– ఖమ్మంలో కేసీఆర్ ‘పరాయి రాష్ట్ర సెంటిమెంటు’ వ్యాఖ్యలు బూమెరాంగ్
– పరాయి రాష్ట్రం వాళ్లొచ్చి ఓడిస్తామంటే ఓడిపోదామా అని ప్రశ్నించిన కేసీఆర్
– తెలంగాణ ఎన్నికల తర్వాత మహారాష్ట్రపై దృష్టి సారిస్తామన్న కేటీఆర్
– కేసీఆర్-కేటీఆర్ వ్యాఖ్యలపై సోషల్‌మీడియాలో రచ్చ
– మరి మహారాష్ట్ర పరాయి రాష్ట్రం కాదా అని ప్రశ్నలు
– పరాయి రాష్ట్రం వాళ్లు వెళ్లి మరాఠాలను ఓడిస్తారా అన్న ప్రశ్నల వర్షం
– అక్కడి మరాఠా నేతలూ అలాంటి ప్రచారం చేస్తే తప్పేమిటని చర్చ
– ఏ అర్హతతో మహారాష్ట్రలో పోటీ చేస్తారని నిలదీత
– ఏపీలో ఎలా పార్టీ పెట్టారన్న ప్రశ్నలు
– జాతీయ పార్టీ పెట్టి ఇతరులను రావద్దంటే ఎలా అని ఫైర్
– మీరు ఎక్కడికైనా వెళ్లొచ్చు.. వాళ్లు ఇక్కడకు రావద్దంటే ఎలా?
– సోషల్‌మీడియాలో బీఆర్‌ఎస్ జాతీయ.. ‘ప్రాంతీయ రచ్చ’
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఒకే అంశంలో తండ్రీకొడుకులు చేసిన పరస్పర విరద్ధ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి. అది అటు తిరిగి ఇటు తిరిగి ఆవుకథ మాదిరిగా.. మళ్లీ బీఆర్‌ఎస్ వాదాన్ని ప్రశ్నార్ధకంగా మార్చాయి. ఇద్దరి మాటల వీడియోలతో కాంగ్రెస్ సోషల్‌మీడియా సైనికులు ఆ అంశాన్ని, ఒక చర్చ లాంటి రచ్చలా మార్చేశారు.
ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఆర్‌ఎస్ దళపతి, సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా ‘పరాయి రాష్ట్రం’ ప్రస్తావన తీసుకువచ్చారు. ఆరకంగా తెలంగాణ కార్డును జనాంతికంగా సంధించారు. బీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిలారెడ్డి చేస్తున్న ప్రయత్నాలను కేసీఆర్ ప్రస్తావించారు. బీఆర్‌ఎస్ అభ్యర్ధులను ఓడించేందుకు షర్మిల డబ్బులు కుమ్మరిస్తోందన్నారు.
అందులో భాగంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ సోఏల్‌మీడియా సైనికులే దానిని చర్చనీయాంశం చేశారు. ‘ ఉద్యమ సమయంలో సమైక్యవాదులు, వారి చెంచాలు ఇక్కడ నిరసన తెలిపితే ప్రజలు అడ్డుకున్నారు. దీనితో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌పై షర్మిల పగబట్టారట. ఎన్నికల్లో డబ్బు కట్టలు పంపిస్తుందట. మరి షర్మిల డబ్బు కట్టలు గెలవాలా? లేక మన మన మిషన్ భగీరథ మంచినీళ్లు గెలవాలా? పరాయి రాష్ట్రం వాళ్లు వచ్చి డబ్బు సంచులతో మిమ్మల్ని ఓడిస్తామంటే ఓడిపోదామా?’’ అందే ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. ఒకరకంగా కేసీఆర్ ఈ ఎన్నికల్లో పరాయి రాష్ట్రం పేరుతో చేసిన తొలి ప్రసంగం కూడా ఇదే కావడం ప్రస్తావనార్హం.
మరుసటిరోజు ఏబీఎన్ చానెల్ అధిపతి రాధాకృష్ణ చేసిన ఇంటర్వ్యూలో… ఈ ఎన్నికల తర్వాత తాము మహారాష్ట్ర ఎన్నికలపై దృష్టి పెడతామని… బీఆర్‌ఎస్ ఉత్తరాధికారి, మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. దానితో కాంగ్రెస్ సోషల్‌మీడియా సైనికులు రంగంలోకి దిగి, ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘ ఖమ్మం జిల్లాకు ఎవరూ రావద్దట. పరాయి రాష్ట్రాల వాళ్లు అసలు రావద్దట. కానీ బీఆర్‌ఎస్ వాళ్లు మాత్రం మహారాష్ట్రకు వెళ్లి పోటీ చేస్తారట.పక్క రాష్ట్రమైన ఏపీలో పార్టీ పెట్టారు. ఇదేం వాదం? మరి మరాఠా వాళ్లకు ఆత్మాభిమానం ఉండదా? అసలు బీఆర్‌ఎస్‌ది జాతీయ పార్టీనా? ప్రాంతీయ పార్టీనా’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
‘‘రేపు కేసీఆర్ మహారాష్ట్రకు వెళితే.. పక్క రాష్ట్రాల వాళ్లు డబ్బు సంచులతో వచ్చి మరాఠాలను ఓడిస్తామంటే ఓడిపోదామా? అని అక్కడి మరాఠాలు ప్రశ్నిస్తే, బీఆర్‌ఎస్ అంగీకరిస్తుందా?’’ అన్న ప్రశ్నలు సంధిస్తున్నారు. కేసీఆర్ మాదిరిగానే శివసేన నేతలు కూడా తెలంగాణ నేతలను ప్రశ్నిస్తే, అప్పుడు వారికి ఏం జవాబిస్తారని ప్రశ్నిస్తున్నారు. మహారాష్ట్రలో కూడా మరాఠా ప్రాంతీయాభిమానం బలంగా నాటుకుపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
‘‘ఆ విషయంలో తెలంగాణ ప్రజలే మిన్న. ఇక్కడున్న సెటిలర్లను వెళ్లిపొమ్మని ఎప్పుడూ చెప్పలేదు. చిన్న రాయి కూడా వేయలేదు.కానీ మహారాష్ట్రలో అట్లా కాదు. బయట వారిని వెళ్లిపొమ్మన్న ఉద్యమాలు జరిగాయి. మరి బీఆర్‌ఎస్ నేతలు అలాంటి రాష్ట్రానికి వెళ్లి రాజకీయం చేస్తే, వచ్చే ప్రశ్నలేమిటో సులభంగా అర్ధం చేసుకోవచ్చ’ని కామెంట్లు పెడుతున్నారు.
‘‘ షర్మిలను అడ్డుపెట్టుకుని సెంటిమెంటు రాజేసే జిమ్మిక్కులు ఈ ఎన్నికల్లో చెల్లవు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కేసీఆర్ లేదా రేవంత్‌రెడ్డి. ఇద్దరినే చూస్తున్నారు. అంతే తప్ప ఏ వాదాలు పనిచేయవు. తెలంగాణ సమాజం మునుపటి మాదిరిగా లేదు. అయినా పార్టీ పేరులోని తెలంగాణను తొలగించిన బీఆర్‌ఎస్, ఇంకా పాత వాదంతో గెలవాలనుకోవటం అమాయకత్వం’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ సోషల్‌మీడియా సైనికులు చాలా అలర్టుగా ఉన్నట్లు అర్ధమవుతోంది.