Suryaa.co.in

Andhra Pradesh

ఐదేళ్ళలో చూడచక్కగా సర్కారు బడులు

– మౌలిక సదుపాయాలను మెరుగు పరుస్తాం
– అకనంబట్టు జడ్పీ హైస్కూల్లో మంత్రి నారా లోకేష్ ఆకస్మిక తనిఖీలు

పూతలపట్టు నియోజకవర్గం అకనంబట్టు జిల్లా పరిషత్ హైస్కూల్ ను రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 8, 9,10 తరగతి విద్యార్థుల తరగతి గదులను సందర్శించిన మంత్రి లోకేష్ అక్కడి లోటుపాట్లపై ఆరా తీశారు. కొంత మంది విద్యార్థులు ఇంకా తమకు పాఠ్యపుస్తకాలు అందలేదని చెప్పడంతో తక్షణమే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందేలా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

పాఠ్యాంశాలను ఏ లాంగ్వేజ్ లో బోధిస్తున్నారని మంత్రి అడగ్గా.. తెలుగు, ఇంగ్లీషు రెండింటిలో చెబుతున్నారన్నారు. స్కూలులో బెంచీలు లేకపోవడంతో నేలపై కూర్చొని చదువుకోవాల్సి వస్తోందని.. విద్యార్థులు చెప్పగా, త్వరలో ఫర్నీచర్ ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. టాయిలెట్స్ పరిశుభ్రతపై ఆరా తీయగా, మూడు నెలలుగా ఇదివరటికంటే మెరుగ్గా ఉన్నాయని విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు.

నేను మీ అన్నలాంటి వాన్ని… ఎలాంటి సమస్య ఉన్నా నాకు చెప్పండి.. అని మంత్రి విద్యార్థుల వద్ద అన్నారు. ఐదేళ్లలో రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ళను ఉత్తమంగా తీర్చిదిద్ది, దేశంలో ఏపీ మోడల్ అని చెప్పుకునేలా చేస్తామని అన్నారు. యూరప్ వంటి దేశాల్లో మాతృభాషను ప్రోత్సహిస్తున్నారని, రాష్ట్రంలో తెలుగు విద్యార్థులు ఇంగ్లీష్ లో చదువుకోవడానికి కొంత ఇబ్బందిపడుతున్నారని చెప్పారు. అయితే, ఉన్నత చదువులకు వెళ్ళాక ఇంగ్లీష్ అవసరమని మంత్రి అభిప్రాయపడ్డారు. అన్నీ ఆలోచించి ఈ విషయంపై సముచితమైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

అనంతరం ప్రధాన ఉపాధ్యాయురాలు, ఉపాధ్యాయులతో మంత్రి లోకేష్ సమావేశం అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు 70 శాతం మాత్రమే ఉండటానికి కారణమేంటని ప్రశ్నించారు. పాఠశాలలకు రవాణా సౌకర్యం మెరుగుపర్చాల్సి ఉందని టీచర్లు మంత్రికి చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లపై ఇప్పుడిప్పుడే తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారని వారు పేర్కొన్నారు. నేను ఎవర్నీ తప్పుబట్టడానికి రాలేదు. పారదర్శకమైన విధానాలతో విద్యాప్రమాణాలను మెరుగుపర్చడమే మా లక్ష్యం.

గతంలో ఉపాధ్యాయులకు టాయిలెట్స్ బాధ్యత అప్పగించి తీవ్రంగా అవమానించడం బాధాకరం. ఒక్కసారిగా ప్రభుత్వ స్కూళ్ళను మార్చడం సాధ్యమయ్యేది కాదు. మౌలిక సదుపాయాలను కల్పించి క్రమేణా విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తాం. వెనుకబడిన విద్యార్థులపై టీచర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అందరం కలిసికట్టుగా ప్రభుత్వ స్కూళ్ళను ఉత్తమంగా తీర్చిదిద్దుదామని అన్నారు. విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురుతర బాధ్యత టీచర్లపై ఉందని లోకేష్ పేర్కొన్నారు.

రాష్ట్రంలో 55% విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నారని, ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్నది 45% మంది మాత్రమే అని చెప్పారు. గతంలో ప్రభుత్వం అందజేసిన ట్యాబ్ లలో విద్యార్థులు అనవసరమైన కంటెంట్ చూస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయని, ఈ విషయం లో టీచర్లు డేగకన్ను వేసి ఉంచాలని సూచించారు. ఇకపై ట్యాబ్స్ కు బదులుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే కంప్యూటర్ ల్యాబ్స్ అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు.

హైస్కూల్లోని కొన్ని తరగతి గదులు పెచ్చులూడుతున్నాయని టీచర్లు చెప్పగా, మరమ్మతులు చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వ స్కూళ్లలో వాతావరణం తెలుసుకోవడానికే ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నానని.. విద్యాశాఖ మంత్రిగా నేర్చుకోవడానికే మీ ముందుకు వచ్చానని చెప్పారు. గతంలో తాను పంచాయతీ రాజ్ మంత్రిగా ఏ నిర్ణయమైనా వెనువెంటనే తీసుకునేవాడినని.. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ తో కూడుకున్నందున విద్యాశాఖలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. తరగతి గదుల పరిశీలన అనంతరం విద్యార్థులు, టీచర్లతో లోకేష్ ఫోటోలు దిగారు.

LEAVE A RESPONSE