– నాడు ఇందిర పీఓకేను ఎందుకు స్వాధీనం చేసుకోలేదు?
– పట్టుబడ్డ 90 వేల మంది పాక్ సైనికులను ఎందుకు విడిచిపెట్టారు?
– వరుస వైఫల్యాలతో కాంగ్రెస్ లో అసహనం
– కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నిన్నటి సభలో ప్రసంగిస్తూ బిజెపి నాయకులు ఆడా కాదు, మగా కాదు అంటూ చేసిన అసభ్యకర, అభ్యంతరకర, అనాలోచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు తన స్థాయి మరచి, ఇంతటి నీచమైన వ్యాఖ్యలు చేసి, దిల్లీ లీడర్ కాస్తా గల్లీ లీడర్ స్థాయికి దిగజారిపోయారు. ఇది కాంగ్రెస్ పతనానికి మరో నిదర్శనం.
80 ఏళ్ల వయస్సు గల ఖర్గే ఈ స్థాయికి దిగజారుతారని ఎవరూ ఊహించలేదు. ఈ వ్యాఖ్యలు ఆయన సొంతమా? లేక ఎవరైనా ఇచ్చిన స్క్రిప్ట్ చదివారా? కాంగ్రెస్ వరుస వైఫల్యాలతో కట్టలు తెంచుకున్న అసహనంతోనే, తమ అధినాయకత్వాన్ని ఏమీ అనలేక, చేష్టలుడిగి బిజెపిపై విరుచుకుపడ్డారని భావించాలి.
మోదీ ప్రభుత్వం PoKను స్వాధీనం చేసుకోకపోవడాన్ని ఖర్గే తప్పుబట్టడం హాస్యాస్పదంగా ఉంది. భారత్ ఆధీనంలో ఉండాల్సిన కశ్మీర్ పాక్ పరమవడం కాంగ్రెస్ పాపమే కాదా..? 1948లో నెహ్రూ ప్రభుత్వం తప్పిదమే PoK పుట్టుకకు కారణం కాదా…? ఆరోజు భారత సైన్యాన్ని PoK నుంచి వెనక్కు ఎందుకు రప్పించారో చెప్పగలరా? 1971లోనూ భారత సైన్యం పాకిస్తాన్ పై విజయం సాధించినప్పటికీ… నాటి ప్రధాని ఇందిరా గాంధీ PoKను స్వాధీనం చేసుకోలేదు కదా?
పైగా బందీలుగా పట్టుబడిన 90వేల మంది పాక్ సైనికులను ఎలాంటి షరతుల్లేకుండా విడిచిపెట్టారు. కానీ, మోదీ ప్రభుత్వం పహల్గాం దాడి తర్వాత PoKలో ఉన్న ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. ఆపరేషన్ సిందూర్, అంతకుముందు బాలాకోట్ వైమానిక దాడులు, సర్జికల్ స్ట్రైక్స్.. మోదీ పాలనలో వృద్ధి చెందుతున్న భారత సామర్థ్యానికి నిదర్శనం. యూపీఏ పాలనలో ఏనాడైనా ఉగ్రదాడులకు జవాబిచ్చారా?
ముంబై దాడులు, పార్లమెంటుపై దాడి, ఎన్నో బాంబు పేలుళ్లు జరిగినా ఏమీ చేయలేక అన్నీ ముడుచుకొని మౌనం దాల్చడం వాస్తవం కాదా? అని అడుగుతున్నాను. మోదీ ప్రభుత్వం భారత సైన్యానికి స్వేచ్ఛనిచ్చి ఉగ్రదాడులకు దీటుగా బదులిస్తే.., మీరు, మీ నాయకులు రాహుల్ గాంధీ సర్జికల్ స్ట్రైక్స్ ఆధారాలు చూపించండి, ఆపరేషన్ సింధూర్ లో కూలిపోయిన యుద్ధ విమానాల లెక్క చెప్పండి అంటూ పాకిస్తాన్ భాషలో మాట్లాడారు.
రాజ్యాంగ పీఠికలోని సెక్యులర్, సోషలిస్ట్ పదాల విషయంలోనూ ఖర్గే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. 1975లో ప్రతిపక్ష నాయకులను జైల్లో పెట్టి మరీ కాంగ్రెస్ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో సవరణలు చేసింది. పీఠికలో చేర్చిన సెక్యులర్, సోషలిస్ట్ పదాల గురించి బిజెపి ఏనాడూ ఏమీ అనలేదు.
1949లో ఆమోదించిన రాజ్యాంగ పీఠికలోని మూల అంశాల్లో సోషలిజం, సెక్యులరిజం పదాలు భాగం కాదని, వాటిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని కొందరు RSS పెద్దలు మాట్లాడటం వారి వ్యక్తిగత అభిప్రాయం. దీనిని బిజెపికి ఆపాదించడం బట్ట కాల్చి మీద వెయ్యడమే. గత లోక్ సభ ఎన్నికల సందర్భంలోనూ, బిజెపి గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లు రద్దు చేస్తారని కాంగ్రెస్ భయంకరమైన విష ప్రచారానికి తెరలేపింది.
ఇప్పుడు తెలంగాణలో వైఫల్యాలను, అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు మళ్లీ అదే తరహా దుష్ప్రచారం చేస్తోంది.
తెలంగాణలో 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒక్కటీ అమలు చేయక ప్రజలను నిట్టనిలువునా మోసం చేసింది. ప్రభుత్వం ఏర్పాటుచేసిన 100 రోజుల్లో అన్ని హామీలను అమలు చేస్తామని రాహుల్, సోనియా, ఖర్గే లేఖలు రాయడాన్ని, హామీ పత్రాలు ఇవ్వడాన్ని, అబద్ధపు వాగ్ధానాలు చేయడాన్ని ప్రజలు నిలదీస్తున్నారు.
ఎక్కడిక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, నాయకులను అడ్డుకుంటున్నారు. దీని నుంచి దృష్టి మళ్లించేందుకు ఖర్గే బిజెపిపై అర్థం పర్థం లేని విమర్శలు చేస్తున్నారు. బిజెపి మేనిఫెస్టోలో లేని రూ.15 లక్షలు ఇస్తామన్న అబద్ధాన్ని పదేపదే వల్లెవేయడం కూడా వారి దృష్టి మళ్లింపు రాజకీయంలో భాగమే.
తనలో గూడుకట్టుకున్న నిరాశ, నిస్పృహలతో అబద్ధాలు వల్లె వేస్తూ మోసం చేసిన ఖర్గే తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. లేకపోతే, తెలంగాణ ప్రజల ఆగ్రహ జ్వాలలో కాంగ్రెస్ కొట్టుకుపోవడం ఖాయమని హెచ్చరిస్తున్నాను.