కాపు రిజర్వేషన్ల పట్ల చిత్తశుద్ధితో ఉంది. అయితే, నిజానిజాలు-బయట జరుగుతున్న ప్రచారం- సాంకేతిక-న్యాయపరమైన అంశాలను ఈరోజు ముద్రగడను వివరించా’నని జీవీఎల్ చెప్పారు. కాపువర్గం బీజేపీ వైపు చూస్తుండటం మంచిదేనని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

అయితే.. ముద్రగడను బీజేపీలో చేరాలని జీవీఎల్ కోరినట్లు తెలుస్తోంది. ముద్రగడ పార్టీలో చేరితే సముచిత ప్రాధాన్యం ఇస్తామని, ఈ సందర్భంగా జీవీఎల్ హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. గతంలో బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, తర్వాత ఇప్పటి అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ముద్రగడతో చర్చించిన విషయం తెలిసిందే.

LEAVE A RESPONSE