వాలంటీర్స్ లేకపోతే వ్యవస్థ స్తంభించిపోయిందా?

గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగుల వ్యవస్థలో చట్టబద్ధంగా భాగస్వాములు. వాలంటీర్స్ చట్టబద్ధమైన వ్యవస్థలో ఉద్యోగులు కాదు. వారికి కనీస వేతనాలు కూడా చెల్లించడం లేదు. కాంట్రాక్టు లేదా పొరుగు సేవలు అందించే ఉద్యోగుల తరహా ఉద్యోగులు కాదు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మానస పుత్రిక అయిన ప్రయివేటు సైన్యమే వాలంటీర్స్ వ్యవస్థ. వారికి, ప్రభుత్వ ఖజానా నుండి గౌరవ వేతనం కింద ఐదు వేలు చెల్లిస్తూ వస్తున్నారు. గౌరవ వేతనం పెంచమని వాలంటీర్స్ విజ్ఞప్తి చేస్తే, మీరు “సేవకులు” మాత్రమేనని ముఖ్యమంత్రి వారికి హితబోధ చేశారు కదా?

రాజకీయ లబ్ధికోసమే ఏర్పాటు చేసుకొన్న చట్టబద్ధంకాని వ్యవస్థ వాలంటీర్స్ వ్యవస్థ. 73 & 74 రాజ్యాంగ సవరణల ప్రకారం స్థానిక సంస్థలను పటిష్టవంతం చేయడానికి బదులు వాలంటీర్స్ వ్యవస్థను ఏర్పాటు చేసి బలహీనపరిచారు.

సాధారణ ఎన్నికల నియమావళి అమలులో ఉన్నది. చట్టబద్ధమైన వ్యవస్థలో విధులు నిర్వహించే ఉద్యోగులుకాని వాలంటీర్స్ ను ఎన్నికల కమీషన్ పక్కన పెట్టడం స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకు ముందు షరతు. కొన్ని నెలల క్రితమే ఎన్నికల కమీషన్ వాలంటీర్స్ ను ఎన్నికలకు సంబంధించిన పనుల నుండి దూరం పెట్టమని ఆదేశాలు జారీ చేసింది కదా! రాష్ట్ర ప్రభుత్వం, పాలక పార్టీ ఆ ఆదేశాలను ఖాతరు చేయకపోగా ఆ వ్యవస్థను దుర్వినియోగం చేసింది. ఎన్నికల కమీషన్ తన కర్తవ్యాన్ని నిర్వర్తించింది. పైపెచ్చు, హైకోర్టు కూడా ఆదేశించింది.

“వాలంటీర్స్” లేకపోతే పాలనా యంత్రాంగమే స్థంభించిపోయిందన్న వాతావరణం సృష్టించడం ప్రభుత్వ యంత్రాంగానికే తలవంపులు. పాలక పార్టీ ఎందుకు గావుకేకలు పెడుతున్నదో! ప్రతిపక్షాల మీద నెపం నెట్టే ప్రయత్నం చేసిందో అందరికీ విధితమే.

– టి. లక్ష్మీనారాయణ

 

Leave a Reply