కేసీఆర్ గురించి జయశంకర్ సార్ ఏమన్నాడంటే..
(ఉద్యమనేత, ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి ప్రొఫెసర్ జయశంకర్ సార్ చేసిన వ్యాఖ్యలు. కొంపెల్లి వెంకట్‌గౌడ్ రాసిన ‘వొడువని ముచ్చట’ పుస్తకం నుంచి..)
నన్ను ఇంప్రెస్ చేసింది అతనొక్కడే..!
‘కేసీఆర్ నా గురించి తెలుసుకున్న తర్వాత, విన్న తర్వాత.. మిమ్మల్ని గలుసుకోవచ్చా అంటే.. ఒకరోజు గలిసినం. ఫస్ట్ డేనె దాదాపు డే అంత గూర్చున్నం. ఆయన అడుగుడు, నేను జెప్పుడు! నేను ఇంప్రెస్ అయ్యింది ఏందంటే, ఆయన లోతుకు బోయి అడిగేది. మిగతా వాళ్లు ఎవరైన లోతుకు బోయేవాళ్లు గాదు. మనం జెప్పింది వినడంగాదు క్రిటికల్గా చర్చించేటోడు. అది నేను చాల ఇంప్రెస్ అయిన! ఎందుకంటే మనిషికి విషయ అవగాహన వుంటే గనుక ఆ క్వశ్చన్స్ వస్తయ్, లేకపోతే రావు. పోతె జూస్తుంటే ఆయన భాష.. ఆయన తెలంగాణ ప్రజల భాషలో చెప్పేటువంటి ఆ లక్షణాలు కనబడ్డయ్ నాకు. విషయ అవగాహన వుండి తెలంగాణ ప్రజల్లో తెలంగాణ ప్రజల భాషలో నుడికారంలో తీసుకపోయేటువంటి వ్యక్తిని మొదటిసారి జూసిన నేను. నా 60ఏండ్ల అనుభవంలో. నన్ను ఇంప్రెస్ జేసింది అదే.
టీఆర్‌ఎస్ ప్రెసిడెంట్‌గా దేవేందర్‌గౌడ్‌కు ఆఫర్
నా ముందే టెలిఫోన్లో.. ‘దేవేందరన్నా! నువ్వొచ్చి పార్టీ ప్రెసిడెంట్ తీసుకో, నేను జయశంకర్ సార్ మాదిరి స్వచ్ఛందంగ పనిజేస్త’ అన్నడు. సిన్సియరా, సీరియసా అది వేరు విషయం. పబ్లిక్‌గ జెప్పిండు, ‘నువ్వొచ్చి పార్టీ పదవి దీసుకో, నేను కార్యకర్తగ సార్తో పాటు పనిజేస్త’ అని. ఆ తర్వాత దేవేందర్‌గౌడ్ స్టార్టింగే నెగెటివ్‌గ స్టార్టయి టీఆర్‌ఎస్‌ను ఖతం జేయడమే ఎజెండాగ బెట్టుకున్నాడు. ఇగ ఆయనకు దూరం వెళ్లిపోయిన నేను’
నా నిజాయితీపై కేసీఆర్‌కు నమ్మకం
‘మా యిద్దరి మధ్య (జయశంకర్, కేసీఆర్) బ్యాలెన్స్ అంటే.. తక్కువ పరిచయం, తర్వాత ఇంటిమేట్ అయ్యిండు, ఇప్పుడు చాలా ఇంటిమేట్ అయ్యిండు గద నాకు! నా కన్న చిన్నవాడు. కో ఆర్డినేషన్ అంటే పరస్పర విశ్వాసం, పరస్పర రెస్పెక్ట్ డెవలప్ అయ్యింది. ఆయన కాంపిటెన్స్ మీద నాకు కంప్లీట్ విశ్వాసం వచ్చింది. పొలిటికల్ యాంబిషన్ లేని నా నిజాయితీ మీద ఆయనకు కాన్ఫిడెన్స్ వచ్చింది. నాకు పొలిటికల్ యాంబిషన్ లేదు. ఈయనకు ఇష్యూమీద పట్టున్నది. పొలిటికల్ బేసున్నది. మా గురించి వాళ్లకు ఫుల్ కాన్ఫిడెన్స్ వుంటది. రెస్పెక్ట్ వుంటది. కనుకనే మేం కచ్చితంగా కోప్పడ్డా, ప్రయివేటుగ కోప్పడ్డా బడతరు.’
ఫలించిన జయశంకర్ సార్ విశ్వాసం
‘తెలంగాణను తప్పకుండ జూస్త. నాకైతే ఏం సందేహం లేదు. తర్వాత తెలంగాణ పునర్నిర్మాణం అనేది మేజర్ ఎజెండా. ఇపుడు ఒకటి.. తెలంగాణ దేనికొరకు? ఎవని కొరకు? తెలంగాణలో ఆర్థికాభివృద్ధి మోడల్ ఎట్ల వుండాలె అన్నప్పుడు.. అగ్రికల్చర్ ఎట్ల వుండాలె, ఇరిగేషన్ ఎట్ల వుండాలె అనే ప్రణాళిక వుంది. తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక పునర్నిర్మాణ కార్యక్రమం ఎట్ల వుండాలె అంటే అగ్రికల్చర్ లెవల్లో, ఇరిగేషన్, రూరల్ డెవలప్‌మెంట్‌లో.. అట్ల అన్నీ వస్తయ్. విద్యా విధానం ఎట్లా వుండాలె, వైద్య విధానం ఎట్ల వుండాలె? అన్నీ సాధ్యమైతయ్’
(ఆయన విశ్వాసం ప్రకారం ఇప్పుడు అన్నీ సాధ్యమయ్యాయి)
కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తికి సలామ్..
‘ఇపుడు చాలా తృప్తికరమైన స్టేజికొచ్చింది. తిరుగులేని స్టేజికొచ్చినం, వెనక్కిబోదు. గతంలో వెనక్కి బోయింది గాని ఇపుడు వెనక్కి బోదు. ఎందుకంటే ఇది కేవలం పార్టీలకు, వ్యక్తులకు పరిమితమై లేదు. ఈ రోజు ప్రజల్లోకి బోయింది. మాకు(కేసీఆర్, జయశంకర్‌సార్) కోరిక అదే వున్నది. ఇది సిసలైన ప్రజా ఉద్యమం. ప్రజల ఇన్వాల్వ్‌మెంట్ లేంది మొన్న ఎలక్షన్లో ఆ రిజల్ట్ వస్తాదయ్య! మా జీవితాశయం గూడ అదే ప్రజల్లోకి బోవాలె. ప్రజల్లోకి బోయిందది, అదే తృప్తి మాకు’
జయశంకర్ సార్ 65 ఏళ్లపాటు తెలంగాణ కోసం పరితపించిపోయారు. 1969లో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడి నీరు గారినా అధైర్యపడకుండా పోరాట పటిమ ప్రదర్శించారు. తెలంగాణ కోసం ఉద్యమించిన వారిలో జయశంకర్‌సార్‌ను మించినవారెవ్వరూ లేరు. రైతుల కష్టాలు చూసి కన్నీరు పెట్టుకున్న జయశంకర్‌సార్ పేరును వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అందుకే పెట్టినం.– కేసీఆర్
భోజన సమయానికి ఎవరున్నా..!!
‘..ఆయన భోజన సమయానికి ఎవరున్నా, డ్రైవరా? లేకపోతే ఇంకా ఎవరైనా సరే కూర్చొని తినాల్సిందే. తిండి దగ్గర, డైనింగ్ టేబుల్ మీద ఆయన ఒక్కడు కూర్చొని తినే అలవాటు లేదు. ఆ సమయానికి ఎవరున్న వాళ్లు, వీళ్లు అనే వివక్ష లేదు’
కేసీఆర్ మాకొక సాధనం..
పొలిటికల్‌గా మేం పోలేం. పొలిటికల్ పరిభాష మాకు రాదు. మేం జెప్పేదాంట్లో సబ్‌స్టేన్స్ ఉంటుంది. ఆ సబ్‌స్టేన్స్‌ను పొలిటికల్ భాషగ మల్చాలి. కనుక ఒక అవుట్‌లెట్ దొరికింది. ఇంతకు ముందు చెన్నారెడ్డి, అందరికి జేసిన గాని ఈయనలో ఉన్న ప్రత్యేకత నాకెక్కడ గూడ కనబడలేదు. కనుక ఏందంటే ఒక ఇన్‌స్ట్ట్రుమెంట్ ఒక సాధనం తెలంగాణ భావజాల వ్యాప్తికి. రాజకీయ ప్రక్రియ ద్వారా తేవాలనుకున్నడు. ఆయన ఇదే అన్నడు. ‘సార్ మీరెంతో కష్టపడ్డరు, లైఫంత కష్టపడ్డారు. పొలిటికల్ ప్రాసెస్ లేంది కాదిది. పొలిటికల్ ప్రాసెస్ కావల్సిందే మరి. ఇట్స్ ఎ ఫ్యాక్ట్’ అని చెప్పిండు. ఆయనలో తెలంగాణ సమస్య గురించి అర్థం జేసుకొనేటువంటి ఆ పట్టుదల, తపన, ఆర్టిక్యులేషన్ అంటే, విశ్లేషణ నన్ను చాల ఇంప్రెస్ జేసినయ్. వీటిని ఇంకెవరిలో జూడలె నేను, అంటే ఆ స్థాయిలో. పొలిటికల్ ప్రాసెస్ అంటే పట్టించుకోలె, ఎందుకు పట్టించుకోలె అంటే పొలిటికల్ ప్రాసెస్ అనేది వేరు విషయం. ఇది లేంది అది లేదు. అది లేంది ఇది లేదు. అది నాతోగాదు కనక ఆ ప్రాసెస్‌లో రిఫైన్ జేయడానికి ఈయన నాకు ఉపయోగపడతాడనే దాంతోటి ఆయనతోటి అసోసియేట్ అయిన.
కేసీఆర్ దీక్షే ఓ ట్రిగ్గర్!
‘కేంద్రం ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేసింది. రాజీనామాలు, ఉప ఎన్నికలు అవన్నీ నడుస్తునే వచ్చినయ్. చివరికి విసిగిపోయిన తర్వాత కేసీఆర్ అప్పుడు దీక్షకు పూనుకున్నాడు. కనుక అది సరిగ్గా సమయానికి ట్రిగ్గర్ చేసినట్టయింది’
కేసీఆర్‌కు గాడ్‌ఫాదర్ కంటే ఎక్కువ!
‘కేసీఆర్ నాకు పాదాభివందనం జేస్తడు. వద్దని చాల జెప్పిన ఆయనతోటి. ఆయన నన్ను ఒక ఫాదర్ ఫిగర్‌గ ట్రీట్ జేసి.. ఆయన ఇంట్ల ఆయన బర్త్ డే రోజు మొట్టమొదలు నాకు పాదాభివందనం జేయందె బయటికి రాడు. పర్సనల్ విషయాలు ఇవన్నీ. పబ్లిసిటీ గాదు గద ఇది. ఐతే కేవలం పొలిటికల్ ఫ్లాట్‌ఫాం మీదనె మొక్కితె పొలిటికల్ అయితది’
‘ఇజ్రాయెల్‌లో ఓ ప్రొఫెసర్ తన దేశం కోసం నిరంతరం తాపత్రయ పడినట్లు నువ్వు కూడా పడుతున్నావు. ఉద్యమాలు ప్రారంభించినోళ్లే ఆ కలను సాకారం చేసుకోవటం అతి కొద్ది మందికే దక్కుతుంది. అందులో నువ్వు ఉండటం అదృష్టం’ అని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వయంగా నాతో అన్నరు.