Suryaa.co.in

Andhra Pradesh

జగన్‌ మానసిక పరిస్థితిపై భయంగా ఉంది

-వివేకా హత్య వెనుక మీ హస్తం లేకుంటే భయమెందుకు?
-చంద్రబాబుతో కలిసినట్లు ఆధారాలు ఉన్నాయా?
-పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి వ్యాఖ్యలు

కడప, మహానాడు: చంద్రబాబుతో చేతులు కలిపినట్లు జగన్‌ చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి స్పందించారు. జగన్‌ ఏదో ఊహల్లో ఉన్నట్లు ఉంది. జగన్‌ వైఖరి మాలోకంను తలపిస్తుంది. నా జన్మకు నేను చంద్రబాబు ను ఒక్కసారి మాత్రమే కలిశాను. కొడుకు పెళ్లికి పిలవడానికి మాత్రమే వెళ్లా. ఆనాడు వైఎస్సార్‌ కూడా పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్లాడు. ఆ స్ఫూర్తితోనే పిలవడానికి వెళ్లా. ఏనాడూ 5 నిమిషాలు కూడా ఆయనతో మాట్లాడలేదు. నేను చంద్రబాబు చెబితే నీ కోసం 3200 కి.మీ పాదయాత్ర చేశానా? బాయ్‌ బాయ్‌ బాబు అనే క్యాంపెయిన్‌ చేశానా? అని ప్రశ్నించారు.

సునీత, రేవంత్‌ కూడా చంద్రబాబు చెప్పినట్లు వింటారట. బీజేపీ పొత్తు కూడా చంద్రబాబు మేనేజ్‌ చేశాడట. చంద్రబాబు ఎంత పవర్‌ ఫుల్‌ అయ్యారో…ఆయనను ఎంత పెద్ద చేసి చూపిస్తున్నారో ఆలోచన చేయాలని హితవుపలికారు. నన్ను చంద్రబాబు కంట్రోల్‌ చేస్తున్నా డట. నేను బాబు మాట వింటున్నానట. ఎవరో కంట్రోల్‌ చేస్తే తిరిగే వ్యక్తి కాదు.. ఎవరో ఏదో చెబితే నమ్మే వ్యక్తిని కాదని తెలిపారు. జగన్‌ మానసిక పరిస్థితిపై నాకు ఆందోళనగా ఉంది. జగన్‌ గారు..మీరు అద్దం చూస్కోండి…మీకు మీ మొహం కనిపిస్తుందా? చంద్రబాబు మొహం కనిపిస్తుందా? సునీత చేస్తున్న న్యాయ పోరాటం మీకు కనిపించడం లేదా? హత్య వెనుక అవినాష్‌ రెడ్డి హస్తం, మీ హస్తం లేకుంటే మీకు భయం ఎందుకు అని ప్రశ్నించారు.

వైఎస్‌ పేరును చార్జిషీట్‌లో చేర్చింది కాంగ్రెస్‌ కాదు
వైఎస్‌ను చార్జిషీట్‌లో పేరు చేర్పించింది జగన్‌ మనిషి. పొన్నవోలుతో పిటిషన్‌ వేయించి మరి చేర్పించాడు. నిజానికి కేసు వేసింది మాజీ మంత్రి శంకర్‌రావు..కానీ ఈ కేసు చెల్లలేదు. ఎర్రంనాయుడు వేసిన పిటిీషన్‌ ను కోర్టు ఇంప్లీడ్‌ చేసింది. విచారణ చేయమని మాత్రమే అనాడు కోర్టు చెప్పింది. కానీ వైఎస్‌ఆర్‌ పేరును అప్పుడు పిటిషన్‌లో చేర్చలేదు. పొన్నవోలు సుధాకర్‌తో సుప్రీంకోర్టు వరకు వెళ్లి పేరు పెట్టించారు. ఇదే నిజం. తారు మారు చేసే ప్రయత్నం చేసినా నిజం దాగదు. ఆనాడు నేను కాంగ్రెస్‌ పెట్టించింది అనుకున్నా. సోనియాను కలిశాక అసలు విషయం తెలుసుకున్నా. నాతో మేము ఎందుకు పెడతామని చెప్పారు. ఈ మధ్య ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ను కలసినప్పుడు జగన్‌ కావాలని పెట్టించినట్లు చెప్పారు.

రిలయన్స్‌ హస్తముందని తర్వాత వాళ్లకే పదవి
వైఎస్‌ మరణం వెనుక రిలయన్స్‌ హస్తం ఉందని జగన్‌ కూడా ఆరోపణలు చేశారు. రిలయన్స్‌ ఆస్తులను ధ్వంసం చేశారు. జగన్‌ సీఎం అయ్యాక రిలయన్స్‌ చెప్పిన వాళ్లకు రాజ్యసభ ఇచ్చారు. తాను చెప్పింది అబద్ధం అని నిరూపించుకున్నారు.

LEAVE A RESPONSE