– ఇది నా చాలెంజ్.. ముఖ్యమంత్రి స్వీకరిస్తారా?
– తెలంగాణ పైన గన్ను ఎక్కుపెట్టిన రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి
– తెలంగాణ జాతి పిత ముమ్మాటికి కేసీఆర్
– తెలంగాణ బూతు పిత రేవంత్ రెడ్డినే
– పరిపాలన అంటే పంచ్ డైలాగులు కాదు
– బయట మాట్లాడుతున్న రాము కరెక్టా? సభలో మాట్లాడుతున్న రెమో కరెక్టా?
– రేవంత్ ఒక్కడికే కుటుంబం ఉందా?
– ఉద్యోగుల డిఏకు పైసలు లేవు.. ఆరు గ్యారెంటీల అమలకు పైసలు లేవు
– కానీ వేల కోట్ల టెండర్లకు పైసలు ఎక్కడివి?
– ముఖ్యమంత్రి ఏమనుకున్నా మాకు ఫరక్ పడదు
– శాసన సభలో ముఖ్యమంత్రి రేవంత్ పై విరుచుకుపడిన కెటిఅర్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా కెటిఆర్, రేవంత్ రెడ్డి వాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
అసెంబ్లీలో జరిగిన చర్చల్లో కెటిఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “ముఖ్యమంత్రికి ఇంత అసహనం పనికిరాదు. ముఖ్యమంత్రికి ఇంత ఆవేశం, నిస్పృహ ఎందుకో అర్థం కావడం లేదు. ముఖ్యమంత్రిలో ఒక అపరిచితుడు దాగి ఉన్నాడు,” అని కెటిఆర్ వ్యాఖ్యానించారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఆర్థిక విధానాలపై కెటిఆర్ సూటిగా ప్రశ్నలు సంధించారు. “ఎవరు నమ్ముతలేరు.. అప్పు పుడుతలేదు.. దివాలా తీసినమని బయట చెప్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చి లక్షా 58 వేల కోట్ల అప్పు చేసినానని రొమ్ము విరుచుకొని చెప్తున్నారు. బయట మాట్లాడుతున్న రాము కరెక్టా? సభలో మాట్లాడుతున్న రెమో కరెక్టా? రేవంత్ రెడ్డి చెప్పాలి,” అని కెటిఆర్ డిమాండ్ చేశారు.
“దావోస్ లో పెట్టుబడులు వరదలా తన్నుకొని వచ్చాయని చెప్పుకున్నారు. ఐదు గ్యారంటీలు అమలు చేశాము. సంక్షేమం అద్భుతంగా ఉందని చెప్పుకున్నారు. మరి 71 వేల కోట్ల ఆదాయం తగ్గిందని ముఖ్యమంత్రి ఎందుకు చెప్పారో వివరణ ఇవ్వాలి” అని ప్రశ్నించారు.
ఉద్యోగుల డిఏకు పైసలు లేవు.. ఆరు గ్యారెంటీల అమలకు పైసలు లేవు.. తులం బంగారానికి పైసలు లేవు అని చెప్పే ముఖ్యమంత్రి… హెచ్ఎండిఏకు 20 వేల కోట్లతో టెండర్లు, ఏడు వేల కోట్లతో జిహెచ్ఎంసిలో టెండర్లు, వాటర్ వర్క్స్ లో 14 వేల కోట్ల టెండర్లు, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ లో 4400 కోట్లతో టెండర్లు, ఫ్యూచర్ సిటీలో ఆరు లైన్ల మెయిన్ రోడ్డు రెండు వైపులా రెండు సర్వీసు రోడ్ల మొత్తం 10 లైన్లకు 5000 కోట్లు. నిధులు ఎక్కడి నుంచి వచ్చినవి?” అని నిలదీశారు.
“లక్షన్నర కోట్లతో మూసి సుందరీకరణ అని చెప్తారు. వీటన్నిటికీ డబ్బులు ఉన్నాయి. కానీ ఆరు గ్యారెంటీల అమలుకు పైసలు లేవా? తులం బంగారానికి పైసలు లేవా? మహిళలకు ఇచ్చేందుకు నెలకు 2500 లేవా?” అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కొడంగల్ నియోజకవర్గంలో గాని.. నా నియోజకవర్గం సిరిసిల్లలో కానీ ఏ ఊరికైనా వెళ్లి ఎవరైనా ఒక రైతును వందకు వంద శాతం రుణమాఫీ అయిందా అని అడుగుదాం. అయిందని చెప్తే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఇది నా చాలెంజ్, ముఖ్యమంత్రి స్వీకరిస్తారా?” అని కెటిఆర్ సవాల్ విసిరారు.
డిసెంబర్ 7 న ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. రెండు లక్షల రుణమాఫీ మీద 9 తారీకు సంతకం పెడతానని ముఖ్యమంత్రి చెప్పారు. మరి చేశారా? ఆనాడు పీసీసీ ప్రెసిడెంట్ గా రైతుబంధును ఆపిందే రేవంత్ రెడ్డి. ఎలక్షన్ కమిషన్కు రేవంత్ రెడ్డి స్వయంగా లెటర్ రాశారు. 7600 కోట్లు రైతుబంధు పైసల్ని ఆపి మా మీద దుష్ప్రచారం చేశారు” అని ఆరోపించారు.
100 రోజుల్లోనే 6 గ్యారెంటీలను అమలు చేస్తామని తొడలు కొట్టి… అఫిడవిట్లు రాసి… బాండ్ పేపర్లను దేవుళ్ళ ముందట పెట్టింది ఎవరు? వంద రోజుల్లోనే తులం బంగారం ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వడం లేదు? ప్రజలు కాంగ్రెస్ నేతలని గోల్డ్ అనుకుంటే ఇప్పుడు వారు రోల్డ్ గోల్డ్ అని తెలిసిపోయింది. లంకె బిందెలు దొరికేదాకా ప్రజలు హామీల అమలు కోసం వేచి చూడాలా?” అని విమర్శించారు.
రేవంత్ ఒక్కడికే కుటుంబం ఉందా? నీతులు చెప్పేముందు తన చరిత్ర తెలుసుకోవాలి. రేవంత్ రెడ్డి లెక్కలు తప్పో, కాగ్ లెక్కలు తప్పో ముఖ్యమంత్రి చెప్పాలి. కాగ్ లెక్కల ప్రకారం నెలకు 2750 కోట్లు అసలు, మిత్తి కలిపి ప్రభుత్వం కడుతుంది. దొడ్డు వడ్లకు, ఇతర పంటలకు మద్దతు ధర, బోనస్ ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పింది. ఇచ్చారా? మద్దతు ధర ఇస్తాం అన్నారు ఒక్కదానికైనా ఇచ్చారా? బోనస్ బోగస్ కాలేదా?” అని ప్రశ్నల వర్షం కురిపించారు.
ముఖ్యమంత్రి ఇంటి మీదికి డ్రోన్ పంపిస్తే ఆయన ఊరుకుంటాడా? ఆయన భార్యా పిల్లల ఫోటోలను ఇష్టం వచ్చినట్టు తీస్తామంటే ఊరుకుంటాడా? ఇది పద్ధతేనా? మీకే భార్య పిల్లలు ఉన్నారా? వేరే వాళ్లకు భార్య పిల్లలు లేరా? వాళ్లకు కుటుంబాలు ఉండవా? లేని రంకులు అంటగట్టి… ఆనాడు ఇష్టమున్నట్టు మాట్లాడినప్పుడు… ఇష్టం ఉన్న సంబంధాలు మాట్లాడినప్పుడు, ఆ రోజు నీతులు గుర్తుకు రాలేదా? మా ఇంట్లో పిల్లల్ని తిట్టింది ఈ కాంగ్రెస్ నేతలు కాదా? మా ఇంట్లోని మైనర్ పిల్లల్ని పట్టుకొని బూతులు మాట్లాడింది ముఖ్యమంత్రి కాదా?” అని కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి ఏమనుకున్నా మాకు ఫరక్ పడదు
ముఖ్యమంత్రి ఏమనుకున్నా మాకు ఫరక్ పడదు. ఏం చేసినా ఫరక్ పడదు. పదవి, అధికారం శాశ్వతం అని ముఖ్యమంత్రి అనుకుంటున్నారు కానీ అవి ఏవీ శాశ్వతం కాదు. ముఖ్యమంత్రికి అపరిమిత అధికారాలు ఉండవు. ఆయన ఎవరిని జైలుకు పంపలేరు. కోర్టులు మాత్రమే ఆ పని చేయగలవు,” అని కేటీఆర్ స్పష్టం చేశారు. “రేవంత్ తిట్లన్నీ మాకు దీవెనలే… రేవంత్ రెడ్డికి తుపాలకుల గురించి బాగా తెల్సు. తెలంగాణ పైన గన్ను ఎక్కుపెట్టిన రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి. తెలంగాణ జాతి పిత ముమ్మాటికి కేసీఆర్ … తెలంగాణ బూతు పిత రేవంత్ రెడ్డినే,” అని కెటిఆర్ అన్నారు.
“కాంగ్రెస్ ఎన్నో ప్రాజెక్టులు కట్టిందని చెపుతున్నారు కదా.. మరి 2014 ముందు ఇంత పంట దిగుబడి ఎందుకు లేదు? కేసీఆర్ వచ్చిన తర్వాతనే ఇంత దిగుబడి ఎలా సాధ్యం అయింది? అని కెటిఆర్ విమర్శించారు.
పరిపాలన అంటే పంచ్ డైలాగులు కాదు
పరిపాలన అంటే పంచ్ డైలాగులు కాదు. పదవిలోకి వచ్చిన తర్వాత ఇంత ఫ్రస్టేషన్ రేవంత్‌కు ఎందుకో తెలియడం లేదు. కాంగ్రెస్‌కు ఓటు వేద్దామంటే భయపడే పరిస్థితి రేవంత్ వల్లే తెలంగాణలో వచ్చింది. రేవంత్ ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో, తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం చేసినా వచ్చిన ఫలితం ఏమిటో ప్రజలకు తెలుసు. రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు మాట్లాడితే అంత మంచిది. రేవంత్ మాటలు విన్నాక మరో 20 ఏళ్లు కాంగ్రెస్‌కు ఎవరూ ఓటు వేయరు” అని కెటిఆర్ వ్యాఖ్యానించారు.
రేవంత్ తిట్లన్నీ మాకు దీవెనలే, ఆశీర్వాదాలే. తుపాకుల గురించి రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. తెలంగాణపై గన్ ఎక్కుపెట్టిన రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డే. పాత కాంగ్రెస్ నేతలను ఖతం చేసి పదవి లాక్కున్న వ్యక్తి రేవంత్ రెడ్డి. విఫల పాలనకు విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. అప్పులో, అబద్ధాల్లో, క్రైం రేట్‌లో, అన్నదాతలు, నేతన్నల ఆత్మహత్యల్లో తెలంగాణ ఈజ్ రైజింగ్,” అని కేటీఆర్ ఆరోపించారు.