సీఎం రేవంత్‌రెడ్డికి హరీష్‌రావు బహిరంగ లేఖ

-తక్షణమే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలి
-నోటీసులపై బ్యాంకులు ఒత్తిడి తెస్తున్నారు
-బ్యాంకర్లకు హామీ పత్రం రాసివ్వాలి

బ్యాంకుల నుంచి నోటీసులు, ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న రైతులకు తక్షణం రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని మాజీ మంత్రి హరీష్‌రావు బుధవారం సీఎం రేవంత్‌రెడ్డికి బహరం గ లేఖ రాశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే డిసెంబర్‌ 9 నాడే 2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తామని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో లక్ష రూపాయల రుణమాఫీ పొందిన రైతులు కూడా మళ్లీ బ్యాంకులకు వెళ్లి రూ.2 లక్షల రుణాలు తీసుకోవాలని మీరే స్వయంగా పిలుపునిచ్చారు. మీ మాటను నమ్మి రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులు బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకున్నారు.

ఇప్పుడు రుణమాఫీ జరగలేదు. బ్యాంకులు మాత్రం రైతులకు నోటీసుల మీద నోటీసులు ఇస్తున్నాయి. ఉమ్మడి వరంగల్‌, ఉమ్మడి మెదక్‌ జిల్లాలో వందలాది మంది రైతులకు బ్యాంకు నోటీసులు అందాయి. తీసుకున్న అప్పుకు వడ్డీ మీద వడ్డీ పెరిగి రైతులపై పెను ఆర్థిక భారం పడుతుంది. బ్యాంకులు రైతులను డిఫాల్టర్ల జాబితాలోకి ఎక్కిస్తున్నాయి. సిబిల్‌ రేటింగ్‌ కూడా దారుణంగా పడిపోతోంది. రైతుల పిల్లలు చదువు కోసం విద్యారుణాలతో పాటు ఇతర రుణాలు పొందలేక పోతున్నారు. రుణమాఫీపై ప్రభు త్వం నేటివరకు అటు బ్యాంకర్లకు కానీ, ఇటు రైతులకు కానీ ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. రుణాలు మేమే చెల్లిస్తామని, రైతులపై ఒత్తిడి తేవొద్దని బ్యాంకర్లను ప్రభుత్వం ఆదేశించ లేదు.

రుణమాఫీ విషయంలో మీరు తక్షణం స్పందించాలని డిమాండ్‌ చేస్తున్నాను. 2 లక్షల వరకు రుణమాఫీని ఎప్పట్లోగా చేస్తారో స్పష్టమైన తేదీ ప్రకటించాలని రైతుల పక్షాన కోరుతున్నాను. రైతుల రుణాలను ప్రభుత్వమే చెల్లిస్తుందని బ్యాంకర్లకు హామీ పత్రం రాసివ్వాలని విన్నవించుకుంటున్నాను. రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు, పంట మద్దతు ధరపై రూ.500 బోనస్‌, ఎకరానికి 15 వేల చొప్పున పెట్టుబడి సాయం, పంట పొలాలకు నీళ్లు, 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్‌ అందించాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.

Leave a Reply