– నేను విజ్ఞత చూపించినందుకే బయట ఉన్నారు
– నన్ను 16 రోజులు చీకటి గదిలో ఉంచారు
– బిడ్డ లగ్నపత్రిక రాసుకోకుండా అడ్డుకున్నారు
– నన్ను హింసించిన వాడికి దేవుడే శిక్షవేశాడు
– కొండపోచమ్మ నుంచి మీ ఫామ్ గౌస్ కు నీళ్లు తీసుకెళ్లింది నిజం కాదా?
– రంగనాయక సాగర్ దగ్గర హరీష్ రావుకి ఫామ్ హౌసు ఉంది నిజం కాదా?
– మీ తెలివితేటలు తెలంగా కోసం ఉపయోగించండి
– కేటీఆర్ వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్
హైదరాబాద్ : మల్లన్న సాగర్ శ్రీపాద ఎల్లంపల్లి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుల నుంచే మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్ కు నీళ్లు తీసుకొచ్చాం. మీ లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్టు గుండుసున్నా. లగ చర్ల భూసేకరణపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఏటిగడ్డ కిష్టాపూర్, వేముల ఘాట్ భూసేకరణ విషయంలో బూట్లతో తొక్కించింది మీరు.
మేం కూడా ఆనాడు అక్కడ ధర్నా చేశాం. కానీ మేం భూసేకరణకు వ్యతిరేకంగా ధర్నా చేయలేదు.పరిహారం పెంపుకోసం చేశాం. మేం కొట్లాడటం వల్లే మల్లన్న సాగర్ బాధితులకు పరిహారం పెంచారు. కొండపోచమ్మ నుంచి మీ ఫామ్ గౌస్ కు నీళ్లు తీసుకెళ్లింది నిజం కాదా? రంగనాయక సాగర్ దగ్గర హరీష్ రావుకి ఫామ్ హౌసు ఉంది నిజం కాదా? దీనిపై విచారణకు మీరు సిద్ధమా ? సిద్దమంటే చెప్పండి నిజ నిర్ధారణ కమిటీ వేద్దాం. ఫామ్ హౌస్ చుట్టూ కాలువలు తీసుకెళ్ళింది ఆధారాలు చూపాలా? ఇంకా ఎందుకు బుకాయిస్తున్నారు?
లగచర్లలో భూసేకరణలో బాధితులకు రూ.20 లక్షలు, ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తున్నాం. లగ చర్ల భూసేకరణ జరగకుండా మీరు అధికారులను చంపండి అని మీ మాజీ ఎమ్మెలే అక్కడి వాళ్లకి చెప్పింది నిజం కాదా? అధికారులను చంపాలని ప్రోత్సహించిన మీరు భూసేకరణ గురించి మాట్లాడుతున్నారా? ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో రూ.36 వేల కోట్ల నుంచి లక్షా 50 వేలకు పెంచింది మీరు. మీరు దిగిపోయే నాటికి కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్షా రెండు వేల కోట్లు బిల్లులు చెల్లించారు. మీరు ఫ్రాడ్ చేశారని కమిషన్ నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను వచ్చే సభలో పెడతాం.
బలవంతంగా భూములు గుంజుకుంది మీరు. మీరు తెలంగాణ జాతిపిత అని చెబుతున్న కెసీఆర్ ను కామారెడ్డి బండకేసి కొట్టారు. ప్రజలు తిరస్కరించినా ఇంకా ఎందుకు బుకాయిస్తున్నారు? మూసీ ప్రాజెక్టులు కట్టాలా వద్దా, మెట్రో రైలు నిర్మించాలా వద్దా, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించాలా వద్దా.. అభివృద్ధి చేయాలా వద్దా చెప్పండి? మేం అధికారంలోకి వచ్చాక దావోస్ పర్యటనలో రెండు లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చాం.
మాట్లాడితే ఇంగ్లీష్ గురించి మాట్లాడుతున్నారు. చైనా, జపాన్, జర్మనీ వాళ్లకు ఇంగ్లీష్ రాదు.. కానీ ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను శాసిస్తున్నాయి. నేను గుంటూరులో చదువుకోలేదు, ఆ తర్వాత పూణే వెళ్ళలేదు, అమెరికా వెళ్ళలేదు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న నేను ముఖ్యమంత్రిగా ఇక్కడకు వస్తే మీకు ఎందుకు అంత కడుపుమంట? వచ్చే ఐదేళ్లు కూడా ఇక్కడ మేమే ఉంటాం. మీరు అక్కడ ఉండాలనుకుంటే సలహాలు ఇవ్వండి.
నేపాల్ యువరాజు దీపేంద్ర అధికారం కోసం కుటుంబం మొత్తాన్ని ఏకే 47 తో కాల్చి చంపాడట. అలా మీరు పెద్దాయనను కూడా ఖతం చేసి కుర్చీలో కూర్చోవాలని చూడొద్దు. మీ తెలివితేటలు తెలంగా కోసం ఉపయోగించండి.
మేం నిజంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే, వాళ్లు అక్కడ కూర్చుని నోటికొచ్చినట్లు మాట్లాడేవారు కాదు. చంచలగూడ జైల్లో నో, చర్లపల్లి జైల్లోనో మమ్మల్ని పెట్టినచోటే ఉండేవారు. డ్రోన్ ఎగరేస్తే రూ. 500 ఫైన్ వేస్తారు. కానీ అధికారం అడ్డుపెట్టుకుని ఎంపీగా ఉన్న నన్ను చర్లపల్లి జైల్లో పెట్టారు.
16 రోజులు నన్ను డిటెన్షన్ సెల్లో ఒక మనిషి కూడా కనిపించకుండా, మమ్మల్ని నిర్బంధించిన ఆ కోపాన్ని బిగపట్టుకున్నాం తప్ప, కక్ష సాధింపునకు పాల్పడలేదు. లైట్లు ఆన్ లోనే పెట్టి ఒక్క రాత్రి కూడా పడుకోకుండా జైల్లో గడిపేలా చేశారు.కరుడు గట్టిన నేరస్తున్ని బంధించినట్లు ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న నన్ను బంధించారు. వాళ్ల తప్పులను దేవుడు చూస్తాడు. అంతకు అంత అనుభవిస్తారు అనుకుని ఊరుకున్నా. నా మీద కక్ష చూపిన వారిని దేవుడే ఆసుపత్రిపాలు చేశాడు.
చర్లపల్లి జైలు నుంచి నా బిడ్డ లగ్నపత్రిక రాసుకోవడానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. రాజకీయ కక్ష సాధింపులంటే మీవి కదా? అయినా నేను కక్షసాధింపు చర్యలకు పాల్పడలేదు. నిజంగానే నేను కక్ష సాధించాలనుకుంటే మీ కుటుంబమంతా చర్లపల్లి జైల్లో ఉండేవారు. కానీ ఆ పని నేను చేయలేదు.మేం విజ్ఞత ప్రదర్శించాం. ప్రజలు అధికారం ఇచ్చింది నా కక్ష తీర్చుకోవడానికి కాదని నేను విజ్ఞత ప్రదర్శించా.
సొంతపార్టీ ఆఫీసులో బూతులు తీయించి రికార్డు చేయించినా, చెంపలు వాయించే శక్తి ఉన్నా నేను సంయమనం పాటించా. ఎవరివి కక్ష సాధింపు చర్యలో తెలంగాణ సమాజం ఇదంతా గమనిస్తోంది.