Suryaa.co.in

Editorial

హలో.. ఇదే మన హైదరా‘బ్యాడ్’!

– గుంతలుపడ్డ నీళ్ల రోడ్డులోనే బైఠాయించిన ఓ మహిళ తెగువ
-రాజధాని బస్తీలవన్నీ ఇదే గోస
-కాంట్రాక్టర్లకు పాత బిల్లులు ఇవ్వని సర్కారు
-బిల్లులిస్తే కొత్త పనులంటూ కాంట్రాక్టర్ల మెలిక
-గ్రేటర్ ఖజనా ఖాళీ
-ఆనాటి ఆకస్మిక తనిఖీలేవీ
-హైదరా‘బాధ’లు పాలకులకు పట్టవా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

హైదరాబాద్ పేరు చెప్పగనే.. హైటెక్ సిటీ.. గచ్చిబౌలి, మియాపూర్, రింగ్‌రోడ్డులో నల్లత్రాచులా మెరిసే రోడ్లు…రాత్రివేళ లైటింగ్‌తో ధగధగ మెరిసే సెక్రటేరియేట్.. కలర్‌ఫుల్ ట్యాంక్‌బండ్.. సుందరమైన కేబుల్‌బ్రిడ్జిలు. అక్కడ సెల్ఫీల కళకళలు!

ఇదంతా నాణేనికి ఒకవైపే. మరోవైపు గుంతలు పడ్డ రోడ్లు.. మురుగుతో పరవళ్లెత్తే రోడ్లు.. ముప్పావుసగం రోడ్డును కబ్జా చేసే ఆటోలు, షాపులు.. వర్షం వస్తే వారం వరకూ గుంతల్లోనే తిష్ఠవేసే రోడ్లు. సామాన్య-మధ్య తరగతి, ఎగువ-దిగువ మధ్య తరగతి ప్రజానీకం ఈ రెండో నాణెం లోనే నివసిస్తుంటారు.

కానీ వారి పాట్లు పాలకులకు పట్టవు. పేరుకే కార్పోరేటర్లు. కానీ వారి దృష్టంతా తమ సామ్రాజ్యంలో ఎవరు అపార్టుమెంట్లు కడుతున్నారు? అందులో ఇల్లీగల్‌గా ఎన్ని ఫోర్లు వేశారు? లోకల్ మీడియా వాళ్లతో కలసి, వారితో ‘మాటాముచ్చట్లు’ ఎలా అన్నదానిపైనే. మరి జనాల ఈతిబాధలు తీర్చేదెవరు? అప్పుడెప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా, నిరంతరం ఆకస్మిక తనిఖీలు చేసేవారు. మీడియాలో ప్రజల సమస్యలు వస్తే వెంటనే స్పందించి, చర్యలకు ఆదేశాలిచ్చేవారు. కమిషనరు-కలెక్టర్లు కూడా పొద్దున్నే పేపర్లు చూసి ఆగమేఘాలపై చర్యలకు ఆదేశాలిచ్చేవారు. ఇప్పుడు మీడియాలో ఎన్ని వార్తలొచ్చినా పట్టించుకునేవారు లేరు. తనిఖీలు చేసేవారు లేరు. చర్యలకు ఆదేశించేవారు అసలే లేరు. ఎవరి దారి వారిది.

అందుకే జనమే గళం విప్పుతున్నారు. వివిధ రూపాల్లో వినూత్న నిరసనల ద్వారా సమస్యల పరిష్కారం కోసం సర్కారును నిలదీస్తున్నారు. పాలకుల వైఫల్యం-అధికారుల నిర్లక్ష్యాన్ని జమిలిగా చూపుడువేలుతో ప్రశ్నిస్తున్నారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న దృశ్యం అచ్చంగా అలాంటిదే. నాగోల్ లోని ఆనంద్‌నగర్ కాలనీలో ఓ రోడ్డు శిధిలావస్థకు చేరింది. ప్రయాణాలకు ఇబ్బందిగా మారింది. చాలామంది గాయపడ్డారు. ఎవరికి చెప్పినా పట్టించుకోలేదు. దానితో ఓ మహిళ తెగించి, వినూత్న నిరసనకు దిగింది. ఆ గుంతలు పడ్డ రోడ్డులో నిలువ ఉన్న నీళ్లలోనే కూర్చుని తన నిరసన ప్రకటించింది. అన్ని వ్యవస్థలో సుఖనిద్ర పోతుంటే, వారిని తన మౌనదీక్ష అనే ఆయుధంతో చెంపదెబ్బ కొట్టిన ఆ మహిళ ధైర్యాన్ని మెచ్చుకోవలసిందే.

మరి దీనికి ఎవరు బాధ్యులు? స్పందించేదెవరు? కాంట్రాక్టర్లకు బకాయిలివ్వకపోవడంతో, వారు ఈమధ్య సమ్మెకట్టారు. పాత బిల్లులు ఇచ్చేదాకా కొత్త పనులు చేసేదిలేదని భీష్మించారు. మరి రేవంత్‌రెడ్డి సర్కారు.. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చేదెప్పుడు? వారు కొత్త రోడ్లు వేసేదెప్పుడు? అయ్యవారొచ్చేవరకూ అమావాస్య ఆగాల్సిందేనా? బిల్లులు ఇచ్చేవరకూ హైదరా‘బాధ’ ఇలా.. తెలుగుటీవీ జీడిపాకం సీరియల్ మాదిరిగా విజయవంతంగా కొనసాగాల్సిందేనా అన్నది సిటిజనుల ప్రశ్న. ముఖ్యమంత్రి గారూ… వింటున్నారా?

LEAVE A RESPONSE