Suryaa.co.in

Andhra Pradesh

వృద్ధుల అరణ్య రోదన ఇంకెన్నాళ్లు?

– టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి
వృద్ధుల అరణ్య రోదన ఇంకెన్నాళ్లు? అని టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఆయన మాటలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే మీకోసం… రెండున్నర లక్షల పెన్షన్లను మంజూరు చేశామని చెప్పి ఇవ్వడంలేదు. పైగా మరో వైపు పెన్షన్లను రద్దు చేసి వృద్ధులకు అన్యాయం చేశారు. ఉద్యోగులకు 1వ తేది అందే పెన్షన్లు అందడంలేదు. వైసీపీ ప్రభుత్వం అర్హులైన పేదవారికి పింఛన్లివ్వకపోవడం అన్యాయం.
అధికారంలోకి రావడానికి వైసీపీ అమలుకాని హామీలిచ్చింది. అవ్వా, తాత, దివ్యాంగులు, వితంతువులకిచ్చే సామాజిక భద్రత పెన్షన్ ని రూ.3వేలకు పెంచుతామని చెప్పి ఇంతవరకు పెంచలేదు. జగన్ ప్రమాణస్వీకారమప్పుడు నామమాత్రంగా పెంచి డబ్బాలు కొట్టుకున్నారు. మొన్న 1వ తేదిన లక్షా పాతికవేల పెన్షన్లను తొలగించారు. మూడు నెలల్లో దాదాపు 2 లక్షల 30 వేల పెన్షన్లని ప్రభుత్వం తొలగించి అన్యాయం చేసింది. ఏప్రిల్ నుంచి పెన్షన్లకు ఎప్పుడు దరఖాస్తు చేసుకుంటే అప్పుడు మంజూరు చేస్తామని ప్రతికల్లో ప్రకటనలిచ్చారు. దరఖాస్తు చేస్తున్నవారికి మంజూరు చేస్తున్నారు గానీ డబ్బులు ఇవ్వడంలేదు. సెప్టెంబర్ 21వ తేది లోగా ఈ ప్రభుత్వం రెండున్నర లక్షల పెన్షన్లు మంజూరు చేసినా ఇవ్వలేదు.
కొండేపి నియోజకవర్గంలో 1284 పెన్షనుల మంజూరు చేసి డబ్బులేమో ఇవ్వలేదు. వృద్ధులు అనారోగ్యంతో ఆసుప్రతులకు, పుణ్యక్షేత్రాలకు వెళ్తే పెన్షన్ కట్ చేయడం చాలా దుర్మార్గమైన చర్య. ఈ విధానంలో మార్పు రావాలి. మంజూరు చేసి పంపిణీ చేయని రెండున్నర లక్షల పెన్షన్లు ఇవ్వాలి. ఉద్యోగాల నుండి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు 15వ తేదీకి కూడా పెన్షన్ లేదు. వారు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. 45 సంవత్సరాలకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు పెన్షన్లు ఇస్తామన్న హామీ ఏమైందో జగన్ రెడ్డి చెప్పాలి. చేయూత అని చెప్పి వాలంటీర్లు చెప్పినవారికే ఇస్తున్నారు. టీడీపీకి చెందినవారికి పెన్షన్ల విషయంలో అన్యాయం చేస్తున్నారు.
వెబ్ సైట్లల్లో మాత్రం పెన్షన్లు మంజూరు చేసినట్లుగా ఉంటుంది. వృద్ధులకేమో అంది ఉండదు. విలేఖర్లు ఈ విషయాలను గమనించాలి. మంజూరు చేస్తూ ఉత్తర్వులు అయితే ఇచ్చారు కానీ వారికి పేమెంట్ లేదు. పేదల ఓట్లతో అధికారంలోకి వచ్చి పేదల కడుపు కొడుతున్నారు. నిరుపేదలను అన్యాయం చేయొద్దు. పేదలను ఉద్ధరిస్తారనుకుంటే మోసం చేశారు. ప్రభుత్వం వృద్ధులకు మభ్యపెట్టడం మానుకోవాలి. సామాజిక భద్రతా పెన్షన్లు మంజూరు చేసి ఇవ్వకుండా మోసం చేసిన వైనాన్ని రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. వీరందరి ఉసురు వైసీపీ ప్రభుత్వానికి తప్పక తగులుతుంది. ఈ దుర్మార్గపు ప్రభుత్వానికి ప్రజలంతా కలిసి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. ప్రభుత్వం కుప్పకూలే రోజు తప్పక వస్తుందని టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి తెలిపారు.

LEAVE A RESPONSE