Suryaa.co.in

Andhra Pradesh

చిత్తూరు జిల్లా ఎస్పీ, కలెక్టర్ లకు పెద్దిరెడ్డిని కాదని వ్యవహరించే స్వేచ్ఛ ఉందా?

– చిత్తూరు జిల్లాలోని పోలీసు స్టేషన్ లో కేసు రిజిష్టర్ అవ్వాలన్నా, రెవెన్యూ ఆఫీసులో పాస్ బుక్ రిలీజ్ అవ్వాలన్నా పెద్దిరెడ్డి అనుమతి తప్పనిసరి
– రెండు దశాబ్దాల క్రితం మీ ఆస్తులెంతె? , ఇప్పుడు ఎంత? పెద్దిరెడ్డి!
— టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

రెండు దశాబ్దాల క్రితం మీ ఆస్తులెంతె?, ఇప్పుడు ఎంత? పెద్దిరెడ్డి! అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రశ్నించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడిన మాటలు …

45 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి, ఎటువంటి అవినీతి మచ్చ ఎరుగని రాజకీయ నాయకుడు, ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, అనేక సంవత్సరాలు రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన వ్యక్తి నారా చంద్రబాబునాయుడు గురించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారు. చంద్రబాబు అవినీతిపరుడని విమర్శిస్తున్నారు. చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు ఉందా అని మంత్రి రామచంద్రారెడ్డిని ప్రశ్నిస్తున్నాను.

రెండు దశాబ్దాల క్రితం ఒక చిన్న సీ క్లాస్ కాంట్రాక్టర్ గా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేడు వేల కోట్లకు అధిపతి ఎలా కాగలిగారు? ఇది ఎలా సాద్యం? మీ చరిత్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. గురిగింద గింజలాగ నలుపెరగకుండా చంద్రబాబు గురించి మాట్లాడటం సరికాదు. నేడు అవినీతి సొమ్ముతో ఒక పక్క మీ కుమారుడు ఎంపీ, పెద్దిరెడ్డి మంత్రిగా చిత్తూరు జిల్లాలో మీ సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సామ్రాజ్యంలోకి జగన్మోహన్ రెడ్డికి కూడా ప్రవేశం లేదు. జగన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చేమోగానీ పెద్దిరెడ్డి ప్రత్యేక సామ్రాజ్యంలో జగన్మోహన్ రెడ్డికి ప్రవేశించలేడు. డీజీపీ రాజేంద్రనాధరెడ్డికి కూడా వారి సామ్రాజ్యంలోకి ప్రవేశం లేదు. డీజీపీ అక్కడి పోలీసులను డైరెక్షన్ ఇవ్వలేడు. పోలీసు శాఖ మొత్తం వీరి ఎదుట చేతులు ముడుచుకు కూర్చుంటున్నారు.

ఛీఫ్ సెక్రటరి లేకుండా అక్కడ వేరే అధికారులు ఆదేశించే స్థాయిలో లేరు. అదొక నిశిద్ధ ప్రాంతం. పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు అక్కడ నియంతలు. పెద్దిరెడ్డి సంపాదించిన అవినీతి సొమ్ముతో అక్కడ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మీ సామ్రాజ్యంలోకి ఇతరులకు ప్రవేశం లేదు. స్థానిక పోలీసు స్టేషన్ లో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాలన్నా పెద్దిరెడ్డి అనుమతి కావాలి. పోలీసు అధికారులు పెద్దిరెడ్డి ఇంటికెళ్లి ఎస్ అని అనిపించుకొని వెళ్తేనే అక్కడ ఎఫ్ ఐఆర్ రిజిష్టర్ అవుతుంది. కాదని అక్కడి ఎస్పీనిగానీ, పోలీసు అధికారులు గానీ చెప్పగలిగే ధైర్యముందా? మేం చట్టప్రకారం వెళ్తున్నామని చెప్పగలిగే ధైర్యం ఏ అధికారికైనా ఉందా? అక్కడి రెవెన్యూ అధికారులు ఒక చిన్న ఆర్డర్ కూడా పాస్ చేయలేరు.

చిన్న పాస్ బుక్ కూడా రిలీజ్ చేయలేరు. పెద్దిరెడ్డి ఇలాకాలో ఎవరికైనా ధైర్యంగా జగన్ ఎమ్మెల్యే సీటు ఇవ్వగలడా? పెద్దిరెడ్డి అవినీతి సామ్రాజ్యాన్ని చూసి జగన్ కూడా భయపడతాడు. అటువంటి వ్యక్తులు చంద్రబాబు గురించి మాట్లాడటమా? మీ గత చరిత్ర ను పరిశీలిస్తే 2004లో ఎన్ కౌంటర్ కు గురైన ఎర్రచందనం దొంగ వీరప్పన్ చనిపోయాక స్మగ్లింగ్ అంతా ఎవరి చేతుల్లో ఉంది? నిజాయితీగా చెప్పగలరా? కొల్లం గంగిరెడ్డికి మీకు ఉన్న సంబంధమేంటి? సామాన్య సీ కాంట్రాక్టర్ ఇన్ని వేల కోట్లకు ఎలా పడగలెత్తారు? మీలా కోట్లకు పడగలెత్తిన మరో కాంట్రాక్టర్ ఉంటే చూపండి. 2013 నుంచి శేషాద్రి అడవులు, వాటి చుట్టుపక్క ప్రాంతాల్లో రెడ్ శాండిల్ సామ్రాజ్యం మీ కనుసన్నల్లో నడిచింది నిజం కాదా?

తమిళనాడు రాష్ట్రానికి చెందిన వందలాదిమంది దళితులు జైల్లో ఉంటే వారి కేసులకు కోర్టుల్లో అండగా నిలబడింది నిజంకాదా? కాదంటే వివరాలు చూపించగలను. పెద్దిరెడ్డి ఆస్తుల గురించి విచారణకు సిద్దమా? పెద్దిరెడ్డికి ఎక్కడ ఎన్ని ఆస్తులున్నాయో చెప్పలేని స్థితిలో ఉన్నారు. చిత్తూరు జిల్లా ఎస్పీ, కలెక్టర్ లు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారా? పెద్దిరెడ్డిని కాదని వ్యవహరించే స్వేచ్ఛ మీకుందా? చంద్రబాబు గురించి మాట్లాడే హక్కు లేదు. అధికారంలోకి వచ్చాక మీరు ఐదేళ్లుగా మీ ఇలాకాలో జరిగిన అరాచకాలను బయటికి తీయాలి,

వారి అరాచకాలపై ఒక కమిషన్ ను వేయాలి. ఈ పోలీసు స్టేషన్లలో రిజిష్టర్ అయిన కేసులను ఇన్వెస్టిగేషన్ చేయాలి. రిజిష్టర్ కాని కంప్లైంట్స్ పై ఒక సమీక్ష జరగాలి. పోలీసు అధికారులంతా తప్పించుకునే అవకాశముంది. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, ఇతర అధికారులు ఏ విధంగా బానిసత్వం చేసింది రాష్ట్ర ప్రజలకు తెలియాలి. చంద్రబాబుపై అవాకులు, చవాకులు పేలితే సూర్యుడిపై ఉమ్మేసినట్లే అవుతుందని వర్ల రామయ్య తెలిపారు.

LEAVE A RESPONSE