Suryaa.co.in

Andhra Pradesh

ఉద్యోగులతో స్నేహపూర్వకంగా వ్యవహరించే ప్రభుత్వమిది

-ఏ ఒక్కరినీ విస్మరించబోం
-ఉద్యోగుల పక్షపాతి సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
-రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులు అందరూ అర్థం చేసుకోవాలి
-ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం పునరాలోచన చేస్తుంది
-ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చిస్తుంది
-ఉద్యోగుల్ని ద్వేషించిన, అసభ్య పదజాలంతో దూషించిన వారి ట్రాప్‌లో పడొద్దు
-ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కనుకే లక్షా 30 వేల ఉద్యోగాలిచ్చాం
-ఉద్యోగులకు నష్టం చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం కాదు
-పీఆర్‌సీపై తెలంగాణతో పోల్చి చూసుకోవాలి. ఎక్కడా ఇంత పీఆర్‌సీ లేదు
-కరోనా సమయంలోనూ సీఎంగారు రూ.18 వేల కోట్లు ఐఆర్‌ కింద ఇచ్చారు
-ఏ రాష్ట్రంలోనైనా 27% ఐఆర్‌ ఇచ్చారా?
-రూ.10 వేల కోట్ల భారం పడుతున్నా ప్రభుత్వం 23% ఫిట్‌మెంట్‌ ఇచ్చింది
-ఉద్యోగులు తమ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావొచ్చు
-చర్చల ద్వారా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించవచ్చు
-ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కుట్ర చేస్తున్న వారి ట్రాప్‌లో పడొద్దు
-ఉద్యోగులందరికీ విజ్ఞప్తి చేసిన చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి

తాడేపల్లి:

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకోవాలని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి కోరారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం చర్చలు జరుపుతుందన్నారు. ప్రజాస్వామ్యంలో చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించవచ్చన్నారు. ఉద్యోగుల సమస్యలపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే ప్రభుత్వం కాదని గడికోట శ్రీకాంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.సీఎం క్యాంప్‌ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడిన చీఫ్‌ విప్‌ ఇంకా ఏమన్నారంటే..

1. ప్రభుత్వ ఉద్యోగుల్ని కించపరిచే వారిని బానిసలుగా చూసే వారిని గత ప్రభుత్వాల్లో చూశాం. బహిరంగ వేదికలపైన వేధించిన రోజులు చూశాం. పబ్లిక్‌గా ఓ పత్రికాధిపతి, ఆనాడు సీఎంగా ఉన్న వ్యక్తి టీ తాగుతూ ఘోరంగా.. అసభ్యమైన పదజాలంతో మాట్లాడింది లైవ్‌లో చూశాం. ఈరోజు వారు రాజకీయ లబ్ధి కోసం ఉద్యోగులకు న్యాయం చేయాలని మాట్లాడటం చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉంది. వారిది రాజకీయ లబ్ధి కోసం ఆర్టిఫిషియల్‌ ప్రేమ అని గడికోట మండిపడ్డారు.

2. గతంలో మా ప్రియతమ నాయకుడు వైయస్‌ఆర్‌ ఉద్యోగుల మంచి ఎలా కోరుకుంటారో అదే బాటలో జగన్‌ ప్రభుత్వం నడుస్తోంది. ఊహించని కరోనా పరిస్థితుల్లోనూ ఉద్యోగులకు ఐఆర్‌ 27% ఇవ్వాలని ఉద్యోగస్తులు అడక్కపోయినా సీఎం జగన్‌ ఆదేశించారు. ఆరోజున ఐఆర్‌ ఇవ్వకపోతే.. రూ.18000 కోట్ల భారం ప్రభుత్వంపై పడి ఉండేది కాదు. ఆ రూ.18,000 కోట్లతో చిన్న చిన్న కాంట్రాక్టు బిల్లులు అన్నీ క్లియర్‌ చేసి ఉండేవాళ్లం. గత ప్రభుత్వం రూ.80 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టి వెళ్లిపోయింది. అయినా ప్రభుత్వానికి ఉద్యోగస్తులపై గౌరవం ఉండబట్టే సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి రూ.18,000 కోట్లు ఐఆర్‌ ప్రకటించారు. కరోనా లాంటి పరిస్థితులు, ఎన్నో ఇబ్బందులు వస్తున్నా.. చేతికి ఎముక ఉండదని తండ్రికి మించిన దానగుణం జగన్‌ గారిలో ఎన్నోసార్లు చూసాం.

3. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోండని కోరాం తప్పితే.. ఏరకంగానూ ఉద్యోగస్తులను నష్టపరచాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా ఈ ప్రభుత్వం భావిస్తోంది. దయ ఉంచి మిమ్మల్ని ద్వేషించే వారి ట్రాప్‌లో పడకండని… మిమ్మల్ని ద్వేషించే వారిలోకి వెళ్లకండని గడికోట శ్రీకాంత్‌ రెడ్డి కోరారు.

4. ఐఆర్‌ 3–4% ఇచ్చినా ఆనాడు ఉద్యోగులు ఒప్పుకునేవాళ్లు. కానీ, రాబోయే రోజుల్లో రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని సీఎం వైయస్‌ జగన్‌ ఆనాడు 27% ఐఆర్‌ ఇవ్వటం జరిగింది. దేశంలో ఏ రాష్ట్రం చూసినా మనకన్నా తక్కువ ఇచ్చే పరిస్థితి. పక్కన ఉన్న తెలంగాణతో పోల్చి చూసుకున్నా కరోనా సమయంలో వారు ఐఆర్‌ ఇచ్చారా? ఈ ప్రభుత్వం రెండు డీఏలు ఇస్తాం. మూడు డీఏలు పెండింగ్‌ పెడతామంటే ఈ ప్రభుత్వంపై అంత భారం పడేది కాదు. అలా కాకుండా.. ఐదు డీఏలు ఒకేసారి ఇస్తామని ప్రభుత్వం చెప్పింది.

5. ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. వారి సమస్యలపైన ప్రభుత్వం ఉద్యోగులతో చర్చలు జరుపుతుంది. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం కాదు ఇది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకునే పరిస్థితిలో ఉద్యోగులు కూడా ముందుకు రావాలని గడికోట శ్రీకాంత్‌ కోరారు.

6. మొండివైఖరితో మిమ్మల్ని ద్వేషించే వ్యక్తులతో, మిమ్మల్ని అసభ్య పదజాలంతో దూషించే వ్యక్తుల ట్రాప్‌లో పడొద్దని ఉద్యోగ సంఘాల నాయకుల్ని విన్నవిస్తున్నానని గడికోట తెలిపారు. ఈ ప్రభుత్వం ఎప్పుడూ చిత్తశుద్ధితో ఉంటుంది. ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం కాబట్టే.. 1.30 లక్షల కొత్త ఉద్యోగాలు ఇవ్వటంతో పాటు.. అంగన్‌వాడీలు, ఆయాలు, మున్సిపల్‌ కార్మికుల జీతాలు పెంచటంతో పాటు, కాంట్రాక్టు ఉద్యోగులకు పే స్కేల్‌ ప్రకారం జీతాలు ఇవ్వమని చెప్పిన ప్రభుత్వం ఇది. ఏ ఒక్కరిపట్లా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించదని అన్నారు.

7. ఈ ప్రభుత్వం ఉద్యోగులకు ప్రకటించిన దాని ప్రకారం అన్ని కలుపుకుంటే జీతాలు పెరుగుతాయి. కేవలం కొంతమంది మాటలు విని, ప్రభుత్వంపై బురద చల్లే కార్యక్రమం కాకుండా.. అందరం ఒకరిని ఒకరం చేతులు కలిపి నడిస్తేనే ప్రభుత్వం నడుస్తుంది. ఉద్యోగులు పునరాలోచన చేయాలి. ఉద్యోగులతో ప్రభుత్వం మాట్లాడుతుంది. మొండిగా ఎప్పుడూ ముందుకు పోదు.

8. శత్రువులను ద్వేషించే ప్రభుత్వం కాదు ఇది. సంక్షేమ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కర్నీ మనిషిగా చూడండి.. ఓటరుగా చూడొద్దన్న ప్రభుత్వం ఇది. అందరి మంచి కోరుకునే ప్రభుత్వం ఇది. ఉద్యోగులకు కచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఈ కష్టకాలంలో పీఆర్‌సీ వల్ల రూ.10 వేల కోట్ల భారం పడుతున్నా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అంగీకరించారు. హెచ్‌ఆర్‌ఏపైన అందరితో మాట్లాడి మంచి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది. ఆవేశాలకు లోనై ప్రభుత్వాన్ని కించపరిచేలా కొంతమంది మాట్లాడుతున్నారు. అది సరైన పద్ధతి కాదు.

9. ఐఆర్‌ 27% ఏ రాష్ట్రంలో ఇచ్చారో ఉద్యోగులు చెప్పాలి. పొరుగున ఉన్న తెలంగాణతోనూ పోల్చి చూసుకోండి. ఉద్యోగుల కష్టాన్ని వృథాగా పోనివ్వదు. అందరికీ న్యాయం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆరోజున ఓ పత్రికాధిపతితో చంద్రబాబు ఏం మాట్లాడారు. ఈరోజున ఆ పత్రికాధిపతి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే ఉద్దేశంతో ప్రభుత్వాన్ని పదేపదే కించపరిచేలా మాట్లాడుతున్నారు. ఆరోజున చంద్రబాబు, ఆ పత్రికాధిపతి వాడిన పదాలు ఒకసారి గుర్తు చేసుకోండి.

10. దయ ఉంచి ఉద్యోగులు ఏం మంచి జరగాలని కోరుకుంటున్నారో.. ప్రభుత్వం దృష్టిలో పెట్టండి. ఉద్యోగులు అందరితో మాట్లాడి ఒక మంచి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కొంతమంది కుట్రలు, కుతంత్రాల్లో ఉద్యోగులు పడొద్దని కోరుతున్నాం.

మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ
– కరోనా కష్టకాలంలో రూ.18 వేల కోట్లు ఐఆర్‌ ఇచ్చిన ప్రభుత్వం ఇది. సంవత్సరానికి రూ.40 వేల కోట్లు ఆదాయం తక్కువ వస్తోంది. రాష్ట్రానికి వస్తున్న ఆదాయమూ, ఇతర రాష్ట్రాల్లో ఎంత ఇస్తున్నారో చూడండి. ఉద్యోగులు రాజకీయ పార్టీలుగా మాట్లాడటం మంచి పద్ధతి కాదు.

– ఉద్యోగుల అభిప్రాయాలను ప్రభుత్వం చర్చలకు పిలిచినప్పుడు తెలియజేయాలి. ఉద్యోగుల అభిప్రాయాలను ప్రభుత్వం వింటుంది. మీ అభిప్రాయాలను సీఎం గారి విన్నారు. సీఎం గారు ఒకమాట చెబితే దానిపైన నిలబడతారు.

LEAVE A RESPONSE