Suryaa.co.in

Andhra Pradesh

ఇది ప్రజా విజయం

– అధిక మెజార్టీతో నగరంలో చరిత్ర సృష్టించాం
– నన్ను, నా సతీమణి భవానీ, తండ్రి అప్పారావును చాలా ఇబ్బంది పెట్టారు
– మమ్మల్ని వైకాపా వారు ఎన్నో ప్రలోభాలకు గురి చేశారు
– ప్రాణం ఉన్నంత వరకూ టీడీపీలోనే ఉంటాం
– నగరాభివృద్ధికి తాము ప్రకటించిన మ్యానిఫెస్టోకు కట్టుబడి ఉన్నాం
– కార్యాచరణ కూడా చేపట్టాం
– మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌

రాజమహేంద్రవరం : తమ గెలుపు ప్రజా విజయమని, తమ విజయానంతటికీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల కృషి వల్లే సాధ్యమైందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) పేర్కొన్నారు.

స్థానిక తిలక్‌ రోడ్డులోని ఎన్నికల క్యాంపు కార్యాలయంలో ఆయన జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్‌ఛార్జ్‌ అత్తి సత్యనారాయణ, బీజేపీ నగర ఇన్‌ఛార్జ్‌ యెనుముల రంగబాబు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.

రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గానికి సంబంధించి గతంలో ఎవరికీ రానంత మెజారిటీ తనకు వచ్చిందని, 70 వేలకు పై చిలుకు మెజారిటీ రావడం అనేది చిన్న విషయం కాదన్నారు. అదంతా తన ఘతన కాదని, టీడీపీ, జనసేన, బీజేపీ ఇలా అందరి సహకారంతో సాధ్యపడిరదన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వారు మీడియా సమావేశాల్లో తనను చాలా విమర్శలకు గురి చేశారని, తనకు సీటు రాదన్నారు. సీటు వచ్చింది.

తర్వాత ఓడిపోతారని వ్యాఖ్యలు చేశారు. 70 వేలు మెజార్టీ వచ్చింది… ఇప్పుడు ఏం మాట్లాడతారు అని వైఎస్సార్‌సీపీ నాయకులు, పేటిఎం బ్యాచ్‌లను ఆదిరెడ్డి శ్రీనివాస్‌ నిలదీశారు. మేము చేసిన అభివృద్ధే మమ్మల్ని గెలుపిస్తుందన్నారు… మేము నిర్మించుకున్న వ్యవస్థలే మాకు విజయం చేకూరుస్తాయన్నారు… మరి ప్రజలు ఎందుకు తిరస్కరించారో ఆత్మ విమర్శ చేసుకోవాలని వైకాపా వారికి సూచించారు. హేళన చేసిన వైకాపా 11 సీట్లకే పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థితికి చేరుకుందన్నారు.

తన భార్య ఆదిరెడ్డి భవానీని అసెంబ్లీలో అవమానించారని గుర్తు చేశారు. తనను, తన భార్య భవానీని సుమారు 2 నెలల పాటు ప్రశాంతంగా నిద్రపోకుండా చేశారన్నారు. తనను, తన కన్న తండ్రిని చాలా ఇబ్బందులకు గురి చేశారని, చాలా ప్రలోభాలకు గురి చేశారని గుర్తు చేశారు. తమ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకూ తాము తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతామన్నారు. వైకాపా వారు చాలా చిల్లర రాజకీయాలు చేశారన్నారు.

రాజమండ్రి సిటీ పరంగా కూటమి నుంచి అనేక హామీలు ఇచ్చామన్నారు. నగరాభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో స్పష్టమైన ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయన్నారు. తాను విజయం సాధించిన వెంటనే 4వ తేదీ నుంచే కార్యచరణ చేపట్టడం జరిగిందన్నారు. నగరాభివృద్ధి పరంగా తాము ప్రకటించిన మ్యానిఫెస్టోను మరో మూడు నెలల్లో అమలు పరుస్తామన్నారు.

చెత్తపన్ను రద్దు చేసేందుకు, విద్యుత్‌ భారాలు తగ్గించేందుకు ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. కక్షలు, వేధింపులకు దిగే పార్టీలు, మనస్తత్వాలు తమవి కాదని, ఆ ఆలోచనలు కూడా తమకు లేవన్నారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమన్నారు. రాష్ట్రానికి రాజధాని తీసుకురావడమన్నారు.

కేంద్రంలో టీడీపీ, జనసేన పార్టీలు కీలక పాత్ర పోషించనున్నాయన్నారు. రెండు పార్టీలు కూడా కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి రాష్ట్రాభివృద్ధికి కృషి చేయడమేనన్నారు. వైకాపా వారిలా అధికార దుర్వినియోగం చేయమని స్పష్టం చేశారు. పదవులు, అధికారం తమకు కొత్త కాదన్నారు. తమకు ఇలాంటి విజయాన్ని అందించిన ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. ఇది ప్రజల విజయంగా ఆయన అభివర్ణించారు. గత ఐదేళ్లుగా అన్ని వ్యవస్థలను విధ్వంసం చేశారన్నారు. కనీసం బతికేందుకు కూడా వీలులేకుండా వైకాపా వారు చేశారని ఆయన ఆరోపించారు.

ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారన్న అన్నింటినీ సరిదిద్దుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ప్రజలు తమకు ఇచ్చిన అధికారాన్ని సేవగానే భావిస్తామన్నారు. అధికారంలోకి వచ్చామని ఆనంద పడబోమని, ఇది ఒక బాధ్యతగా గుర్తించి ఈ రాష్ట్రాన్ని గాడిన ఎలా పెట్టాలన్న దానిపై ఫోకస్‌ పెడతామన్నారు. తమ సూపర్‌ సిక్స్‌ హామీలకు ప్రజలు కనెక్ట్‌ అయ్యారన్నారు. ప్రజలు ఇంతటి విస్పష్టమైన తీర్పును గతంలో ఎన్నడూ ఇవ్వలేదని ఆయన అభిప్రాయపడ్డారు.

LEAVE A RESPONSE