Suryaa.co.in

Andhra Pradesh

నాణ్యత, సాంకేతికత కలగలిపి పటిష్ఠంగా పల్లె రోడ్లు

• ఏఐఐబీ బ్యాంకు సహాయం
• 250 జనాభా దాటిన గ్రామాలన్నీ అనుసంధానం చేసే ప్రణాళిక
• వరదలకు, వర్షాలకు పాడవకుండా నిర్మాణం
• గ్రామీణ దార్లు స్థితిగతులు మార్చేందుకు కొత్త ప్రాజెక్టు
• ఏఐఐబీ బ్యాంకు ప్రతినిధులు, అధికారుల సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌

అమరావతి: ఓ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మొదట ఆ ప్రాంతంలో రవాణా మార్గాలు మెరుగవ్వాలనేది ఆర్థిక శాస్త్ర ప్రాథమిక సూత్రం. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న వేళ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోని రోడ్లు బాగుపడాలని, గ్రామాల మధ్య అనుసంధాన రహదారులు నాణ్యతతో ఉండాలనే ఆశయంతో ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కల్యాణ్‌ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. పల్లెదారులకు అవసరమైన నిధులను ఏషియన్ ఇన్ఫాస్ట్రక్చర్ ఇన్వెస్టిమెంట్ బ్యాంకు(ఏఐఐబీ) సమకూరుస్తుంది.

రాష్ట్రంలో 250 మించి జనాభా ఉన్న ప్రతి గ్రామానికి పక్కా రోడ్ల సదుపాయం కల్పించేలా, గ్రామాల మధ్య అనుసంధాన దారులను నిర్మించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏఐఐబీ ప్రతినిధులు పవన్ కర్కి, తౌషిక్ రెహ్మాన్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో పవన్ కల్యాణ్‌ ప్రాజెక్టు స్థితిగతులపై సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు స్వరూపాన్ని బ్యాంకు ప్రతినిధులు, పీఆర్ ఇంజినీరింగ్ అధికారులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌ బ్యాంకు ప్రతినిధులు, అధికారులతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వేసే రోడ్లు వరదలకు కొట్టుకుపోకుండా, వర్షాలకు ఛిద్రం కాకుండా ఉండాలి. ఆధునాతన పరిజ్ఞానం ఉపయోగించి వీటిని పక్కాగా వేయండి. రోడ్ల నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీ పడొద్దు. ఎక్కువ కాలం నిలిచిపోయేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిసారీ రోడ్లు పాడవకుండా నిబంధనల ప్రకారం పటిష్టంగా రోడ్లు వేసేలా కాంట్రాక్టర్లకు స్పష్టమైన నియమావళిని ఇవ్వాలి. పనులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. ప్రాజెక్టు పూర్తి అయ్యేలోగా రాష్ట్రంలో రహదారులు లేని గ్రామాలు లేకుండా సమగ్రంగా ప్రాజెక్టు రూపకల్పన చేయండి. పనులు వేగంగా, పకడ్బందీగా జరిగేలా అధికారులు చొరవ తీసుకోవాలన్నారు.

ప్రాజెక్టులో భాగం అయినందుకు సంతోషంగా ఉంది

ఈ సందర్భంగా బ్యాంకు ప్రతినిధులు సమావేశంలో మాట్లాడుతూ ప్రాజెక్టు అమలు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల నుంచి పూర్తి సహకారం ఉందన్నారు. డిప్యూటీ సీఎంకి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై, రహదారుల అనుసంధానంపై ఆయన మార్గదర్శకంలో ప్రాజెక్టు ఎలాంటి అవాంతరాలు లేకుండా ముందుకు వెళ్తుందని ఆకాంక్షించారు. ప్రాజెక్టు క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉడుముడిలంక గ్రామంలో పర్యటించి అక్కడ రోడ్డుతో పాటు ఓ వంతెన నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. ఆధునాతన సాంకేతికత ఉపయోగించుకొని ఆ రోడ్డు అనుసంధానంపై డ్రోన్ తో సర్వే నిర్వహించినట్టు బ్యాంకు ప్రతినిధులు తెలిపారు.

సాంకేతికత సాయంతో ప్రాజెక్టు మరింత శరవేగంగా ముందుకు సాగుతుందని తెలిపారు. రాష్ట్రంలో మారిన అనుకూల పరిస్థితులను ఉపయోగించుకొని ముందుకు సాగుతామని, ఇదే స్ఫూర్తితో రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కూడా వేగవంతంగా జరగాలని, దీనికోసం మా వంతు సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రగతిలో భాగమై గ్రామీణ రహదారుల నిర్మాణానికి ముందుకు వచ్చి సాయం చేసిన బ్యాంకు ప్రతినిధులకు పవన్‌ కల్యాణ్‌ హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. బ్యాంకు ప్రతినిధులను సన్మానించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు బాలు నాయక్, సి.వి.సుబ్బారెడ్డి, పి.వి. రమణ మూర్తి, కె.చక్రవర్తి, బి.డి.శ్రీనివాస్ పాల్గొన్నారు.

LEAVE A RESPONSE