– తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర్యరాజన్
– దేశంలోనే అతిపెద్ద ట్రైబల్ మహా జాతర సందర్భంగా ఆదివాసి గిరిజనులకు ప్రత్యేక శుభాకాంక్షలు
– కేంద్ర గిరిజన మంత్రితో కలిసి సమ్మక్క సారలమ్మ మహా జాతరలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ దంపతులు
మేడారం, ఫిబ్రవరి -23: కుంభమేళా మేడారం మహా జాతరలో గవర్నర్ గా 3వ సారి పాల్గొనడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర్యరాజన్ అన్నారు.శుక్రవారం తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర్య రాజన్ కేంద్ర గిరిజన మంత్రి అర్జున్ ముండా తో కలిసి మేడారం మహా జాతరలో కొలువు తీరిన సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని తమ మొక్కులు చెల్లించారు.
మేడారం మహా జాతరలో పాల్గొనేందుకు వచ్చిన గవర్నర్ దంపతులు, గిరిజన మంత్రికి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దాసరి అనసూయ (సీతక్క) , ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు ఘన స్వాగతం పలికారు. అనంతరం మీడియా సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర్య రాజన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ ముఖ్యంగా గిరిజనులు సంతోషంగా ప్రశాంతంగా ఆరోగ్యవంతంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని, గిరిజనులకు అతి పెద్ద పండుగ మేడారం మహా జాతరలో 3వ సారి పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని గవర్నర్ తెలిపారు.
తెలంగాణ కుంభమేళా మేడారం మహా జాతర సందర్భంగా రాష్ట్రంలోని దేశంలోని గిరిజనులు అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు గవర్నర్ తెలిపారు. లక్షలాదిమంది భక్తులు వచ్చి అమ్మవార్లకు తమ మొక్కలు చెల్లించు కుంటున్నారని, జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు.
గవర్నర్ గా విధులు నిర్వహిస్తూ తాను సైతం 6 గిరిజన, ఆదివాసి గ్రామాలను దత్తత తీసుకోవడం జరిగిందని, ఆదివాసి గిరిజనుల అభివృద్ధి కోసం అవసరమైన కృషి చేస్తానని గవర్నర్ పేర్కొన్నారు.
కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా మాట్లాడుతూ దేశ అభ్యున్నతిలో ఆదివాసీలు గిరిజనులు కీలక పాత్ర పోషిస్తున్నారని, దేశవ్యాప్తంగా దాదాపు పది కోట్ల మంది ఆదివాసీలు గిరిజనులు నివసిస్తున్నారని, ఈ మహా జాతర సందర్భంగా వారందరికీ తన శుభాకాంక్షలు తెలిపారు.
మేడారం మహా జాతరకు వచ్చి అమ్మవారు దర్శించుకున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసీ గిరిజనుల సైతం మేడారం మహా జాతర గురించి తెలుసుకోవాలని, రాబోయే రోజుల్లో ఇక్కడి అమ్మవార్లను దర్శించుకోవాలని ఆయన పేర్కొన్నారు.
అనంతరం రాష్ట్ర మంత్రులు తెలంగాణ గవర్నర్ కు కేంద్ర గిరిజన మంత్రి ను సత్కరించారు . ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ప్రత్యేక నోడల్ అధికారులు ఆర్వి కర్ణన్, కృష్ణ ఆదిత్య, జిల్లా ఎస్పీ శబరిష్, ఇతర ఉన్నతాధికారులు సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.