Home » బాబు కియా మోటార్స్,సెల్ కాన్,హీరో కంపెనీలను తెస్తే..జగన్ మద్యం బ్రాండ్లను తెచ్చారు

బాబు కియా మోటార్స్,సెల్ కాన్,హీరో కంపెనీలను తెస్తే..జగన్ మద్యం బ్రాండ్లను తెచ్చారు

– ఎక్సైజ్ అండ్ ప్రొహబిషన్ శాఖ అని స్పష్టంగా పలకలేని వ్యక్తికి ఎక్సైజ్ శాఖను ఇచ్చారు
– టీడీపీ అధికార ప్రతినిధి డా. సప్తగిరి ప్రసాద్
జగన్ అధికారంలోకి వచ్చాక దశలవారీగా మద్యనిషేధం అమలు చేస్తానని చెప్పి రెండున్నరేళ్లైనా చేయలేదని టీడీపీ అధికార ప్రతినిధి డా. సప్తగిరి ప్రసాద్ గుర్తు చేశారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో గురువారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు … అధికారం రాక ముందు జగన్ సంపూర్ణ మద్య నిషేధానికి కట్టుబడి ఉన్నామని చెప్పి మాట మార్చారు. ఎందుకు మాట మార్చారని నిగ్గదీసి అడుగుతున్నాం. ఒకపక్క మద్యనిషేధం చేయకపోగా ఆంధ్రప్రదేశ్ లో కాలకూట విషంలాంటి చీప్ లిక్కర్ ప్రవాహమై ప్రవహిస్తోంది. మీ పేటియం బ్యాచ్ మీ వైసీపీ మూకలే ఇందుకు కారణం.
తమ సొంత బ్రాండ్ లతో ఆడపడచుల తాళిబొట్లకు ఎసరు పెట్టారు. పల్లెల్లో చీప్ లిక్కర్ తాగి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నా పేదల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. దీనిపై మహిళా ఎమ్మెల్యేలు స్పందించాలి. సంపూర్ణ మద్య నిషేదం ఎప్పుడు విధిస్తారో వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు జగన్ ను ప్రశ్నించాలి. చిత్తూరు జిల్లాకు చెందిన ఎక్సైజ్ మంత్రి నారాయణస్వామికి తన శాఖపై ఏమాత్రం అవగాహన లేదు. ఎక్సైజ్ అండ్ ప్రొహబిషన్ శాఖ అని స్పష్టంగా పలకలేని వ్యక్తికి ఎక్సైజ్ శాఖను ఇచ్చారు. ఆయన సొంత నియోజకవర్గంలోనే నాటుసారా, కల్తీసారా, చీప్ లిక్కర్ వరదలా ప్రవహిస్తోంది.
చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమలోని పంట పొలాల్లో పట్టిసీమ ద్వారా కృష్ణా జలాలను పారించారు. నేడు జగన్ గ్రామాల్లో కల్తీ సారా, చీప్ లిక్కర్ ఏరులై ప్రవహిస్తోంది. చంద్రబాబు కియా మోటార్స్, డిక్సన్, సెల్ కాన్, హీరో కంపెనీలను తీసుకొచ్చారు. జగన్ ఎక్కడా లేని మద్యంబ్రాండ్లను తెచ్చారు. స్పెషల్ స్టేటస్, రైల్వే జోన్ ఏమయ్యారో ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాం. మద్యం తాగడంవల్ల వచ్చే నష్టాలపై మద్య విమోచనా పోరాట కమిటిచే అవగాహనా సదస్సులు పెడుతున్నామనడం కోడిగుడ్డుపై ఈకలు పీకినట్లే. జగన్ తప్పుడు ప్రకటనలు చేసి ఫేక్ ముఖ్యమంత్రి అనిపించుకున్నారు. భూదందాకు పాల్పడుతున్నారు. అటవీ భూములను కాజేస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నారు. కాణిపాకంలో ప్రమాణం చేయడానికి పిలిస్తే తోక ముడిచావు.
చిత్తురు జిల్లా చీప్ లిక్కర్ హబ్ గా తయారైంది. ఎక్కడా సంపద సృష్టించిన దాఖలాలు లేవు. చంద్రబాబు హయాంలో స్వర్ణాంధ్రప్రదేశ్, హరితాంధ్రప్రదేశ్ గా పేరుగాంచితే ఇప్పుడు మత్తాంధ్రప్రదేశ్, మద్యాంధ్రప్రదేశ్ గా తయారైంది. మద్యం విక్రయాలు రాను రాను పెరుగుతుంటే ఏం చేస్తున్నారు? రైతులు రాత్రనక, పగలనక ఎండనక, వాననక ఆరుగాలం కష్టపడి పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదుగానీ, చీప్ లిక్కర్, మద్యం, గంజాయి, హెరాయిన్ కి గిట్టుబాటు ధర వచ్చింది. లీటర్ పాలకి నాలుగు రూపాయలు బోనస్ కలిపి ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. రూ.50 ఉన్న చీప్ లిక్కర్ ని 260 రూపాయలు చేశారు. రాష్ట్రంలో మనీ రీసైక్లింగ్ వ్యాపారం జరుగుతోంది. వివిధ బ్యాంకుల నుండి అప్పు చేసి ప్రజల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు.
ప్రజల ఖాతాల్లో వేసిన డబ్బుల్ని మద్యం రూపంలో రూ. 25 వేల కోట్లు మళ్ళీ రీ సైక్లింగ్ లా వసూలు చేస్తున్నాడు. కనీసం 30 రూపాయలు కూడా విలువ చేయని చీప్ లిక్కర్ క్వార్టర్ ని 50 రూపాయలకు విక్రయిస్తుంటే ఈ రోజు 250 రూపాయలకు విక్రయించే పరిస్థితికి తీసుకొచ్చారు. గుజరాత్, బీహార్ లలో మద్య నిషేదాన్ని సంపూర్ణంగా అమలు చేస్తున్నారు. ఈ ముఖ్యమంత్రి ఎందుకు అమలు చేయలేకపోతున్నాడో చెప్పాలి. పరిపాలన చేతకావడంలేదు. కరోనా కష్టకాలంలో కూడా మద్యాన్ని నిషేధించలేదు. కూర్చొన్నోళ్లు లేచి దండం పెట్టే ఉపాధ్యాయుల్ని మద్యం షాపుల వద్ద క్యూ లైన్లను కంట్రోల్ చేయడానికి పెట్టి మద్యం అమ్మించిన ఘనత జగన్ కే దక్కుతుంది.
ప్రజలకిచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. ఎక్స్సైజ్ శాఖ మంత్రి తిరుమల కొండపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. ప్రజలే జగన్ ను తరిమి కొట్టే రోజులు వస్తాయని ఎక్సైజ్ శాఖ మంత్రే ఒకప్పుడు స్వయంగా చెప్పారు. తక్షణం మద్యపాన నిషేధంపై మీ పార్టీ ప్రకటన చేయాలి. చీప్ లిక్కర్ తాగి చనిపోయిన ఒక్కొక్క కుటుంబానికి రూ. 25 లక్షలు ఆర్థిక సాయం చేయాలి.. లేకుంటే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యాన రాష్ట్రంలోని మహిళలే బుద్ది చెబుతారు. ఇండ్లల్లో దాచి ఉంచిన పాత వస్తువులతోనే కొడతారు. నెక్ట్స్ వైసీపీ నాయకులు ఓట్ల కొసం గ్రామాల్లోకి వస్తే మహిళలు ఇళ్లల్లో దాచి ఉంచిన పాత వస్తువులతోనే బుద్ది చెబుతారు. ఇకనైనా జాగ్రత్తగా మసలుకోవాల్సిందిగా టీడీపీ తరపున హెచ్చరిస్తున్నామని టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్ హెచ్చరించారు.

Leave a Reply