Suryaa.co.in

Andhra Pradesh

నేరం చేసినవాడు ఎవడైనా ఉపేక్షించేది లేదు

– నేరస్తుడ్ని నేరస్తుడిగానే ప్రభుత్వం చూస్తుంది
– సెక్సువల్ అఫెండర్స్ పై జియో ట్యాగింగ్ తో నిఘా
– వనజాక్షిపై దాడి నుంచి నుంచి లోకేష్ పీఏ వెకిలిచేష్టలు దాకా.. చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పరు?
– ప్రతి మహిళా దిశ యాప్ ను సద్వినియోగం చేసుకోవాలి, పోలీసు రక్షణ పొందాలి.
– గుంటూరు బాలిక వ్యభిచారం కేసులో 46మందిని అరెస్టు చేశాం
– విజయవాడ బాలిక లైంగిక వేధింపుల కేసులో టీడీపీ నాయకుడు వినోద్ జైన్ పై కఠిన చర్యలు
– హోం మంత్రి మేకతోటి సుచరిత

గుంటూరు: హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే…
విజయవాడలో టీడీపీకి చెందిన నాయకుడు వినోద్ జైన్ లైంగిక వేధింపులకు బలి అయిన 14 ఏళ్ళ చిన్నారి ఘటన చాలా బాధాకరం. సమాజంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉంది. 14 సంవత్సరాల వయసున్న బాలికను 54 సంవత్సరాల వయసున్న వ్యక్తి లైంగిక వేధింపులకు గురిచేయడం మనసును తీవ్రంగా కలచివేసింది.తన బాధను బయటకు చెప్పుకోలేక బాలిక ఎంత మనో వేదనకు గురైందో.. తాను రాసిన సూసైడ్ నోట్ ను చూస్తేనే అర్థమవుతుంది.

బాలిక తనపై జరిగిన లైంగిక వేధింపులను బయటికి చెప్పుకోలేక తనువు చాలించడం అత్యంత బాధాకరం. ఇటువంటి వారి కోసం, మహిళల భద్రత కోసమే ఈ ప్రభుత్వం దిశ యాప్ తీసుకురావడంతో పాటు ఎన్నో చర్యలు చేపట్టింది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అమ్మాయిలు వెంటనే తల్లిదండ్రులకు చెప్పాలని సూచిస్తున్నాను. తల్లిదండ్రులతో చెప్పుకోలేని సంఘటనలు ఏమైనా ఉంటే వెంటనే దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వండి. దిశ యాప్ కు సమాచారం ఇచ్చిన తక్షణమే నిందితులపై చర్యలు తీసుకోవడం జరుగుతోంది.అంతేగాని భయాందోళనకు గురై అమ్మాయిలు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని మనవి చేస్తున్నాను. సీఎం జగన్ గారు తీసుకువచ్చిన దిశ యాప్ ను ఇప్పటికే దాదాపు కోటికి పైగా డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది.

మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా దిశా పోలీస్ స్టేషన్లను, మహిళా పోలీసులను ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలపై నేరాలకు పాల్పడే దాదాపు 2 లక్షల మందికి పైగా సెక్సువల్ అఫెండర్స్ పై నిఘా పెట్టి, వారి చర్యలను గుర్తించేందుకు వారిని జియో ట్యాగింగ్ చేశాము. గతంలో ఎన్నడూ లేనివిధంగా నేరం జరిగిన వెంటనే, పారదర్శకంగా విచారణ జరిపి చార్జిషీటు వేయడం జరుగుతోంది.

లైంగిక వేధింపుల కేసుల్లో కేవలం 60 రోజుల్లోనే దర్యాప్తు పూర్తిచేసి నేరస్తులను శిక్షిస్తున్నాము. జాతీయ స్థాయిలో చూసుకుంటే…. తక్కువ సమయంలోనే ఛార్జ్ షీట్ వేసి, దర్యాప్తు పూర్తి చేస్తున్న ఘనత మన రాష్ట్రానికే దక్కుతుంది. మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించి నమోదు చేసిన కేసుల్లో దాదాపు 98 శాతం చార్జిషీట్లు వేసిన సందర్భాలు ఉన్నాయి.రాష్ట్రంలో వారు, వీరు అన్న తేడా లేకుండా, ఏ పార్టీ వారు నేరం చేసినా… వదిలిపెట్టే ప్రసక్తే లేదని సీఎం జగన్ మోహన్ రెడ్డి మొదటి నుండి చెప్తూ వస్తున్నారు. నేరానికి పాల్పడిన వాడిని నేరస్థుడిగానే చూడాలి. ఇందులో రాజకీయ లబ్దికి తావు లేదు.

గుంటూరు జిల్లా మేడికొండూరు బాలిక వ్యభిచార ఘటనలో పోలీసులు వెంటనే జీరో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి విచారణ జరిపారు. ఆ కేసును ఆరండల్ పేట పోలీసు స్టేషన్ కు బదిలీ చేసి మొత్తం 46 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో వైఎస్సార్సీపీ సానుభూతి పరుడు ఉన్నాడని టీడీపీ వాళ్ళు ఆరోపణలు చేసినప్పటికీ, అతనిని కూడా అరెస్టు చేసి జైలుకు పంపడం జరిగింది.

విజయవాడలో మైనర్ బాలిక ఆత్మహత్య ఘటనలో.. టీడీపీ నాయకుడు వినోద్ జైన్ లైంగికంగా వేధించాడని సూసైడ్ నోట్ ద్వారా వెల్లడైతే.. వెంటనే అరెస్టు చేయడం జరిగింది. నేరం చేసిన వాడు ఏ పార్టీ వారైనా వదిలిపెట్టకుండా పోలీసులు శిక్షించడం జరుగుతోంది. తప్పు చేసినవాడు ఏ పార్టీకి చెందిన వాడైనా సరే ఉపేక్షించేది లేదని గౌరవ ముఖ్యమంత్రి జగన్ అనేక సందర్భాల్లో చెప్పారు.సీఎం జగన్ పోలీసు శాఖ కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి, ఏ కేసులో అయినా పారదర్శకంగా విచారణ జరపి, నేరస్తులకు శిక్ష పడేలా చేయాలని ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారమే రాజకీయాలతో, పార్టీలతో సంబంధం లేకుండా పోలీసులు నేరస్తులను శిక్షించడం జరుగుతోంది.

మహిళల రక్షణ, భద్రత విషయంలో సీఎం జగన్ పూర్తి చిత్తశుద్ధితో పని చేస్తున్నారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగే విధంగా వారికి చేయూతనిస్తూ, మహిళా సాధికారత కోసం అహర్నిశలూ శ్రమిస్తున్న నాయకుడు జగన్ .అలాంటిది దీక్షల పేరుతో ప్రతిపక్ష టిడిపి నాయకులు సీఎం జగన్ పైన, ప్రభుత్వం పైన బురదచల్లి రాజకీయ లబ్దిపొందాలని చూడటం బాధాకరం. రాష్ట్రంలో ఎక్కడ నేరం జరిగినా నేరస్తులను మాత్రం వదిలిపెట్టిన సందర్భాలు లేవు. కొన్ని కేసుల విషయంలో నేరస్తులను పట్టుకోవడంలో కొంత జాప్యం అయినా.. ఎవర్నీ వదిలి పెట్టలేదు, వదిలి పెట్టబోము కూడా. నేరం చేసిన ప్రతి ఒక్కరిని.. చట్ట ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసి శిక్షించడం జరుగుతోంది.

మహిళలపై జరిగిన అత్యాచార ఘటనల్లో ఏడు రోజుల్లోనే చార్జిషీటు వేసి నేరస్తులను చట్టప్రకారం శిక్షించిన సందర్భాలు ఈ ప్రభుత్వంలో ఎన్నో ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగిని వనజాక్షిని ఆ పార్టీ ఎమ్మెల్యే కొట్టిన కేసులో ఏం చర్యలు తీసుకున్నారు అంటే.. దానికి ఇప్పటికీ చంద్రబాబు నుంచి సమాధానం లేదు.

టీడీపీ హయాంలోనే జరిగిన కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసుల్లో నిందితులపై ఏ విధమైన చర్యలు తీసుకున్నారు అంటే టీడీపీ నాయకుల నుండి ఇప్పటికీ సమాధానం లేదు. నాగార్జున యూనివర్సిటీ స్టూడెంట్ రిషితేశ్వరి కేసులో ఏ విధమైన న్యాయం చేశారు అంటే టీడీపీ నుండి ఇప్పటికీ సమాధానం లేదు. ఆఖరికి, తాజాగా టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళలపై నారా లోకేష్ పీఏ లైంగిక వేధింపులకు గురి చేసిన సంఘటనపై కూడా ఇప్పటి వరకు సమాధానం లేదు.

గురివింద గింజ సామెతలా టిడిపి వాళ్ళు ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి జగన్ పైన నిందలు వేసి, రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని చూడడం తగదు. రాష్ట్రంలో నేరం జరిగిన ప్రతి కేసు విషయంలోనూ నేరస్తులకి కఠిన శిక్షలు వేసిన ఘనత మా ప్రభుత్వానికే ఉంది. ఇప్పటికైనా టీడీపీ మహిళా నాయకులు, ఎక్కడైనా, ఏ మహిళకు అయినా అన్యాయం జరిగితే.. దానిని రాజకీయ లబ్దికోసం వాడుకోకుండా, మహిళలకు న్యాయం జరిగే విధంగా మీవంతు సహకారం అందిస్తే బాగుంటుంది.

విజయవాడ బాలిక ఆత్మహత్య కేసులో లైంగిక వేధింపులకు పాల్పడ్డ టీడీపీ నేత వినోద్ జైన్ పైన కఠిన చర్యలు తీసుకుంటాము. ఇప్పటికే వినోద్ జైన్ పైన ఐపీసీ సెక్షన్ 306, 354, 354A, 354D, 509, POSCO యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. మహిళలకు ఎలాంటి సమస్య వచ్చినా.. వెంటనే డయల్ 100, దిశ యాప్ ను ఆశ్రయించి రక్షణ పొందవలసిందిగా కోరుతున్నాను.

నేను కొవిడ్ కారణంగా, హోం ఐసోలేషన్ లో ఉండడం వలన బాధిత బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించ లేకపోయాను. అయినప్పటికీ పోలీసు ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు ఈ సంఘటనపై వివరాలు తెలుసుకోవడం జరిగింది. నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించడం జరిగింది. బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరఫున అన్నివిధాలుగా అండగా ఉంటామని హామీ ఇస్తున్నాను.

LEAVE A RESPONSE