ఇరిగేషన్, వ్యవసాయ రంగాలు నిర్వీర్యం

రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఆయకట్టు రైతుల ఆక్రందనలే..!
అన్నపూర్ణగా వెలుగొందిన రాష్ట్రాన్ని వైయస్ జగన్మోహన్ రెడ్డి కరువు కోరల్లోకి నెట్టారు

– తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు

గొల్లపూడి: ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో కాలువల ఆధునీకరణకు జగన్ ప్రభుత్వం చేసిన ఖర్చు చాలా స్వల్పమని, అసలు బడ్జెట్ కేటాయింపులే తక్కువ అనుకుంటే అందులో నుంచి ఖర్చు చేసింది నామ మాత్రమేనని చాలిచాలని నిధులతో పనులు చేసింది అంతంత మాత్రమేనని ఏపీ జలవనరుల శాఖ మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వర రావు ధ్వజమెత్తారు.

ఆంధ్రప్రదేశ్ అంటే అపార జలవనరులు… సారవంతమైన భూములు…చెమటోడ్చి కష్టించే రైతులు… అధిక దిగుబడి సాధించే పద్ధతులు..! ఇలా రాష్ట్రంలో అన్నీ ఉన్నాయి. లేనిదల్లా వైకాపా ప్రభుత్వ సహకారమే అని విమర్శించారు. ఒకప్పుడు అన్నపూర్ణగా వెలుగొందిన ఆంధ్రప్రదేశ్లో… ఇప్పుడు పంట భూములు వెలవెలబోతున్నాయన్నారు. లీకేజీలతో, పిచ్చి మొక్కలతో..శిథిలావస్థకు చేరిన కాల్వలకు మరమ్మతులూ చేయలేని స్థితిలో ఉందని ఆరోపించారు. చివరి ఆయకట్టుకు నీరందని పరిస్థితి. జగన్ పాలనలో… ఇదీ అన్నదాతల దుస్థితి.

సాగునీటి కాలువల నిర్వహణ పట్టించుకునే నాధుడు లేడు అన్నారు. కాలువలు పూడిపోయాయి. లాకులు, షట్టర్లు శిధిలావస్థకు చేరుకున్నాయన్నారు. చుక్క నీరు ముందుకు కదిలే పరిస్థితి లేదని కేటాయించిన అరకొరా నిధులూ ఖర్చు పెట్టరని ఎద్దేవా చేసారు. మొత్తంగా రాష్ట్రంలో ఇరిగేషన్, వ్యవసాయ రంగాలను జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశార అని విమర్శలు సంధించారు. మీ నిర్లక్ష్యానికి బలైన ఆయకట్టు రైతుల ఆక్రందనలు వినిపించడం లేదా? అని ప్రశ్నించారు. అన్నపూర్ణగా వెలుగొందిన రాష్ట్రాన్ని కరువు కోరల్లోకి నెట్టారు అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

 

Leave a Reply