– పన్నుల రూపంలో తీసుకుంటూ మనకు మాత్రం తిరిగి ఏమీ ఇవ్వడం లేదు
– పదేండ్లుగా తెలంగాణకు కేంద్రం దగా
– కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడిన కెటిఆర్
– హైకోర్టు ఎన్నిసార్లు తిట్టినా హైడ్రా తీరు మారడం లేదు
శాసన సభలో ద్రవ్యవినియమ బిల్లుపై కెటిఆర్ ప్రసంగం: కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్ధాయిలో ద్వజమెత్తిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్ : శాసనసభలో ద్రవ్యవినియమ బిల్లుపై ప్రసంగించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 2014 నుంచి తెలంగాణ పట్ల అనుసరిస్తున్న వివక్ష పై విమర్శలు గుండెల్ని తాకేలా ఉన్నాయి. ఏర్పడిన దశాబ్ద కాలంలోనే అభివృద్ధిలో మెరుపు వేగంతో దూసుకుపోయిన రాష్ట్రం తెలంగాణ అని ఆయన గర్వంగా చెప్పారు. స్వల్ప కాలంలోనే ఇంత ప్రగతి సాధించడం మనందరికీ గర్వకారణం అని ఆయన అన్నారు.
అభివృద్ధి పథంలో మెరుపు వేగాన్ని సంక్షేమ పథకాల విషయంలో మానవీయ కోణాన్ని ఆవిష్కరించి కేసీఆర్, తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టారు అని కెటిఆర్ వివరించారు. పరిపాలనలో కొత్త ఒరవడిని ప్రణాళికలో రూపకల్పనలో సరికొత్త పంథాను అనుసరించడం వలన తెలంగాణ ముఖచిత్రం మారింది ప్రజల బతుకులు బాగుపడ్డాయి అని ఆయన స్పష్టం చేశారు. 2014 నుంచి 202 వరకు రాష్ట్రాల స్వయం సమృద్ధి వాటి ఆదాయాలను చూస్తే భారతదేశం మొత్తంలో 17.57%తో భారతదేశం లోనే అగ్ర భాగాన నిలబడ్డ రాష్ట్రం తెలంగాణ అని ఆర్బిఐ చెప్పింది అని ఆయన గుర్తు చేశారు.
తెలంగాణ ప్రగతినే మా ప్రథమ లక్ష్యం
అధికారంలో ఎవరున్నా తెలంగాణకు మేలు జరగాలి తెలంగాణ ప్రజలు బాగుండాలన్నదే మా పార్టీ లక్ష్యం అని కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆ బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు ఎలాంటి ప్రణాళికలు ఎలాంటి విధానపర నిర్ణయాలు తీసుకున్నారు చూసుకొని, దాని ప్రకారం రాష్ట్రానికి వచ్చే వాటా ఎంతో చూసుకొని కేంద్ర ప్రాధాన్యత క్రమాన్ని అర్థం చేసుకొని రాష్ట్రాలు బడ్జెట్ ప్రవేశపెడతాయి అని ఆయన వివరించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో మాత్రం, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయం పై ఒక్క మాట కూడా లేకపోవడం విషాదం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పదేండ్లుగా తెలంగాణకు కేంద్రం దగా
గత పదిహేళ్లుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణను ఎలా దగా చేస్తుందో చెప్పి ఉంటే బాగుండేది అని కెటిఆర్ అన్నారు. ఇండియా ఇస్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని అంబేద్కర్ రాజ్యాంగంలో ఉంది. రాష్ట్రాలు లేకుంటే కేంద్రం లేదు. అందుకే ఎన్టీఆర్ కేంద్రం మిద్య అన్నారు అని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వాలు చెప్పినట్టు వింటేనే పైసలు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం రాజ్యాంగ స్ఫూర్తి కి వ్యతిరేకం అని ఆయన ఆరోపించారు.
కేంద్రం మోసంపై కాంగ్రెస్ మౌనం
కేంద్ర వైఖరి పై మాటమాత్రమైన నిరసన తెలుపలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అని కెటిఆర్ విమర్శించారు. మొన్నటి కేంద్ర బడ్జెట్లో తెలంగాణ అన్న పదమే లేదు. ఢిల్లీ బీహార్ ఎన్నికల కోసమే ఆ బడ్జెట్ ప్రవేశపెట్టారు అన్న విమర్శలు వచ్చాయి అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎనిమిది మంది ఎంపీలు బీజేపీ 8 మంది ఎంపీలు ఉన్నా కూడా,తెలంగాణకు కేంద్ర బడ్జెట్లో గుండుసున్నానే అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొట్లాడకపోతే కేంద్రం మన మాట వినదు. మేము కలిసి వస్తాం అని కెటిఆర్ ప్రకటించారు. 2014 నుంచి 2020 వరకు కేంద్ర ప్రభుత్వంతో మేము కూడా సఖ్యతతోనే ఉన్నాము. మిషన్ భగీరథ గజ్వేల్ సెగ్మెంట్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీని ఆహ్వానించాము అని ఆయన గుర్తు చేశారు. కానీ తెలంగాణకు కేంద్రం నుంచి ఒరిగింది ఏం లేదు అని ఆయన విచారం వ్యక్తం చేశారు.
దేశానికి దారి చూపించే ఎన్నో పథకాలను తెలంగాణలో అమలు చేసినా, కేంద్రం నుంచి చిల్లిగవ్వ రాలేదు అని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొట్టింది, మన రైతుబంధును కాపీ కొట్టి పిఎం కిసాన్ పథకాన్ని ప్రవేశపెట్టారు. మిషన్ కాకతీయ పథకాన్ని కాపీ కొట్టి అమృత్ సర్వ పథకాన్ని తీసుకొచ్చారు. , మిషన్ భగీరథని కాపీ కొట్టి హర్ ఘర్ జల్ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. టీఎస్ ఐపాస్ ను కాపీ కొట్టి సింగిల్ విండోను తీసుకొచ్చారు అని ఆయన వివరించారు.
మన బాటలో నడుస్తూ మన డబ్బుల్ని పన్నుల రూపంలో తీసుకుంటూ మనకు మాత్రం తిరిగి ఏమీ ఇవ్వడం లేదు అని కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులు తెలంగాణకు వచ్చే పర్యటనల ఖర్చులు ఇచ్చిన, ఇక్కడ రెండు మూడు పథకాలకు సరిపోతాయి అని ఆయన విమర్శించారు.
తెలంగాణ ప్రగతి మనకు గర్వం
భారతదేశాన్ని సాదుతున్న టాప్ 5 రాష్ట్రాల్లో తెలంగాణ ఉండడం మనందరికీ గర్వకారణం అని కెటిఆర్ అన్నారు. తెలంగాణ జనాభా 2.8% కానీ దేశ జిడిపికి 5.1% కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అని ఆయన హైలైట్ చేశారు. గత ప్రభుత్వమని బీఆర్ఎస్ మీద ఒంటి కాలు మీద లేచే కాంగ్రెస్ నేతలు కేంద్రం మీద మాత్రం ఒక్క మాట మాట్లాడరు అని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం కేంద్రంతో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
వివిధ అంశాలపైన, హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కెటిఆర్
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు విషయంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. “కాంగ్రెస్ ఎన్నో ప్రాజెక్టులు కట్టిందని చెపుతున్నారు కదా.. మరి 2014 ముందు ఇంత పంట దిగుబడి ఎందుకు లేదు? కేసీఆర్ వచ్చిన తర్వాతనే ఇంత దిగుబడి ఎలా సాధ్యమైంది?” అని కెటిఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్ మెట్రోను రద్దు చేసిన ప్రభుత్వం, ఫార్మాసిటీని రద్దు చేసి ఫార్మా విలేజ్‌లు అని పేర్కొందని, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని లగచర్లలో ఏం జరిగిందని ఆయన నిలదీశారు.
ఫార్మా అంటే విషం, ఫార్మా అంటే పొల్యూషన్ అని కాంగ్రెస్ నేతలు చెబుతారు. అలాంటప్పుడు ఎవరైనా తమ గ్రామంలో ఫ్యాక్టరీ ఎందుకు పెట్టాలని కోరుకుంటారు? ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొట్టకపోతే వాళ్లు ఎందుకు ఒప్పుకుంటారు? ఒక రోజు ఫార్మాసిటీ అంటారు, మరో రోజు ఫ్యూచర్ సిటీ అంటారు, ఇంకో రోజు ఏఐ సిటీ అంటారు, మరో రోజు ఫోర్త్ సిటీ అంటారు. ఇన్ని యూ-టర్న్‌లు తీసుకుంటారా? కోర్టులను కూడా తప్పుదోవ పట్టిస్తారా? ఒక్క ఎకరమైనా ఫార్మా పరిశ్రమకు అక్కడ కేటాయించారా?” అని కెటిఆర్ విమర్శించారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫార్మాసిటీని రద్దు చేసి, సేకరించిన భూములను తిరిగి ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారని, కానీ ఇప్పుడు దానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. “8800 ఎకరాల్లో మేము ఫార్మాసిటీని నెలకొల్పాలనుకున్నాం. మా హయాంలోనే 400 కంపెనీలు అక్కడ ఫ్యాక్టరీలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు మమ్మల్ని బదనాం చేశారు. రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్, రియల్ ఎస్టేట్ అంటేనే రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి ఇవాళ తెలంగాణలో కుప్పకూలిన రియల్ ఎస్టేట్‌ను పట్టించుకోవడం లేదు,” అని ఆయన విమర్శలు గుప్పించారు.
వేణుగోపాల్ రెడ్డి అనే రియల్టర్ ముఖ్యమంత్రికి లేఖ రాసి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పరిస్థితి నిజంగా ఎలా ఉందో ఇక్కడున్న అందరికీ తెలుసు. పేదల మీద ప్రతాపం చూపించే హైడ్రా పెద్దలను మాత్రం కాపాడుతుంది. హైకోర్టు ఎన్నిసార్లు తిట్టినా హైడ్రా తీరు మారడం లేదు,” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రెవెన్యూ తగ్గింది, జీఎస్టీ రెవెన్యూ తగ్గింది, వాహనాల అమ్మకాలు తగ్గాయి, ఆదాయం తగ్గింది. తెలంగాణ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయని వార్తలు వస్తున్నాయి. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. ఈ రోజు తెలంగాణలో లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. వాటర్ ట్యాంకర్లను ఆధారం చేసుకుని పంటలను కాపాడుకునేందుకు రైతులు అల్లాడుతున్నారు,” అని వివరించారు.
కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని మంత్రులు అనడం రాష్ట్రానికి మంచిది కాదు. కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ బ్యారేజ్ మాత్రమే కాదు. మూడు బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 21 పంప్ హౌస్‌లు, వందల కిలోమీటర్ల సొరంగ మార్గాలు, వేల కిలోమీటర్ల కాలువలు ఉన్నాయి. కాళేశ్వరం కూలిపోయిందని చెప్పే ముఖ్యమంత్రి, ఆ ప్రాజెక్టులో భాగమైన కొండపోచమ్మ సాగర్ నుంచి హైదరాబాద్‌కు నీళ్లు తెస్తామని చెబుతారు. కాళేశ్వరం కూలిపోతే కొండపోచమ్మ సాగర్ ఎక్కడిది? మల్లన్న సాగర్, గంధమల్ల, బస్వాపూర్ ఎక్కడివి?” అని కెటిఆర్ సూటిగా ప్రశ్నలు సంధించారు.
హామీల అమలు విషయంలో రేవంత్ రెడ్డి పరిపాలన పూర్తిగా విఫలమైంది. ఆడబిడ్డలకు ఇస్తామన్న 2500 రూపాయలు, అమ్మలు అవ్వలకు పెంచి ఇస్తామన్న పెన్షన్లు ఆగిపోయాయి. తులం బంగారం ఇవ్వడం లేదు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఆగిపోయాయి. ఆడబిడ్డలపై అత్యాచారాలు, నేరాలు బాగా పెరిగాయి. శాంతి భద్రతల వ్యవహారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇదే అంశాన్ని రాష్ట్ర పోలీస్ శాఖ విడుదల చేసిన నివేదికలో కూడా ప్రస్తావించారు,” అని కేటీఆర్ ఆరోపించారు.
విద్యార్థులకు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని వెంటనే అందించాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రజాపాలనలో ప్రజాస్వామిక స్ఫూర్తి ఏమాత్రం లేదు. అశోక్ నగర్‌లో ఆడబిడ్డలపై పోలీసులు అమానుషంగా దాడి చేసిన పరిస్థితి ఉంది. ఆటో డ్రైవర్లు, రైతులు, గురుకుల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారందరినీ ప్రభుత్వం ఆదుకోవాలి,” అని పేర్కొన్నారు.
బీసీ డిక్లరేషన్‌లో 20 వేల కోట్ల రూపాయల బడ్జెట్ పెడతామన్నారు, కానీ రెండు సార్లు కలిపి వెయ్యి కోట్లు కూడా దాటలేదు. కాబట్టి ఈ బడ్జెట్‌లో అంచనాలను సవరించి మరిన్ని నిధులు అందించాలి. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు ఇచ్చిన అన్ని హామీలనూ అమలు చేయాలి. డిక్లరేషన్‌లలో పేర్కొన్న మేరకు నిధులను కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం,” అని కేటీఆర్ స్పష్టం చేశారు.