Suryaa.co.in

Andhra Pradesh

దొంగ ఓట్ల నమోదులో కథ…స్క్రీన్ ప్లే..డైరెక్షన్ అంతా జగన్మోహన్ రెడ్డే

• జగన్ ప్రభుత్వం.. ఒక రాజకీయపార్టీ.. కన్సల్టింగ్ సంస్థల నిర్వాకం వల్లే రాష్ట్రంలో యథేచ్ఛగా దొంగ ఓట్ల నమోదు జరుగుతోంది
• ఐప్యాక్ ద్వారా జగన్ సర్కార్ నేరుగా ఓటర్ల జాబితాను తప్పులతో నింపుతూ, దొంగఓట్లతో మరలా అధికారంలోకి రావాలని చూస్తోంది
• ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం, వాలంటీర్ వ్యవస్థ.. ఐప్యాక్ సిబ్బంది చెప్పినట్టు చేస్తున్నారు
• ఎన్నికలకు ఇంకా మూడునెలలే ఉన్నందున రాష్ట్ర ఎన్నికల కమిషన్ తక్షణమే యుద్ధప్రాతిపదికన దొంగఓట్ల తొలగింపుపై దృష్టిపెట్టాలి
• తుదిఓటర్ల జాబితా విడుదలయ్యే నాటికి రాష్ట్రంలో ఒక్క దొంగ ఓటు కూడా లేకుండా చూడాలి
– టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్

రాష్ట్రంలో 3 నెలల్లో ఎన్నికలు రానున్న తరుణంలో దొంగఓట్లు అటు ప్రజల్ని, ఇటు రాజకీయపార్టీలను కలవరపెడుతున్నాయని, సెప్టెంబర్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 10మంది అంత కంటే ఎక్కువ కుటుంబ సభ్యులున్న ఇళ్లు సంఖ్య 1,57,939 ఉంటే, వాటిలో 24,61,676 మంది ఓటర్లు ఉన్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనే చెప్పిందని, వాటిలో 2,51,767 మంది ఓటర్ల ఇంటినంబర్లు సున్నాలు మరియు జంక్ నంబర్లు ఉండటం.. మరికొన్ని అర్థంకాని విధంగా ఉన్నాయని టీడీపీ అధికారప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…

“ సెప్టెంబర్ నాటికి రాష్ట్రంలో ఉన్న దొంగఓట్లలో 20శాతం ఓట్లను సరిచేశామని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మరిమిగిలిన వాటి సంగతేమిటన్నదే ఇప్పుడు భేతాళప్రశ్నగా మారింది. 1,57,939 ఇళ్లలో 20శాతం సరిచేసినట్టు రాష్ట్ర ఎన్ని కల కమిషనర్ చెబుతున్నారు. ప్రతిరోజూ రాష్ట్రంలో దొంగఓట్లు నమోదు కావడం.. అధికారులు సస్పెండ్ కావడం అనేవి నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో దొంగఓట్ల నమోదుకు గల కారణాలు ఏమిటా అని ఆలోచిస్తే … విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.

కొంతమంది వ్యక్తులు దొంగ ఓట్లు నమోదు వెనుక ఉన్నారు. ప్రభుత్వ డేటా వ్యక్తులకు చేరుతోంది.. ఒక్క మాటలో చెప్పాలంటే దొంగ ఓట్ల బాగోతంలో కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం జగన్మోహన్ రెడ్డిదే.ప్రభుత్వం, రాజకీయపార్టీ, ఎన్నికల కన్సల్టింగ్ సంస్థ కలిసి చేస్తున్న నిర్వాకాల ఫలితమే యథేచ్ఛగా జరుగుతున్న దొంగఓట్ల నమోదు. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా దొంగఓట్ల నమోదు అనేది జగన్మో హన్ రెడ్డి పాలనలోనే జరుగుతోంది.

రామ్ ఇన్ఫో సంస్థ ముసుగులో ఐప్యాక్ సంస్థే వాలంటీర్ల ద్వారా ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించి దొంగఓట్ల తంతులో కీలకపాత్ర పోషిస్తోంది
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే జూన్ 22న ప్రత్యేకంగా జీవో ఇచ్చి మరీ (జీవో ఎంఎస్-104) వాలంటీర్లను నియమించాడు. పంచాయతీరాజ్.. గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ శాఖల్ని నామమాత్రానికే పరిమితం చేస్తూ, 2.60లక్షల పైచిలుకు వాలంటీర్లను జగన్ సర్కార్ నియమించింది. వాలంటీర్లు అందరూ మనవాళ్లే (వైసీపీవారే) అని స్వయంగా మంత్రులే పలు సందర్భాల్లో చెప్పారు.వాలంటీర్ వ్యవస్థను పర్యవేక్షించడానికి డిసెంబర్ 23, 2019న ఏపీటీఎస్ (ఆంధ్రప్రదేశ్ టెక్నలాజికల్ సర్వీసెస్) తరుపున ఒక లెటర్ ఆఫ్ అవార్డ్ ఇవ్వడం జరిగింది.

అసలు వాలంటీర్లు ఏ డిపార్ట్మెంట్ కిందకు వస్తారో కూడా అప్పటికి నిర్ణయం కాకుండానే వాళ్ళను మానిటరింగ్ చేయడానికి ‘మూడు సంస్థల ప్రైవేటు కన్సార్షియం’ కు కాంట్రాక్ట్ లెటర్ ఇచ్చేసింది ఏపీటీఎస్. గ్రామ, వార్డు వాలంటీర్… సచివాలయ వ్యవస్థల పర్యవేక్షణను ప్రభుత్వం ఎఫ్.ఓ.ఏ (మూడుసంస్థల ప్రైవేట్ కన్సార్టియం) పరిధిలోకి చేర్చింది. ఎఫ్.ఓ.ఏ అంటే రామ్ ఇన్ఫో, ఉపాధి టెక్నో సర్వీసెస్ లిమిటెడ్, మ్యాక్స్ ఇన్ఫో డిటెక్టివ్ సర్వీసెస్ సంస్థ కలయిక. ఒక డిటెక్టివ్ సంస్థ ఎఫ్.ఓ.ఏలోకి ఎందుకొచ్చిందనేది నేటికీ సందేహమే.

ఎఫ్.ఓ.ఏని లీడ్ చేసే రామ్ ఇన్ఫో సంస్థకు అనుబంధంగా మండల, గ్రామ అధికారులు కలిసి పనిచేయాలని నేరుగా జిల్లా జాయింట్ కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులివ్వలేదు. రామ్ ఇన్ఫో సంస్థకు చెందిన ఉద్యోగులంతా గతంలో ఐప్యాక్ లో పనిచేసినవారేనని చెప్పడానికి కూడా అనేక ఆధారాలున్నాయి. దీనికి సంబంధించిన వివరాలను ఐప్యాక్ లింక్డ్ ఇన్ సమాచారంతో తెలుగుదేశం గతంలోనే ప్రజల ముందు ఉంచింది. ఆ విధంగా ఒక ప్రైవేట్ సంస్థను నేరుగా ప్రభుత్వ యంత్రాంగం కార్యకలాపాల్లో జోక్యం చేసుకునేలా చేశారు.

రామ్ ఇన్ఫో అనే సంస్థ కేవలం ముసుగు సంస్థ మాత్రమే.. దాని వెనకుండి నడిపించేది రాజకీయ కన్సల్టింగ్ సంస్థ అయిన ఐప్యాక్ సంస్థ. ఈ ఐప్యాక్ సంస్థ కార్యకలాపాల కోసం రాష్ట్రప్రభుత్వమే సంవత్సరానికి రూ.68 కోట్లు చెల్లిస్తోంది. జూన్ 2021న మరలా ప్రభుత్వం పోస్ట్ డిఫ్యాక్టో జీవో ఇచ్చింది. 2019లో ఐప్యాక్ పరిధిలో వాలంటీర్లు పనిచేసేలా చేసిన ప్రభుత్వం ఆ సమయంలో… ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి, ఐప్యాక్ సిబ్బందికి అందించారు.

రామ్ ఇన్ఫో వెబ్ సైట్ లోని సమాచా రం ప్రకారం ప్రభుత్వం నేరుగా 1061 మంది ఐప్యాక్ సిబ్బందిని నేరుగా ప్రభుత్వ కార్యక్రమాల్లో జోక్యం చేసుకునేలా చేసింది. ఇదంతా రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందే. ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వం ద్వారా జరిగే సమాచార సేకరణ ప్రక్రియలో నేరుగా పాల్గొనేలా ఉత్తర్వులివ్వడం.. సివిల్ సర్వెంట్స్ అయిన ఐ.ఏ.ఎస్ అధికారులు ఇంత జరుగుతున్నా చూస్తూ ఊరుకోవడం విచారకరం.

ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తం గుప్పెట్లో పెట్టుకున్న ఐప్యాక్ సంస్థ, ఓట్ల నమోదు.. తొలగింపు.. దొంగఓట్లపై దృష్టిపెట్టింది
ఐప్యాక్ ఇచ్చిన ఫార్మాట్ ప్రకారం, వాలంటీర్ల ద్వారా ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించే పనిని జగన్ ప్రభుత్వం నిర్విఘ్నంగా అమలుచేసింది. ఆధార్ కార్డ్ ను ఓటర్ కార్డుకి అనుసంధానించే పనిని చేస్తున్నట్టు.. ఆధార్ కార్డ్ సీడింగ్ తప్పని సరి అంటూ ప్రజలకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని వాలంటీర్ల ముసుగు లో ఐప్యాక్ సేకరించింది. ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ) సంస్థ తయారుచేసిన ఒక ప్రొఫైలింగ్ యాప్ టూల్ సాయంతో ఓటర్లను ప్రభావితం చేయడం మొదలెట్టారు. సచివాలయానికి వచ్చి ఆధార్ కార్డుని ఓటర్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలని ప్రభుత్వ సిబ్బందే నేరుగా ప్రజలకు సమాచార మిచ్చారు.

దానితో పాటు పౌరుల వ్యక్తిగత వివరాలు (కులం, మతం, జాతి, భాష, ఎంత ఆస్తి, ఎంత భూమి, ఎన్నిఇళ్లు, ఎలాంటి వాహనాలు, ఎందరు కుటుంబసభ్యులు, ఆదాయ వివరాలు) మొత్తం సేకరించారు. ఈ విధంగా ఇలాంటి వివరాలన్నీ నేరుగా ఐప్యాక్ సంస్థ పరిధిలోకి వెళ్లాయి. ప్రజల సమాచారం మొత్తం గుప్పెట్లో పెట్టుకున్న ఐప్యాక్ సంస్థ సాయంతో జగన్ రెడ్డి ప్రభుత్వం నేరుగా ఇప్పుడు ఓట్లనమోదు.. ఓట్ల తొలగింపు.. దొంగ ఓట్ల సృష్టిపై దృష్టిపెట్టింది. పౌరుల సమాచారాన్ని సేకరించడం చట్ట, రాజ్యాంగవిరుద్ధమని తెలిసినా కూడా ప్రభుత్వం చేతిలో చిక్కిన వాలంటీర్ వ్యవస్థ, ఐప్యాక్ కు మొత్తం సమాచారం అందించింది. ఈ విధంగా నాలుగేళ్లుగా ప్రభుత్వం చాలా నింపాదిగా.. ఒక క్రమ పద్ధతిలో రాష్ట్రవ్యాప్తంగా దొంగఓట్లు నమోదుచేసింది. తిరుపతిలో, విశాఖపట్నం జిల్లాలో వేలసంఖ్యలో దొంగఓట్లు నమోదయ్యాయి. అలానే అనేక నియోజకవర్గాల్లో వేలాదిగా దొంగఓట్లు చేర్పించారు.

ప్రభుత్వ ఆదేశాలు అంటూ వాలంటీర్లు ప్రజల స్వేచ్ఛ, హక్కులు హరించేలా పనిచేస్తామంటే టీడీపీ సహించదు
ఐప్యాక్ సంస్థ సాయంతో నేరుగా జగన్ సర్కారే దొంగఓట్ల నమోదు అనే బృహత్తర కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. దీనిపై తొలుత కఠినంగా వ్యవహరించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ క్రమేణా కాస్త మెత్తబడింది. ఓటర్ జాబితా పరిశీలన సహా, ఎన్నికల విధుల్లో వాలంటీర్ల ప్రమేయం లేకుండా చేస్తామని కూడా ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.04-10-2023న ఇందుకు సంబంధించిన ఆదేశాలు కూడా ఇచ్చింది. జగన్ ను తిరిగి ఎందుకు ఎన్నుకోవాలి అనేఅంశంపై వాలంటీర్లు ఇప్పుడు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు.

ఇప్పటికే అనేక కార్యకలాపాల్లో నిమగ్నమైన వాలంటీర్లు ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ద్వారా ప్రజల్ని ప్రభావి తం చేయకుండా ఉంటానుకోవడం అమాయకత్వమే అవుతుంది. తీసేసిన ఓట్ల తాలూకా సమాచారం ఓటర్లకు కూడా చెప్పకుండా రాష్ట్రంలో చాలా నియోజకవర్గా ల్లో నేరుగా వాలంటీర్లు ఓట్లు తొలగిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో.. సంక్షేమ పథకాల చేరవేతకు మాత్రమే వాలంటీర్లు ప్రమేయమైతే మంచిదే. అలా చేస్తే టీడీపీ కూడా తప్పుపట్టదు. కానీ ఈ విధంగా ఓట్లు తీసేయడం.. ప్రభుత్వ ఆదేశా లతో ప్రజల హక్కులు, స్వేఛ్ఛను హరించే చర్యలకు పాల్పడుతుంటే టీడీపీ సహించదు.

తక్షణమే మొత్తం ఓటర్ల వివరాలతో శ్వేతపత్రం విడుదలచేయాలి
ఎన్నికలకు ఇంకా మూడునెలల సమయమే ఉన్నందున రాష్ట్ర ఎన్నికల కమిషన్ తక్షణమే యుద్ధప్రాతిపదికన దొంగఓట్ల తొలగింపుపై దృష్టిపెట్టాలి. జనవరిలో తుదిఓటర్ల జాబితా విడుదలయ్యే సమయానికి రాష్ట్రంలో ఒక్క దొంగ ఓటు కూడా ఉండటానికి వీల్లేదు. అలానే వాలంటీర్ వ్యవస్థను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలి. అసలు ఓటర్ జాబితా చూడటానికి కూడా వారికి అవకాశం ఇవ్వకూడదు. జగన్ ను మరలా ఎందుకు ఎన్నుకోవాలనే కార్యక్రమం లో కూడా వారు పాల్గొనకుండా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి. గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బందిని కూడా ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలి.

తక్షణమే ఉపాధ్యాయులు..ప్రభుత్వ ఉద్యోగుల్ని ఎన్నికల విధుల్లో నియమిం చాలి. ఫామ్ -7 వినియోగం పూర్తిగా ఎన్నికల కమిషన్ పర్యవేక్షణ లోనే జరిగేలా చూడాలి. రాష్ట్రంలోని మొత్తం ఓటర్ల వివరాలతో ఏపీ ఎన్నికల కమిషన్ తక్షణమే అధికారికంగా వాస్తవాలతో కూడిన శ్వేతపత్రం విడుదల చేయాలి. ఇవేవీ జరగ కుండా ఎన్నికలు నిర్వహించడం ముమ్మాటికీ అనైకతికం.. అప్రజాస్వామికం. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఓటుహక్కు హరించేలా చేస్తున్న ఏ కార్యక్రమాన్ని టీడీపీ కొనసాగనివ్వదు” అని విజయ్ కుమార్ తేల్చి చెప్పారు.

LEAVE A RESPONSE